మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి పవన్ కల్యాణ్ అభిమానులకు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ట్విట్టర్ వార్ ఓ రేంజ్ లో కొనసాగుతోంది. సిగ్గులేని వెధవ వెల్లంపల్లి అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ల వర్షం కురుస్తోంది. ఏకంగా 70వేల ట్వీట్లు దాటిపోయి ట్విట్టర్ లో అది ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది.
అసలేంటీ గొడవ..?
ఇటీవల ఆలయాల్లో పారిశుధ్య కార్మికుల నియామకాలకు సంబంధించి మంత్రి వెల్లంపల్లి డబ్బులు తీసుకుని పోస్టింగ్ లు ఇచ్చారంటూ జనసైనికులు ఆరోపించారు. దీనిపై స్పందించిన వెల్లంపల్లి, పవన్ కల్యాణ్ అభిమానులపై ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారని, విజయవాడలో ఒక్క సీటు కూడా ప్రభావితం చేయలేకపోయారని, పవన్ కల్యాణ్ అభిమానులంతా సిగ్గులేని వెధవలని అన్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ కి మండింది. సిగ్గులేని వెధవలం మేం కాదు, మీరేనంటూ.. హ్యాష్ ట్యాగ్ ని పాపులర్ చేశారు.
గతంలో ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా గెలిచిన వెల్లంపల్లి మెగా ఫ్యామిలికీ అనుచరుడిగా ఉండేవారు. ఆ తర్వాత కాలంలో 2014లో బీజేపీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తరపున పవన్ కల్యాణ్ ప్రచారానికి రాగా.. ఆయనతో సన్నిహితంగా మెలిగారు వెల్లంపల్లి. అలాంటి వ్యక్తి, మంత్రి అయిన తర్వాత జనసేనానికి కనీసం మర్యాద ఇవ్వడం లేదనేది పవన్ అభిమానుల వాదన, ఆవేదన.
అందుకే వెల్లంపల్లి పాత వీడియోలన్నిటినీ బయటకు తీసి మరీ ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. గతంలో పవన్ కల్యాణ్ ని వెల్లంపల్లి బతిమిలాడారని, ఇప్పుడు ఎదురు తిరిగారంటూ పాత వీడియోలకు కామెంట్లు పెడుతున్నారు. మొత్తమ్మీద ఈ ట్విట్టర్ వార్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హైలెట్ గా మారింది.
వెల్లంపల్లి బ్యాచ్ మాత్రం ట్వీట్లపై మండిపడుతోంది. పవన్ కల్యాణ్ అభిమానులు ఓట్లు వేయడానికి ముందుకు రాకపోయినా, ట్వీట్లకు మాత్రం ముందు వరుసలో ఉంటారంటూ మరోసారి సెటైర్లు పేలుస్తున్నారు. ఈ సోషల్ మీడియా వార్ ఇంకెన్ని రోజులు నడుస్తుందో చూడాలి.