నీలం సాహ్నీ నియామ‌కంపై.. కోర్టులో ఏమ‌వుతుందో!

ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు  ఏవైనా వాటిపై కోర్టుల్లో పిటిష‌న్లు తప్ప‌వు. బ‌హుశా చ‌రిత్ర‌లో ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం ఎదుర్కొన‌ని రీతిలో కోర్టుల్లో ప‌రీక్ష‌ల‌ను ఎదుర్కొంటోంది వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం. పెద్ద నిర్ణ‌యాలు,…

ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు  ఏవైనా వాటిపై కోర్టుల్లో పిటిష‌న్లు తప్ప‌వు. బ‌హుశా చ‌రిత్ర‌లో ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం ఎదుర్కొన‌ని రీతిలో కోర్టుల్లో ప‌రీక్ష‌ల‌ను ఎదుర్కొంటోంది వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం. పెద్ద నిర్ణ‌యాలు, చిన్న నిర్ణ‌యాలు అంటూ తేడా లేకుండా.. ఏపీ ప్ర‌భుత్వంలో చీమ చిటుక్కుమ‌న్నా కోర్టుల్లో పిటిష‌న్లు ప‌డిపోతూ ఉన్నాయి.

ల‌క్ష‌ల రూపాయ‌ల కాంట్రాక్టు బిల్లులతో మొద‌లుపెడితే, రాజ‌ధాని అంశం, ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టే నిర్మాణాలు,  ఆఖ‌రికి స‌స్పెండ్ అయిన జ‌డ్జికి సంబంధించి కూడా రాష్ట్ర ప్ర‌భుత్వంపై కోర్టుల్లో పిటిష‌న్లు ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో ఏపీఎస్ఈసీ నీలం సాహ్నీ నియామ‌కం కూడా ఇప్పుడు కోర్టులో ప‌రీక్ష‌ను ఎదుర్కొంటూ ఉంది! 

ఈ అంశంపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సూటిగా తీసుకునే నిర్ణ‌యం ఏమీ లేదు. గ‌వ‌ర్న‌ర్ విచ‌క్ష‌ణాధికారం ప్ర‌కారం ఈ నియామ‌కం జ‌రుగుతుంది. అయితే ఈ ప‌ద‌వికి అర్హులైన వ్య‌క్తుల జాబితాను స‌మ‌ర్పించేది మాత్రం రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే. గ‌తంలోనూ ఇదే జ‌రిగింది, ఇదే తీరునే గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ నియామ‌కం జ‌రిగింది.

ఆయ‌న ప‌దవీ కాలం ముగియ‌డంతో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మాజీ సీఎస్ నీలం సాహ్నీనిని అంతా క్ర‌మ‌ప‌ద్ధ‌తి ప్ర‌కార‌మే నియ‌మించింది. నీలం సాహ్నీతో స‌హా మొత్తం ప‌ద‌కొండు మంది అధికారుల పేర్ల‌ను గ‌వ‌ర్న‌ర్ కు పంపారు. అందులో వ‌డ‌పోత త‌ర్వాత ముగ్గురు పేర్లు మిగిలాయి. ఆ మూడు పేర్ల‌లో గ‌వ‌ర్న‌ర్ నీలం సాహ్నీని ఎంపిక చేసిన‌ట్టుగా అప్ప‌ట్లో ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు వ‌చ్చాయి.

ఆ మేర‌కు గ‌వ‌ర్న‌ర్ పేరిట విడుద‌ల అయిన గెజిట్ లో కూడా.. స్ప‌ష్టంగానే పేర్కొన్నారు. అప్ప‌టికే నీలం సాహ్నీ ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఉండ‌గా.. ఆ ప‌ద‌వికి రాజీనామా చేస్తేనే ఆమె ఏపీ ఎస్ఈసీగా బాధ్య‌త‌లు స్వీక‌రించే అవకాశం ఉంద‌ని గ‌వ‌ర్న‌ర్ పేరిట విడుద‌ల అయిన ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టంగా పేర్కొన్నారు. ఆమె నిమాయకానికి పెట్టిన ష‌ర‌తు అది. ఆ ష‌ర‌తు మేర‌కు నీలం సాహ్నీ త‌న హోదాకు రాజీనామా చేసి, ఎస్ఈసీగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అంతా బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌ల మేర‌కు, ఇది వ‌ర‌కూ ఎస్ఈసీలు ఎలా నియ‌మితం అయ్యారో అదే రీతిన నీలం సాహ్నీ నియ‌మితం అయ్యారు.

