మోదీని ప‌ట్టించుకోని ‘న‌మ‌స్తే’

ఎవ‌రు ఒప్పుకున్నా ఒప్పుకోక‌పోయినా మోదీ ఈ దేశానికి ప్ర‌ధాని, ఆయ‌న విధానాలు న‌చ్చినా న‌చ్చ‌క‌పోయినా ప్ర‌ధానికి ఇవ్వాల్సిన గౌర‌వం ఇవ్వాల్సిందే. అయితే మోదీ హైద‌రాబాద్ వ‌స్తే KCR వూర్లో వుండ‌డు. బిజెపి ఆయ‌న ప్ర‌త్య‌ర్థి…

ఎవ‌రు ఒప్పుకున్నా ఒప్పుకోక‌పోయినా మోదీ ఈ దేశానికి ప్ర‌ధాని, ఆయ‌న విధానాలు న‌చ్చినా న‌చ్చ‌క‌పోయినా ప్ర‌ధానికి ఇవ్వాల్సిన గౌర‌వం ఇవ్వాల్సిందే. అయితే మోదీ హైద‌రాబాద్ వ‌స్తే KCR వూర్లో వుండ‌డు. బిజెపి ఆయ‌న ప్ర‌త్య‌ర్థి కావ‌చ్చు, మోదీ వ‌చ్చింది బిజెపి నాయ‌కుడిగా కాదు, ప్ర‌ధానిగా. అయినా KCR తాను చేయాల్సింది చేసారు.

న‌మ‌స్తే తెలంగాణా పార్టీ ప‌త్రికే కావ‌చ్చు. వాటికి కూడా కొన్ని ప‌ద్ధ‌తులుంటాయి. సాక్షిలో చంద్ర‌బాబు వార్త‌లు, ఆంధ్ర‌జ్యోతిలో జ‌గ‌న్ వార్త‌లు ప్రాధాన్య‌త బ‌ట్టి ఫ‌స్ట్ పేజీలో వ‌స్తూ వుంటాయి. అయితే ప్ర‌ధాని హైద‌రాబాద్ వ‌స్తే న‌మ‌స్తేలో ఆ వార్త ఫ‌స్ట్ పేజీలో లేదు. లోప‌ల ఎక్క‌డో గుర్తింపు లేకుండా వుంది. ఫ‌స్ట్ పేజీలో KCR ప‌ర్య‌ట‌న‌, KTR ఒప్పందాలు, మోదీపై హ‌రీష్‌రావు విమ‌ర్శ‌లు వున్నాయి.

ఒక‌ప్పుడు ఎమర్జెన్సీకి వ్య‌తిరేకంగా ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ పోరాడింది. ప‌త్రికా ప్ర‌మాణాల్ని హిందు ఇంకా కాపాడుకుంటూ వుంది. మ‌న తెలుగు ప‌త్రిక‌లే మ‌రీ అన్యాయంగా రాజ‌కీయ పార్టీల్లో క‌లిసిపోయాయి. ఫ‌స్ట్ పేజీలో వార్త లేనంత మాత్రానా ప్ర‌ధానికి వ‌చ్చిన న‌ష్టం లేదు. ఒక‌వేళ వార్త వేస్తే బిజెపి తెల్లారేస‌రికి గెలిచిపోదు. వ్య‌క్తిగ‌త త‌గాదాలు నాయ‌కుల‌కే కాదు, పత్రిక‌లకీ అంటుకున్నాయి. జ‌ర్న‌లిజ‌మంటే ఒక‌ప్పుడు స‌త్య‌శోధ‌న‌, ఇపుడు రంధ్రాన్వేష‌ణ‌.

జ‌ర్న‌లిజం స్కూళ్ల‌లో ఒక‌ప్పుడు తెలుగు భాష‌, ఇంగ్లీష్ అనువాదం, జ‌న‌ర‌ల్ నాలెడ్జీ నేర్పించేవాళ్లు. ఇపుడు కావాల్సింది ఆయా పార్టీల‌కి, నాయ‌కుల‌కి అనుగుణంగా వుంటూ, అనుకూల వార్త‌లు రాయ‌డం.

జీఆర్ మ‌హ‌ర్షి