చూస్తుంటే, ప్రస్తుతం బాలీవుడ్ పైనే రకుల్ ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుంది. చిన్న సినిమాలైనా హిందీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే బాలీవుడ్ లో 3 సినిమాలు చేస్తున్న ఈ చిన్నది, ఈసారి మాత్రం పెద్ద ఆఫర్ దక్కించుకుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆమె త్వరలోనే అక్షయ్ కుమార్ సరసన నటించబోతోంది.
అక్షయ్ కుమార్ తో బెల్ బాటమ్ అనే సినిమా తీసిన రంజిత్ తివారీ, మరోసారి అదే హీరోతో ఇంకో ప్రాజెక్టు ఓకే చేయించుకున్నాడు. ఆ సినిమాలో రకుల్ ప్రీత్ ను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నాడు. హీరోయిన్స్ ఎంపికలో అక్షయ్ కుమార్ జోక్యం చేసుకోడనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆ హీరో గతంలోనే ప్రకటించాడు. సో.. అక్షయ్ సరసన రకుల్ నటించడం దాదాపు ఫిక్స్.
రకుల్ కు తెలుగు నుంచి పెద్దగా అవకాశాలు రావడం లేదంటూ ఈమధ్య ఓ ఇంగ్లిష్ డైలీ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన రకుల్, తను బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్లనే సౌత్ కు కాల్షీట్లు కేటాయించలేకపోతున్నానని తెలిపింది. సదరు పత్రిక జనాలొచ్చి తన కాల్షీట్లు సర్దుబాటు చేస్తే సౌత్ లో కూడా సినిమాలు చేస్తానంటూ సెటైర్లు వేసింది.
అలా ఆ కథనాన్ని ఖండించిన కొన్ని రోజులకే బాలీవుడ్ లో బడా ప్రాజెక్టులో నటించే అవకాశం అందుకుంది రకుల్. తెలుగులో ఆమె క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేసింది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఆ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.