రేవంత్ రెడ్డికి మొదటి పరీక్ష… పాసవుతాడా ?

కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి రేవంత్ రెడ్డికి వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది. 2017 లో రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చాడు. రేవంత్ రెడ్డిది సహజంగానే దూకుడు వైఖరి. ఏ విషయంలోనైనా…

కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి రేవంత్ రెడ్డికి వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది. 2017 లో రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చాడు. రేవంత్ రెడ్డిది సహజంగానే దూకుడు వైఖరి. ఏ విషయంలోనైనా దూసుకుపోవడం ఆయన తత్త్వం. టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేవాడు. అప్పట్లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడా ? రేవంత్ రెడ్డా? అన్నట్లుగా ఉండేది. కాంగ్రెస్ లో చేరగానే దూకుడుగా వ్యవహరించాడు. కానీ ఈయన వైఖరి సీనియర్ నాయకులకు నచ్చలేదు. 

రేవంత్ రెడ్డి కాగ్రెస్ లో చేరిన ఏడాదికే వర్కింగ్ ప్రసిడెంట్ కావడం సీనియర్ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. ఒక దశలో రేవంత్ కాంగ్రెస్ లో ఎందుకు చేరానా అని ఆవేదన చెందాడు. చాలా కాలం గాంధీ భవన్ కు కూడా వెళ్ళలేదు. కాంగ్రెస్ లో చేరగానే పాదయాత్రకు ప్లాన్ చేశాడు. దానికి సీనియర్ నాయకులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ లో సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని, ఏ విషయంలోనైనా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. నాయకులు తనను చిన్న చూపు చూసినా రేవంత్ ఏదో విధంగా సర్దుబాటు చేసుకున్నాడు.

ఇక అధ్యక్ష పదవికి ఈయన పేరు ఎప్పటి నుంచో వినిపిస్తోంది. కానీ అధిష్టానం ఆయన్ని ఎక్కడ అధ్యక్షుడిని చేస్తుందోనని భయపడిన సీనియర్ నాయకులు దాన్ని ఆపాలని విశ్వప్రయత్నాలు చేశారు. ఈ విషయంలో సీనియర్ నాయకుడు వి. హనుమంత రావు అలియాస్ వీహెచ్ అందరికంటే ముందున్నారు. పార్టీలో రెడ్ల డామినేషన్ పెరిగిపోయిందని. అధిష్టానం వారికే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శలు గుప్పించారు. ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సామాజిక వర్గమని, రేవంత్ కు పదవి ఇస్తే ఆయన రెడ్డి సామాజిక వర్గమేనని, కాబట్టి ఈసారి  పదవి బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధిష్టానానికి లేఖలు రాశారు.

కానీ చివరకు అధిష్టానం రేవంత్ వైపే మొగ్గింది. నిజానికి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా, ఏళ్ళ తరబడి అధికారంలో లేకపోయినా కేసీఆర్ ప్రలోభాలకు లొంగకుండా పార్టీలోనే కొనసాగుతున్నారు కొందరు సీనియర్ నాయకులు. అధ్యక్ష పదవి కోసం వారు డిమాండ్ చేయడంలో న్యాయం ఉంది. విధేయతనే లెక్కలోకి తీసుకుంటే పోటీపడిన వారిలో ఎవరో ఒకరికి పదవి ఇవ్వాలి. కానీ అధిష్టానం విధేయతకంటే దూకుడుకు ప్రాధాన్యం ఇచ్చింది. టీఆర్ఎస్ మీదికి దూసుకుపోయే రేవంత్ రెడ్డిని గుర్తించింది. కాంగ్రెస్ లో చేరి ఇంకా ఐదేళ్లు కాకుండానే పార్టీ చీఫ్ అయిపోయాడు రేవంత్ రెడ్డి.

మొత్తం మీద ఒక అధ్యాయం ముగిసింది. ఇక రేవంత్ కు తొలి పరీక్ష ఎదురుగా ఉంది. అదే హుజూరాబాద్ ఉప ఎన్నిక. అక్కడ ప్రధానంగా తలపడేది టీఆర్ఎస్ , బీజేపీ అని అందరూ అనుకుంటున్నదే. కాంగ్రెస్ ను అసలు లెక్కలోకి తీసుకోవడంలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు కాబట్టి సీన్ మారుస్తాడేమో చూడాలి. రేవంత్ ను అధ్యక్షుడిగా ప్రకటించగానే కోపంతో రగిలిపోయిన కోమటిరెడ్డి వెంకట రెడ్డి కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ లో డిపాజిట్ అయినా తెచ్చుకోవాలన్నాడు. అంటే కాంగ్రెస్ గెలవదని చెప్పడమన్న మాట. ఇప్పటివరకు జరిగిన అన్ని రకాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది.

నాగార్జున సాగర్ లో కురువృద్ధుడు జానా రెడ్డి కూడా మట్టి కరిచాడు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పేరు ప్రకటించకుండా ఆపింది ఆయనే కదా. ఉత్తమ్ కుమార్ హయాంలో కాంగ్రెస్ కు ఓటములే మిగిలాయి. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలోనూ అధికారంలోకి తెస్తామని రేవంత్ అధ్యక్షుడు కాగానే చెప్పాడు. 

ఆయన చెప్పినట్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందో రాదో చెప్పలేం. రేవంత్ రెడ్డి ముందుగా చేయాల్సిన పని హుజూరాబాద్ లో కాంగ్రెస్ ను గెలిపించడం. ఈ విషయంలో సీనియర్లు ఆయనకు ఎంతవరకు సహకరిస్తారో చెప్పలేం. మరి కాంగ్రెస్ గెలుస్తుందా ? డిపాజిట్ తెచ్చుకుంటుందా ? ఇప్పుడు గెలిస్తేగానీ అసెంబ్లీ ఎన్నికలకు జోష్ వస్తుంది.