మోదీ సర్కార్ ఏపీ విభజన చట్టాన్ని అమలు చేయకపోవడానికి కారణాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆలస్యంగానైనా భలే కనుక్కున్నారు. ఏపీ విభజన చట్టాన్ని అమలు చేయని మోదీ సర్కార్‌ది ఎంత మాత్రం తప్పు కాదు. ఎందుకంటే ఆ చట్టాన్ని సరిగా రాయని వాళ్లదే తప్పని విజయసాయిరెడ్డి తేల్చేశారు. అది కూడా తన మిత్రుడైన జైరాం రమేశ్ విభజన చట్టాన్ని సక్రమంగా రాయలేదని విజయసాయిరెడ్డి రాజ్యసభలో చెప్పడం విశేషం.
“దురదృష్టవశాత్తు నా స్నేహితుడు జైరాం రమేశ్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టాన్ని తప్పులతడకగా రాశారు. shallకు బదులుగా ప్రతిచోట may అనే పదాన్ని వాడారు. దీన్ని సాకుగా తీసుకున్న ఎన్‌డీఏ సర్కార్ విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయలేదు. అయితే జైరాం రమేశ్ తప్పిదం వల్ల ఆంధ్రప్రదేశ్ మూల్యం చెల్లించడానికి వీల్లేదు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలి” అంటూ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.
గతంలో చంద్రబాబు హయాంలో కూడా ఇవే ఇబ్బందుల వల్ల ఏపీ విభజన చట్టం హామీలను సాధించలేకపోయారని అర్థం చేసుకోవాలేమో. అప్పుడేమో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వైసీపీ యుద్ధం చేసింది. ఎక్కడికక్కడ చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతను బజారున పెట్టింది.
ఇప్పుడేమో యూపీఏ ప్రభుత్వంపై తప్పు నెట్టడానికి విజయసాయిరెడ్డి వెనుకాడడం లేదు. నాటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ తప్పిదాల వల్లే ఎన్‌డీఏ సర్కార్ ఏపీకి ఏమీ చేయలేకపోతున్నదనే ఆవేదన విజయసాయిరెడ్డిలో కనిపిస్తోంది.