ఈ మధ్య టెన్త్ పేపర్ లీక్ గొడవ అందరికీ తెలుసు. నారాయణ అరెస్ట్, బెయిల్ అయిపోయాయి. కేసు ఎప్పటికో తేలుతుంది. తెలంగాణలో ఇప్పుడు పరీక్షలు మొదలయ్యాయి. ఇంకా లీకు వార్తలు వినలేదు.
ఇవన్నీ పక్కన పెడితే దేశంలో అతి పెద్ద సమస్య ఏమంటే ఈ డిజిటల్ కాలంలో పేపర్ లీక్ కాకుండా పరీక్షలు నిర్వహించడం ఎలా? పేపర్లు ఎక్కడో ఒక చోట ప్రింట్ చేయాలి. దాని కోసం కొందరు వర్కర్లు పని చేయాలి. ప్రతి ఒక్కరికీ ఫోన్లు వుంటాయి. ఒక్కడు క్లిక్ చేసినా అందరికీ తెలియడానికి పెద్ద టైం అక్కర్లేదు. రాజకీయాలు, అవినీతి, టెక్నాలజీ కలగలిసిపోయినపుడు గోప్యత పాటించడం ఎలా? పిల్లలు పరీక్షలు రాయడం ఒక ఎత్తైతే, తర్వాత ఉద్యోగాల కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకో సమస్య. అనేక రాష్ట్రాలు అవినీతిలో కూరుకుపోయి అసమర్థులు ఉద్యోగాలు పొందడానికి సహకరిస్తున్నాయి. చివరికి పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా అనర్హులతో నిండిపోయింది.
రెండేళ్ల క్రితం అర్జున్ సురవరం అనే సినిమా వచ్చింది. ఫేక్ సర్టిఫికెట్ల రాకెట్ కథ. కుర్రాళ్లకి కొంచెం కనెక్ట్ అయినట్టుంది. తెలివైన విద్యార్థి ఇపుడు ఎన్ని గండాలు దాటాలంటే పేపర్ లీక్ చేసకుని ఎక్కువ మార్కులు తెచ్చుకొని దొంగ విద్యార్థులతో పోటీ పడాలి. చదువు తర్వాత పోటీ పరీక్షల లీకేజీ, మార్కుల మోసాలు, ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు అమ్ముకునే వాళ్లు వీళ్లందరినీ తట్టుకుని జాబ్ సాధించాలి.
అన్ని రాష్ట్రాలు ఈ కుంభకోణాలకి అతీతమేం కాదు. ఆశ్చర్యం ఏమంటే బయట పడిన తర్వాత కూడా చాలా కేసులు మూసేశారు. అనర్హులు ఉద్యోగాల్లో కొనసాగుతూ రిటైర్ కూడా అయిపోయారు. ఇక ఉద్యోగాలు రాని వాళ్ల గురించి చెప్పాలంటే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం ప్రస్తుతం మనదేశంలో కోటి మంది డిగ్రీ హోల్డర్లు నిరుద్యోగులుగా ఉన్నారు. లెక్కల్లోకి రానివాళ్లు ఇంకో కోటి మంది వుంటారు.
వాస్తవానికి ఉద్యోగాలు ఇవ్వాలని కేంద్రానికీ లేదు, రాష్ట్రాలకి లేదు. ఎన్నికలు వస్తే కొద్ది రోజులు డ్రామా నడిచి, లోయర్ పోస్టులు కొన్ని ఫిల్ చేస్తారు. అప్పుడప్పుడు నోటిఫికేషన్లు వస్తే అభ్యర్థుల సంఖ్య ఊహకి అందదు. 2018లో రైల్వేశాఖ 2,83,747 పోస్టులకి మెగా నోటిఫికేషన్ వేస్తే 4 కోట్ల మంది అప్లై చేశారు. అప్లికేషన్ ఫీజు వందల కోట్లలో వచ్చింది. ఇంత చేస్తే రైల్వే వాళ్లు ఇచ్చిన ఉద్యోగాలు 1.32 లక్షలు మాత్రమే. మిగిలిన వాటి సంగతి ఎవరికీ తెలియదు. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు కోచింగ్ కోసం ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా కనీసం 30 వేల కోట్లు. ఇదంతా పేద, మధ్య తరగతి డబ్బు.
ఇంత ఖర్చుతో ఎగ్జామ్ రాస్తే లీకుల గొడవ. రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, బీహార్, గుజరాత్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ జరిగిన తర్వాత లీక్ వార్తలతో క్యాన్సిల్ అయ్యాయి.
మన నాయకుల సంగతికి వస్తే 3 వేల మంది టీచర్ల అక్రమ నియామకాల్లో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలాకి పదేళ్ల జైలుశిక్ష వేశారు. పదేళ్ల క్రితం పంజాబ్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌ని అరెస్ట్ చేశారు. వంద కోట్లు ఉద్యోగాల స్కామ్ చేశాడని ఆరోపణ. 2004లో యూపీలో 22500 మంది కానిస్టేబుళ్లని డబ్బులు తినేసి నియమించారు. దీని మీద కమిటీ వేస్తే ఆ అభ్యర్థులు ఎగ్జామ్‌లో సున్నా తెచ్చుకున్నా, మార్కులు వేసి పాస్ చేశారని తెలిసింది. దీనికి మించింది ఏమంటే వాళ్ల సర్టిఫికెట్లు కూడా ఫేక్. వాళ్లకు చేసిన ఇంటర్వ్యూలు కూడా నకిలీ.
ముఖ్యమంత్రి ములాయంతో పాటు 70 మంది పోలీస్ అధికారులకి కూడా వాటా వుందని కమిటీ తేలిస్తే అందరూ కలిసి రిపోర్ట్‌ని సమాధి చేశారు. మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణం జరిగింది. 2009-13లో ఈ “వ్యాపం (వ్యవసాయిక్ పరీక్షా మండల్)” పోటీ పరీక్షలన్నింటిలో స్కామ్ చేసింది. 2000 మందిని అరెస్ట్ చేశారు. వాళ్లలో విద్యామంత్రి కూడా ఉన్నారు. ఈ స్కాంతో సంబంధం ఉన్న 40 మంది విచారణ జరుగుతూ వుండగానే అసహజంగా చనిపోయారు.
కుంభకోణాలు ఎలాగూ జరగకమానవు అనుకుని మన వాళ్లు ఏం చేస్తున్నారంటే నోటిఫికేషన్లు మానేశారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వచ్చే ఏడాది అందరూ జూలు విదిలిస్తారు.
సెల్‌ఫోన్, ఇంటర్‌నెట్ బ్యాన్ చేస్తే లీకులు ఆగవు. లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నప్పుడు సూపర్‌వైజ్ చేయడం అంత ఈజీ కాదు. మరి దీనికి పరిష్కారం వెతకడం కష్టమే. రాజకీయ వ్యవస్థ చెడిపోతే, వాళ్లు అన్ని వ్యవస్థల్నీ చెడగొడతారు. వాళ్లు బాగుపడడం అంత సులభం కాదు.
జీఆర్ మహర్షి