రెండున్నరేళ్లుగా సాగుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. తాజా షెడ్యూల్ తో ఈ సినిమాకు సంబంధించి టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. 2 పాటలు మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్టు ఆర్ఆర్ఆర్ యూనిట్ ప్రకటించింది.
మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సంబంధించి కూడా అప్ డేట్ ఇచ్చింది. 2 భాషలకు సంబంధించి రామ్ చరణ్, ఎన్టీఆర్ పూర్తిగా డబ్బింగ్ చెప్పేశారని, మిగతా భాషల డబ్బింగ్ కూడా అతి త్వరలో పూర్తవుతుందని తెలిపింది.
ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఒకే బైక్ పై ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చక్కర్లు కొడుతున్న స్టిల్ ను విడుదల చేశారు. గుర్రంపై చరణ్, బైక్ పై ఎన్టీఆర్ పోటీపడుతున్న స్టిల్ ను గతంలో విడుదల చేసిన యూనిట్, ఈసారి ఇలా ఇద్దర్నీ ఒకే బైక్ పై కూర్చోబెట్టింది.
అయితే షూటింగ్ అప్ డేట్ ఇచ్చిన యూనిట్, రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఏడాది ఈ సినిమా వచ్చే ఛాన్స్ లేదంటూ ఇప్పటికే చాలా కథనాలొచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్తగా మరో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారని అంతా ఆశించారు. కానీ యూనిట్ మాత్రం ప్రస్తుతానికి షూటింగ్ అప్ డేట్ ఇవ్వడం వరకే పరిమితమైంది.
సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ (మరీ ముఖ్యంగా గ్రాఫిక్ వర్క్) ఓ కొలిక్కి వచ్చిన తర్వాత అప్పుడు విడుదల తేదీని ప్రకటిస్తారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలతో పాటు మొత్తంగా 13 భాషల్లో ఆర్ఆర్ఆర్ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో, 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. సీత పాత్రలో అలియాభట్ నటించింది.