మ‌హానాడు…తెస్తుందా నాటి వైభ‌వం!

ఒక‌ప్పుడు సూర్యుడిలా ఉజ్వ‌లంగా వెలిగిన టీడీపీ కాలం గ‌డిచేకొద్ది మిణుకుమిణుకుమంటూ ప్రాభ‌వం కోల్పోతోంది. నాటి వెలుగులు క‌రువ‌య్యాయి. త‌న‌కు తానుగా నిల‌బ‌డ‌లేని దుస్థితి. ఇత‌ర పార్టీల ఊతం కోసం ఎదురు చూస్తున్న ద‌య‌నీయ స్థితి.…

ఒక‌ప్పుడు సూర్యుడిలా ఉజ్వ‌లంగా వెలిగిన టీడీపీ కాలం గ‌డిచేకొద్ది మిణుకుమిణుకుమంటూ ప్రాభ‌వం కోల్పోతోంది. నాటి వెలుగులు క‌రువ‌య్యాయి. త‌న‌కు తానుగా నిల‌బ‌డ‌లేని దుస్థితి. ఇత‌ర పార్టీల ఊతం కోసం ఎదురు చూస్తున్న ద‌య‌నీయ స్థితి. ఇలాంటి ప‌రిస్థితిలో టీడీపీని చూడ‌డం ఆ పార్టీ అభిమానుల మ‌న‌సుల్ని నొప్పిస్తోంది. మండే సూర్యుడిగా  స్వ‌యం ప్ర‌కాశ శ‌క్తి అయిన‌  టీడీపీ, నేడు “చంద్రుడి”లా ప‌రాయి పార్టీల ప్రాప‌కం కోసం దిగ‌జారి దేబ‌రిస్తోంది. త‌నకు తానుగా అధికారంలోకి రాలేన‌నే భ‌యం టీడీపీ వెన్నులో వ‌ణుకు పుట్టిస్తోంది.

ద‌మ్ము, ధైర్యం వుంటే ఒంట‌రిగా రా అని త‌న‌కంటే 30 ఏళ్ల చిన్న‌దైన పార్టీ స‌వాల్ విసిరే స్థాయికి టీడీపీ దిగ‌జారింది. దీన్నిబ‌ట్టి ఆ పార్టీ ప్ర‌స్తుత ప‌రిస్థితి ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబుకు పార్టీ కంటే లోకేశ్ భ‌విష్య‌త్ ఎక్కువ భ‌యాం దోళ‌న‌ల్ని క‌లిగిస్తోంది. అనేక ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో మ‌హానాడు జ‌రుగుతోంది. అందుకే టీడీపీ త‌న వాస్త‌వ ప‌రిస్థితిపై అంత‌ర్మ‌థ‌నం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది.

మ‌రో రెండేళ్ల‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీడీపీ మ‌హానాడును ఘ‌నంగా నిర్వ‌హించ‌త‌ల‌పెట్టింది. ఇందుకు త‌గ్గ‌ట్టుగానే ఏర్పాట్లు చేస్తోంది. రానున్న ఎన్నిక‌లు టీడీపీ భ‌విష్య‌త్‌ను తేల్చేవి. అందుకే ఆ పార్టీ రానున్న ఎన్నిక‌ల‌ను 'డూ ఆర్ డై' అనే రీతిలో స‌వాల్‌గా తీసుకుంది. ఎన్నిక‌ల యుద్ధానికి శ్రేణుల్ని స‌న్న‌ద్ధం చేసేందుకు చిన్న అవ‌కాశాన్ని కూడా వ‌దిలిపెట్ట‌లేదు.

నాలుగు ద‌శాబ్దాల టీడీపీ ప్ర‌స్థానంలో అనేక ఉత్థాన‌ప‌త‌నాలున్నాయి. తెలుగు రాజ‌కీయాల‌ను, సామాజిక చైత‌న్యాన్ని తెలుగుదేశం ఆవిర్భావం ముందు, త‌ర్వాత అని చెప్పుకోవాల్సి వుంటుంది. అంత‌గా తెలుగు నేల‌పై టీడీపీ త‌న‌దైన ముద్ర వేసింది. టీడీపీ చ‌రిత్ర విష‌యానికి వ‌స్తే…. వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు దివంగ‌త ఎన్టీఆర్, ఆ త‌ర్వాత చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో స్ప‌ష్ట‌మైన తేడా కనిపిస్తుంది.

ఎన్టీఆర్ హ‌యాంలో బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు పెద్ద‌పీట వేశారు. చంద్ర‌బాబునాయుడి నాయ‌క‌త్వంలో బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ఓట్ల‌తో అంద‌లం ఎక్క‌డం త‌ప్ప‌, వారికి పెద్ద‌గా చేసిందేమీ లేద‌నే విమ‌ర్శ ఉంది. కార్పొరేట్ శ‌క్తుల‌కు చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇచ్చారు. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా సుజ‌నాచౌద‌రి, మాజీ మంత్రి నారాయ‌ణ‌, సీఎం ర‌మేశ్ త‌దిత‌రుల పేర్లు ఉద‌హ‌రించొచ్చు. త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు విఘాతం క‌లుగుతుంద‌నే భావ‌న ఏర్ప‌డితే, ఇలాంటి వాళ్లంతా ఏ మాత్రం పార్టీలో కొన‌సాగ‌ర‌నే వాస్త‌వం 2019 ఎన్నిక‌ల త‌ర్వాత చంద్ర‌బాబుకు తెలిసొచ్చింది.

