బీజేపీ రాజ్యసభ సభ్యుడు, టీడీపీ శ్రేయోభిలాషిగా పేరొందిన సుజనాచౌదరి వేసిన ఎత్తులు హైకోర్టులో చిత్తు అయ్యాయి. దీంతో అమెరికా వెళ్లడం ఇప్పట్లో వీలుకాకపోవచ్చు. సుజనాచౌదరి పిటిషన్ దురుద్దేశ పూరిత స్వభావాన్ని తెలంగాణ హైకోర్టు బట్టబయలు చేసింది.
ఆంధ్రా బ్యాంకుకు రూ.71.46 కోట్ల మేర మోసం చేశారంటూ విద్యుత్ ఉపకరణాల తయారీ పరిశ్రమ బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీ రింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై …సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లు కేసు నమోదు చేశాయి. ఈ కేసుతో సంబంధం ఉందంటూ ఎంపీ సుజనాచౌదరిపై కేంద్రం 2019, జూన్ 18న లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అయితే తనకు ఈ కేసుతో సంబంధం లేదని సుజనా చౌదరి అప్పట్లో గట్టిగా తన వాయిస్‌ను వినిపించారు.
ఈ నోటీసులను ఉపసంహరించుకోవాలంటూ సదరు నోటీసులపై అదే ఏడాది డిసెంబర్‌లో తెలంగాణ హైకోర్టులో ఆయన సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు గతంలో అమెరికా వెళ్లి రావడాన్ని అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి లుకౌట్ అంశం తెరపైకి వచ్చింది. ఆ నోటీసులను సవాల్ చేస్తూ మరోసారి ఆయన హైకోర్టును ఆశ్రయించారు. జూలై రెండో వారంలో అమెరికా వెళ్లడానికి ఆహ్వానం అందిందని, అత్యవసరంగా విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది మొహిల్ మాథుర్ వాదనలు వినిపించడానికి మొదలు పెట్టగా హైకోర్టు కీలక ప్రశ్న సంధించింది. ఇంతకూ ఆహ్వాన పత్రిక ఏదీ? ఎందుకు సమర్పించలేదు? అని న్యాయమూర్తి ప్రశ్నించారు.
అమెరికా వెళ్లడానికి అందిన ఆహ్వాన పత్రాన్ని సమర్పించకుండా లుకౌట్ నోటీసులపై ఎలా విచారణ చేపట్టాలంటూ ఎంపీ సుజనా చౌదరిని తెలంగాణ హైకోర్టు గట్టిగా ప్రశ్నించింది. అమెరికా నుంచి అందిన ఆహ్వానం సమర్పిస్తే తప్ప ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టలేమని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది.
ఎలాంటి ఆధారం చూపించకుండా విచారణకు అభ్యర్థించడాన్ని కోర్టు తప్పు బట్టింది. అమెరికా వెళ్లడానికి ఆహ్వానం సాకులు చూపి అనుమతి పొందాలనుకున్న సుజనాచౌదరి ఆటలు తెలంగాణ హైకోర్టులో సాగలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.