తెలంగాణలో కేసీఆర్ మరోసారి అధికారానికి చంద్రబాబు బాట వేస్తున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్, ఏడాది ముందుగానే ఎన్నికలకు వెళ్లారు. టీఆర్ఎస్ ఒకవైపు, కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులు మరోవైపు, బీజేపీ ఒంటరిగా తలపడ్డాయి. కాంగ్రెస్, టీడీపీ, కోదండరాం పార్టీ, వామపక్షాలన్నీ ఏకమై చేసిన హడావుడి చూసి… ఆ కూటమి అధికారంలోకి వస్తుందేమో అనే అభిప్రాయం కలిగింది.
కానీ కూటమిలో చంద్రబాబు చేరడంతో కేసీఆర్కు ఆయుధం చిక్కినట్టైంది. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఆంధ్రా వాళ్లే పాలించాలా? అంటూ కేసీఆర్ సెంటిమెంట్ రగిల్చారు. పైగా కాంగ్రెస్, టీడీపీ పొత్తును తెలంగాణ సమాజం ఆమోదించలేదు. పచ్చి తెలంగాణ వ్యతిరేకితో తెలంగాణవాదులు రాజకీయ అవసరాల కోసం కలవడాన్ని ఆ రాష్ట్ర ఓటర్లు జీర్ణించుకోలేకపోయారు. దీంతో కాంగ్రెస్-టీడీపీ కూటమిని చిత్తుచిత్తుగా ఓడించారు.
తెలివైన వాళ్లెవరైనా ఏం చేస్తారు? గతానుభవాలను పాఠాలుగా నేర్చుకుంటారు. మరి బీజేపీ చేస్తున్నదేంటి? వచ్చే ఏడాదిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబుతో ఒప్పందం చేసుకుంటుందట. తెలంగాణలో బీజేపీకి తెలుగుదేశం మద్దతు ఇచ్చేలా, అందుకు ప్రతిఫలంగా ఆంధ్రాలో చంద్రబాబుకు సహకారం అందించేలా అవగాహనకు వచ్చారనే అనుమానాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తం చేశారు.
దీంతో తెలంగాణలో బీజేపీ, టీడీపీ పొత్తు కుదుర్చుకుంటారనే చర్చకు బలం కలిగింది. ఒకవేళ అదే జరిగితే మరోసారి కేసీఆర్కు ఎన్నికల కోసం వజ్రాయుధాన్ని ఇచ్చినట్టే. గతంలో కాంగ్రెస్ను టార్గెట్ చేసినట్టుగానే, ఈ సారి అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీకి నష్టం కలిగించడం కేసీఆర్కు ఈజీ అవుతుంది.
తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబుతో బీజేపీ జతకట్టి తెలంగాణలో అధికారంలోకి రావాలని అనుకుంటోందనే ప్రచారాన్ని ఆయన తప్పక మొదలు పెడతారు. ప్రజల్లో భావోద్వేగాల్ని రగిలించడంతో కేసీఆర్కు మరెవరూ సాటిరారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం చంద్రబాబుతో బీజేపీ అవగాహనకు వచ్చిందంటే మాత్రం కేసీఆర్కు మరోసారి అధికారం దక్కుతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే తెలంగాణ వ్యతిరేక శక్తుల్లో చంద్రబాబు మొదటి వరుసలో ఉన్నారు.
తెలంగాణ పాలిట చంద్రబాబు ఓ విలన్. అలాంటి నాయకుడిని ముందు పెట్టుకుని బీజేపీ ఎన్నికలకు వెళ్లడమంటే భస్మాసుర హస్తాన్ని తలపై పెట్టుకోవడమే. చంద్రబాబు మొహం చూపిస్తూ, తిట్టిపోస్తూ అధికారాన్ని పొందడానికి కేసీఆర్ వ్యూహాలను రచిస్తారనడంలో రెండో అభిప్రాయానికి తావు లేదు. మరి బీజేపీ ఆ తప్పు చేస్తుందా, లేదా అనేది ఆ పార్టీ విజ్ఞతపై ఆధారపడి వుంది.