ముంబై పిల్లల్లో కరోనా యాంటీబాడీలు..!

చిన్నపిల్లల్ని థర్డ్ వేవ్ ముప్పతిప్పలు పెడుతుందన్న భయాల నేపథ్యంలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన సర్వే కాస్త ఊరటనిచ్చే ఫలితాలను వెల్లడించింది. ముంబైలోని పిల్లల్లో 51.18 శాతం మంది కరోనా యాంటీబాడీలను కలిగి ఉన్నట్టు…

చిన్నపిల్లల్ని థర్డ్ వేవ్ ముప్పతిప్పలు పెడుతుందన్న భయాల నేపథ్యంలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన సర్వే కాస్త ఊరటనిచ్చే ఫలితాలను వెల్లడించింది. ముంబైలోని పిల్లల్లో 51.18 శాతం మంది కరోనా యాంటీబాడీలను కలిగి ఉన్నట్టు తేల్చింది.

ఏప్రిల్ నుంచి జూన్-15 మధ్యలో జరిగిన ఈ సర్వేలో 2179మంది చిన్నారులనుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 51.18శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు ఉన్నట్టు గుర్తించారు. అంటే వీరంతా గతంలో కొవిడ్ బారినపడి కోలుకున్నవారే. అయితే వీరిలో ఎవరికీ స్వల్ప లక్షణాలు కూడా లేవని తల్లిదండ్రులు చెప్పడం విశేషం. అంటే దాదాపుగా సెకండ్ వేవ్ సమయంలోనే చిన్నారులకు కొవిడ్ వచ్చి తెలియకుండానే తగ్గిపోయింది. అంటే థర్డ్ వేవ్ ప్రభావం కూడా చిన్నారులపై అంతంతమాత్రమే అనే విషయం స్పష్టమవుతోంది.

గతంలో కూడా ముంబై కార్పొరేషన్ ఇలానే సీరో సర్వేలు చేపట్టింది. ఇప్పుడిది మూడోది. గతంలో చేపట్టిన సర్వేలో 18ఏళ్లలోపువారిలో 39.4శాతం మందిలో కరోనా యాంటీబాడీలను గుర్తించారు. ఇప్పుడు ఏకంగా 51శాతానికి పెరగడం ఆశ్చర్యకరం. ముఖ్యంగా 10నుంచి 14ఏళ్లలోపు పిల్లల్లో 52.43శాతం మందిలో కరోనా యాంటీబాడీలుండటం గమనార్హం.

1 నుంచి 4 ఏళ్ల మధ్య వయసు ఉన్న పిల్లల్లో 51.04శాతం మందిలో కరోనా యాంటీబాడీలను గుర్తించారు. 5-9 సంవత్సరాల మధ్య ఉన్నవారిలో 47.33 , 10 నుంచి 14ఏళ్ల మధ్య వయసు వారిలో 53.46 , 15నుంచి 18 సంవత్సరాల మధ్య వయసువారిలో 51.39 మందిలో కరోనా యాంటీబాడీలను గుర్తించారు.

ఈ సర్వేను బట్టి థర్డ్ వేవ్ పిల్లలపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చనే వాదనకు బలం చేకూరినట్టయింది. పిల్లలపై సెకండ్ వేవ్ ప్రభావం చూపినా పెద్దగా నష్టం జరగలేదనే విషయం స్పష్టమైంది. యాంటీబాడీలను కలిగి ఉన్న చిన్నారులంతా కొవిడ్ వైరస్ ని సమర్థంగా ఎదుర్కోగలరు. కొంతమందిలో వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా శరీరంలో డెవలప్ కాని యాంటీబాడీలు.. చిన్నారులలో ఎక్కువ స్థాయిలో కనిపించడం విశేషం.