కరోనా నివారణకు వ్యాక్సిన్ తయారు చేసిన ఘనత తమ కులానిదే అని చెప్పుకోవడంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆనంద పారవశ్యానికి లోనవుతున్నారు. అందుకే కోవాగ్జిన్ తయారీదారైన భారత్ బయోటెక్ సంస్థ తమదే అని ఏదో రకంగా ఆయన పదేపదే ప్రస్తావిస్తున్నారు. అయితే చంద్రబాబు టక్కుటమార గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాలాది విద్యల గురించి తెలిసిన తెలుగు సమాజం… భారత్ బయోటెక్ గురించి ప్రస్తావన వెనుక ఆయన దురుద్దేశాలను కనిపెట్టి నవ్వుకుంటోంది.
‘కొవిడ్ బాధితుల డిమాండ్ల సాధన దీక్ష’ పేరిట టీడీపీ ఆధ్వర్యంలో ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో మంగళవారం నిరసన కార్యక్రమాలు జరిగాయి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.
ముగింపు సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘దేశం గర్వించేలా కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకొచ్చిన భారత్ బయోటెక్‌కు జగన్‌రెడ్డి.. కులం బురద పూశారు. ఇదా నాగరికత? భారీగా వ్యాక్సిన్లు వేశామంటూ రోజూ ప్రచారం చేసుకోవడం కాదు… నిజంగా ఒక్క వ్యాక్సినైనా ఆయన కొన్నారా? ఇదేమని ప్రశ్నిస్తే వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీ మీ బంధువులదే అంటూ నాపై నెపం నెట్టారు’ అని మండిపడ్డారు.
ఇక్కడ కులం బురద పూయడం ఏంటో చంద్రబాబే చెప్పాలి. చంద్రబాబు తనకు తానుగా భుజాలు ఎందుకు తడుముకుంటున్నారో అర్థం కావడం లేదు. నీ బంధువులదే అనడానికి, నీ కులం వాళ్లదే అని చెప్పడానికి తేడా తెలియని స్థితిలో చంద్రబాబు ఉన్నారనుకోవాలా?
జగన్ ఒక్కసారి అంటే, చంద్రబాబు ఇప్పటికి వందసార్లు అనడం వెనుక ఉద్దేశం ఏంటి? అంటే భారత్ బయోటెక్ తమ కులం వాళ్లదే అని లోకానికి చంద్రబాబు చెప్పదలుచుకున్నారా? తనదేం నాగరికతో చంద్రబాబు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. బాబులో ఎందుకింత కులపిచ్చి, కులగజ్జి? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
‘కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులు పడే ఆవేదన, బాధ చూసైనా మీ మనసు కరగలేదా? కనికరం కలగలేదా?’ అని సీఎం జగన్‌ను ప్రతిపక్ష నేత చంద్రబాబు గట్టిగా నిలదీశారు. మరి తమరి మనసు కరగలేదా? అనే ప్రశ్నలకు చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా తన శక్తి మేరకు ఏపీ ప్రజానీకానికి సేవ చేయాలనే ఆలోచన రాకపోవడం విచారకరం.
ఏపీలో నాలుగు నియోజకవర్గాల్లో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి నెలలు గడుస్తోంది. ఒకవైపు కరోనా సెకెండ్ వేవ్ కూడా తగ్గుముఖం పట్టింది. ఇప్పటికీ వాటి అతీగతీ లేదనే విమర్శలున్నాయి. ఎంత సేపూ ప్రభుత్వంపై విమర్శలే తప్ప, ప్రజలకు ఏదైనా మంచి చేద్దామన్న ఆలోచన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబులో కొరవడడం ఏపీ సమాజం చేసుకున్న దురదృష్టం.