ఏపీ బీజేపీ రోజురోజుకూ వెర్రిపప్ప అవుతోంది. ఈ పాపంలో బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా భాగస్వామ్యం వుంది. ఆంధ్రప్రదేశ్‌లో 2024లో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ఏపీ బీజేపీ కలలు కంటోంది. అయితే ఈ కలలు నిద్రలో కంటున్నవే. ఎందుకంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు సాయం చేయకపోగా, తీవ్ర నష్టం చేస్తోందనే ఆగ్రహం కేంద్ర ప్రభుత్వంపై ఆ రాష్ట్ర ప్రజానీకంలో బలంగా వుంది. దీంతో ఇప్పట్లో బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌లో స్థానం లేదు.
అయితే జనసేనాని పవన్‌కల్యాణ్‌తో పొత్తులో ఉన్న బీజేపీ, కనీసం కొన్ని స్థానాల్లోనైనా గెలవాలని కోరుకుంటోంది. దీన్ని ఎవరూ కాదనలేరు. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుందామని మిత్రపక్షమైన జనసేనాని ప్రతిపాదనను బీజేపీ ఇప్పటికే తోసిపుచ్చింది. అవినీతి, కుటుంబ పార్టీలకు తాము దూరమంటూ సిద్ధాంతాల్ని తెరపైకి తెచ్చింది. దీన్ని స్వాగతించాల్సిందే. అయితే బీజేపీని జనం నమ్మకుండా వైసీపీ, టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి.
ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సఖ్యతగా ఉన్నామనే సంకేతాల్సి వైసీపీ, టీడీపీ నేతలు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ ఉండగా, ప్రత్యేకంగా బీజేపీ ఎందుకనే ప్రశ్న ఉదయిస్తోంది. ఎందుకంటే ఆ పార్టీలు రెండూ బీజేపీకి మద్దతు ఇస్తుండడంతో, మళ్లీ దాని వైపు చూడడం ఎందుకనే ప్రశ్న వస్తోంది.
వైసీపీ, టీడీపీలపై బీజేపీ చేస్తున్న విమర్శలను అంతా నాటకంగా జనం భావిస్తున్నారు. ఢిల్లీలో కరచాలనాలు, గల్లీలో కత్తులు దూసుకుంటామంటే ఎవరూ నమ్మరని అంటున్నారు. అందుకే ఏపీలో బీజేపీ రోజురోజుకూ దిగజారుతోంది.