ఏ దేశంలో సంక్షోభం తలెత్తినా, దాన్ని ఆంధ్రప్రదేశ్ కు ఆపాదించడాన్ని అలవాటుగా మార్చుకున్నారు చంద్రబాబు. అలా ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్ లాంటి దేశాల్ని వాడిన బాబు, ఇప్పుడు శ్రీలంకను ఎక్కువగా ఆపాదించడం మొదలుపెట్టారు. ఇప్పటికే శ్రీలంకకు, ఆంధ్రప్రదేశ్ కు ముడిపెడుతూ చాలా కామెంట్స్ చేశారు. ఈసారి ఆ అతి మరీ శృతిమించింది.
ఆర్థిక సంక్షోభం వల్ల శ్రీలంక నుంచి ఆ దేశ ప్రధాని, మంత్రులు పారిపోయారని, అదే గతి జగన్ కు కూడా పడుతుందన్నారు చంద్రబాబు. ఇలా ఓ దేశానికి, చిన్న రాష్ట్రానికి ముడిపెడుతూ తలాతోక లేని ఆరోపణలు చేశారు. కేవలం లక్ష మంది రోడ్డెక్కితే చాలంట, జగన్ పారిపోతారని అంటున్నారు.
ఈ ఆరోపణలు చేసే క్రమంలో చంద్రబాబు తన గత చరిత్రను మరిచిపోయినట్టున్నారు. ఆయన హయాంలో జరిగిన ఉద్యమాల్ని బాబు మరిచిపోతే ఎలా? లక్ష మంది కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు జరిగిన దాఖలాలున్నాయి. శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని మించి, సామాజిక సంక్షోభాన్ని సృష్టించారు చంద్రబాబు. కులాల చిచ్చురేపి ప్రజల మధ్య అంతరాలు సృష్టించారు. అలాంటి దుర్భర పరిస్థితుల్లోనే హ్యాపీగా తన టర్మ్ ను పూర్తి చేసుకున్నారు.
ఈ సంగతి పక్కనపెడితే.. ఏ రాష్ట్రం ఎంత అప్పులు చేయాలి అనే అంశంపై దేశంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏ రాష్ట్రం తనకుతానుగా విచ్చలవిడిగా అప్పులు చేయలేదు. వీటిపై కేంద్ర నియంత్రణ ఉంటుంది. ఈ విషయాలు తెలిసి కూడా చంద్రబాబు.. శ్రీలంకకు, ఏపీకి ముడిపెడతారు. జనాల్ని పిచ్చోళ్లను చేయడానికి ప్రయత్నిస్తారు. అయినా ఈ అప్పులకు ఆద్యుడు తానేననే విషయాన్ని మాత్రం బాబు చెప్పరు.
ఇవాళ్టి నుంచి మహానాడు పెట్టుకున్నారు చంద్రబాబు. ఇన్నాళ్లూ కార్యకర్తల్ని, నేతల్ని గాలికొదిలేసి ఇప్పుడు మరోసారి వాళ్లను బకరాలను చేయడానికే ఈ కార్యక్రమం. ఎప్పట్లానే ఈసారి కూడా ఉన్నఫలంగా అందరికీ ఎన్టీఆర్ గుర్తొస్తారు. అదే టైమ్ లో వైసీపీపై విమర్శలు కామన్. ఇలా సాగబోతోంది మహానాడు. ఈ తీరు మారనంతవరకు తెలుగుదేశం పార్టీ పరిస్థితి మారదు.