14 ఏళ్ల పాటు ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబునాయుడి పరిస్థితి మూడేళ్లలోనే ఇంత దిగజారిందా? అనే అనుమానం కలుగుతోంది. సాధారణంగా సినీ, పొలిటికల్ సెలబ్రిటీలను దగ్గరగా చూడని వ్యక్తులు, వారితో సెల్ఫీ దిగితే తెగ సంబరపడి పోతుంటారు. ఆ సెలబ్రిటీలు రోజూ ఎంతో మంది సామాన్యులతో ఫొటోలకు దిగుతూ వుంటారు. అవేవీ వారికి గుర్తుండవు. కానీ ప్రముఖులతో ఫొటో దిగిన వారు మాత్రం తియ్యని జ్ఞాపకంగా జీవిత కాలం దాచి పెట్టుకుంటారు. తమకు ఫలానా ప్రముఖులు బాగా తెలుసని బిల్డప్ ఇస్తుంటారు. అదో ఆనందం, తుత్తి.
ఇదంతా చంద్రబాబు చేష్టల్ని చూస్తుంటే చెప్పాలనిపిస్తోంది. ఢిల్లీలో ఒక సమావేశంలో ప్రధాని మోదీని చంద్రబాబు కలిశారు. యోగక్షేమాలను మోదీ అడిగారని టీడీపీ వర్గాలు ప్రకటించాయి. ఐదు నిమిషాలు ప్రత్యేకంగా బాబుతో మోదీ మాట్లాడారంటూ ప్రచారాన్ని ఎల్లో మీడియా ఊదరగొట్టింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఏదో జరగబోతోందని కలరింగ్.
ఆ మరుసటి రోజు ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. సమావేశంలో జగన్ మాట్లాడిన అంశాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు. అందరితో పాటు జగన్‌ను ప్రధాని పలకరించారే తప్ప, ప్రాధాన్యం ఇవ్వలేదని ఎల్లో మీడియా రాసుకొచ్చింది. ఎల్లో మీడియా, టీడీపీ అతి పోకడల్ని చూసి… వైసీపీ అసలేం జరిగిందో ఫొటోతో సహా బయట పెట్టింది.
ప్రధాని మోదీతో కలసి ముఖ్యమంత్రి జగన్ డిన్నర్ చేశారు. ఆ టేబుల్‌పై కూర్చునే అవకాశం ముగ్గురు ముఖ్యమంత్రులకే దక్కింది. వారిలో జగన్ ఒకరు. దాదాపు గంటకు పైగా ప్రధానితో సీఎం జగన్ చర్చించారు. కానీ ఈ విషయాన్ని ఎక్కడా జగన్, ఆయన పార్టీ నేతలెవరూ ప్రచారానికి పెట్టలేదు.
తాజాగా మోదీతో కలిసి జగన్ డిన్నర్ చేసే ఫొటో చూసిన తర్వాత పచ్చ బ్యాచ్‌కు తప్పకుండా భోజనం సహించదు. రెండుమూడు నిమిషాలు నిలబడి బాబుతో మాట్లాడితే, గంటకు పైగా కూచుని భోజనం చేస్తే… కడుపు మండదాండి? ఇక వారు భోజనం ఎట్లా చేయాలి? ఆకలి చచ్చిపోదా? మోదీకి ఇది న్యాయమా? 40 ఏళ్లకు పైగా రాజకీయ జీవితం తనదని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు చివరికి మోదీతో కరచాలనం, పలకరింపునకే ఉబ్బితబ్బిబ్బు కావడమా? చంద్రబాబు మరీ ఇంత దిగజారారా?
ఒకప్పుడు ప్రధానులు, రాష్ట్రపతులను చేయడంలో చక్రాలు, బొంగరాలు తిప్పానని ప్రచారం చేసుకున్న చంద్రబాబు… తాజాగా మోదీతో కరచాలనానికే పులకిస్తున్న చంద్రబాబు ఒక్కరేనా? చంద్రబాబు విపరీత ధోరణి చూస్తుంటే ఆయన మానసిక స్థితిపై అనుమానం, భయం కలుగుతున్నాయి. చంద్రబాబు రాజకీయంగా ఎంతగా పతనం చెందారో మోదీతో ముచ్చటపై అతి ప్రచారమే నిదర్శనం.