అంతేకాదు, గ‌తంలో టీడీపీలో స‌మష్టిత‌త్వం క‌నిపించేది. కాలం గ‌డిచేకొద్ది ఆ పార్టీలో వ్య‌క్తి స్వామ్యం పెరుగుతూ వ‌స్తోంది. పార్టీ, దాని సిద్ధాంతాల‌కంటే చంద్ర‌బాబు, ఆ త‌ర్వాత లోకేశే లోక‌మ‌న్న‌ట్టు వ్య‌వ‌హారం న‌డుస్తోంది. ఈ వైఖ‌రే పార్టీ బ‌ల‌హీన‌త‌కు కార‌ణ‌మ‌నే చేదు నిజాన్ని గ్ర‌హించిన‌ట్టు లేదు. అంతెందుకు మ‌హానాడు వేడుక‌ను పుర‌స్క‌రించుకుని శుక్ర‌వారం వివిధ ప‌త్రిక‌ల‌కు పెద్ద ఎత్తున ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చారు. ఇందులో వ్య‌క్తిపూజ స్ప‌ష్టంగా ప్ర‌తిబింబించింది.

“మ‌ళ్లీ మీరే రావాలి” అంటూ చంద్ర‌బాబును కీర్తించ‌డం విశేషం. ఈ ప్ర‌క‌ట‌న‌ల్లో టీడీపీని గెలిపించాల‌నేది నామ‌మాత్ర‌మైంది. స‌మాజ‌మే దేవాల‌యం, ప్ర‌జ‌లే దేవుళ్ల నినాదంతో అశేష తెలుగు ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌ను ఎన్టీఆర్ పొందారు. అప్పుడు వేసిన పునాదులు బ‌ల‌మైన‌వి కావ‌డం వ‌ల్లే ….ఎన్నో ఆటుపోట్లు వ‌చ్చినా టీడీపీ బ‌లంగా నిలిచింది. అయితే కల‌కాలం ఆ పునాదులు అట్లే వుండ‌వు. పాల‌న‌లోనూ, పనుల్లోనూ, ప‌ద‌వుల్లోనూ అన్ని వ‌ర్గాల‌కు స‌మ‌ప్రాధాన్యం నినాదంతో వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సునామీలా దూసుకొస్తున్నారు. ఇప్ప‌టికే టీడీపీకి వెన్నెముక అయిన బీసీ సామాజిక వ‌ర్గాన్ని చాలా వ‌ర‌కూ త‌న వైపు తిప్పుకోగ‌లిగారు.

ఒక‌వైపు జ‌గ‌న్ త‌న అధికారాన్ని సుస్థిరం చేసుకోడానికి, సోష‌ల్ ఇంజ‌నీరింగ్ విష‌యంలో విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకు న్నారు. స్థానిక సంస్థ‌ల ప‌ద‌వుల‌ను గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా 70 శాతం పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల‌కు క‌ట్ట‌బెట్టారు. సొంత సామాజిక వ‌ర్గం కంటే వాళ్లే ఈ రోజు జ‌గ‌న్‌ను సొంతం చేసుకున్నారు. టీడీపీ బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల పార్టీ అనేది గ‌తం. వ‌ర్త‌మానంలో ఆ క్రెడిట్ వైసీపీకి వెళుతోంది. ముందు ఈ వాస్తవాన్ని టీడీపీ జీర్ణించుకోవాలి. అప్పుడే ఆ పార్టీకి భ‌విష్య‌త్‌. నిర్మొహ‌మాటంగా పార్టీ లోటుపాట్ల గురించి చ‌ర్చించుకునేందుకు మ‌హానాడు వేదిక కావాలి.

చంద్ర‌బాబు త‌ప్ప రాష్ట్రానికి, టీడీపీకి మ‌రో ప్ర‌త్యామ్నాయం లేద‌నే చెప్ప‌డం, ఆ పార్టీ బ‌ల‌హీన‌త‌కు సంకేతం. 2019లో త‌మ‌ను ఘోరంగా ఓడించిన ప్ర‌జ‌ల‌దే త‌ప్ప‌నే అహంకార ధోర‌ణి నుంచి ముఖ్యంగా చంద్ర‌బాబు బ‌య‌ట‌ప‌డాలి. త‌మ పాల‌న‌లో త‌ప్పులేం జ‌రిగాయో స‌మీక్షించుకోవాలి. పాల‌న‌లో ప్ర‌జ‌ల్ని బాధించిన అంశాల‌పై క్ష‌మాప‌ణ చెప్పాలి.

ఇలా అనేక విష‌యాల్లో చంద్ర‌బాబు, లోకేశ్‌, మిగిలిన టీడీపీ నేత‌లు మారాలి. అప్పుడే ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను చూర‌గొనే అవ‌కాశం వుంటుంది.  వ్య‌క్తుల‌ను కాకుండా టీడీపీ అనే పార్టీని, వ్య‌వ‌స్థ‌ల్ని బ‌లోపేతం చేసేలా మ‌హానాడు వేదిక కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటుందని ఆశిద్దాం. ఒక‌ప్ప‌ట్లా టీడీపీని స్వ‌యం ప్ర‌కాశ‌క శ‌క్తిగా తీర్చిదిద్దేందుకు మ‌హానాడు వేదిక అవుతుందా? లేక పొత్తుల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న‌తో తాను ప‌రాన్న‌జీవినే అని నిరూపిస్తుందా? ఇదే తేలాల్సింది.

సొదుం ర‌మ‌ణ‌