అయితే.. ఈ నియామ‌కం చేసింది వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం హ‌యాంలో కావ‌డంతో కొంద‌రు కోర్టును ఆశ్ర‌యించారు. ఆమె ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఉన్న వ్య‌క్తి అని, ప్ర‌భుత్వ స‌ల‌హాదారునే ఎస్ఈసీగా నియ‌మించార‌ర‌ని ఈ నియామ‌కం చెల్ల‌ద‌ని తీర్పును ఇవ్వాల‌ని కోరుతూ కొంద‌రు ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. ప్ర‌స్తుతం కోర్టు ఈ పిటిష‌న్ విచారిస్తోంది. దీనిపై ప్ర‌భుత్వం స్పందిస్తూ.. సంప్ర‌దాయం, చ‌ట్ట‌ప్ర‌కార‌మే నీలం నియామ‌కం జ‌రిగింద‌ని వివ‌రించింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది.. ప‌రిశీల‌న‌లో ఉండిన అధికారుల పేర్ల‌ను, గ‌వ‌ర్న‌ర్ వారిలో ఒక‌రిగా నీలం సాహ్నీని ఎంపిక చేసిన వైనాన్ని కోర్టుకు వివ‌రించారు.

పిటిష‌న్ ను కొట్టి వేయాల‌ని కోరారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ కౌంట‌ర్ పై ప్ర‌తి వాద‌న ఏమిటో వినిపించాల‌ని పిటిష‌న‌ర్ ను కోర్టు ఆదేశించిన‌ట్టుగా తెలుస్తోంది. అందుకు పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది గ‌డువు కోర‌గా, విచార‌ణ వ‌చ్చే నెల ఎనిమిదికి వాయిదా ప‌డింద‌ని తెలుస్తోంది. మ‌రి సుప్రీం కోర్టు తీర్పు మేర‌కే నీలం సాహ్నీ నియామ‌కం జ‌రిగింద‌ని ప్ర‌భుత్వం అంటోంది. అలాగే గ‌త ఎస్ఈసీల నియామ‌కం తీరునే ఇప్పుడు ఎస్ఈసీ నియామ‌కం జ‌రిగింద‌ని ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు, గ‌వ‌ర్న‌ర్ ప్ర‌క‌ట‌నల ద్వారా తెలుస్తోంది. మ‌రి ఈ నియామ‌కం ప‌ట్ల అంతిమంగా కోర్టు ఎలా స్పందిస్తుంద‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది.

నీలం సాహ్నీ నియామ‌కాన్ని తెలుగుదేశం పార్టీ గ‌ట్టిగా వ్య‌తిరేకించిన సంగ‌తి తెలిసిందే. అచ్చం నిమ్మ‌గ‌డ్డ రమేష్ కుమార్ ను ఏ ర‌కంగా అయితే ఎస్ఈసీగా నియ‌మించారో, అదే ప‌ద్ధ‌తిలోనే నీలం సాహ్నీ నియామ‌కం కూడా జ‌రిగింది. అప్ప‌టి ప్ర‌భుత్వం ఒక జాబితాను పంపించ‌డం, ఆ జాబితాలోంచి అప్ప‌టి గ‌వ‌ర్న‌ర్ నిమ్మ‌గ‌డ్డ‌ను సెలెక్ట్ చేయ‌డం జ‌రిగింది. ఇప్ప‌టి ప్ర‌భుత్వం మ‌రో జాబితాను పంపించింది, ఈసారి గ‌వ‌ర్న‌ర్ నీలం పేరును సెలెక్ట్ చేశారు. స‌ల‌హాదారు ప‌ద‌వికి రాజీనామా చేసి ఎస్ఈసీ ప‌ద‌విని చేప‌ట్ట‌వ‌చ్చ‌ని ఆదేశించారు.

మ‌రి గ‌వ‌ర్న‌ర్ పేరిట జ‌రిగిన నియామ‌కం విష‌యంలో కోర్టులు జోక్యం చేసుకుంటాయా? ఈ నియామ‌కాన్ని ర‌ద్దు చేయాల‌ని గ‌వ‌ర్న‌ర్ ను ఏపీ హైకోర్టు ఆదేశించ‌వ‌చ్చా? ఆ ఆదేశాల‌ను గ‌వ‌ర్న‌ర్ పాటిస్తారా? వంటి రాజ్యాంగ‌ప‌ర‌మైన అంశాలు కూడా ఈ వ్య‌వ‌హారంలో ఆస‌క్తిదాయ‌కంగా మారాయి. కేవ‌లం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం చేసిన నియామ‌క‌మే అయితే.. వ్య‌వ‌హారం ఎలా ఉండేదో కానీ, ఇప్పుడు మాత్రం ఈ వ్య‌వ‌హారం అత్యంత ఆస‌క్తిదాయ‌కంగా మారింది.