కేవలం ఒకే ఒక్క రోజు తేడా. అదే ఢిల్లీ. అదే రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్. ప్రధాని మోదీ సేమ్. వేర్వేరు సమావేశాలు. ముందు రోజు ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ సమావేశం, మరుసటి రోజు నీతి ఆయోగ్ 7వ పాలక మండలి సమావేశం. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశానికి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో ప్రధాని తెగ ముచ్చట్లు చెప్పినట్టు కథనాలు. కానీ జగన్ విషయానికి వచ్చే సరికి అలాంటివేవీ కనిపించలేదు.
జగన్‌పై ప్రధానికి అభిమానం తగ్గిందా? లేక బాబుపై పెరిగిందా? అనే సరదా ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ‘బాబు గారూ….ఏంటి మీరు అసలు ఢిల్లీకి రావడమే మానేశారు. అప్పుడప్పుడు వస్తూ వుండండి సార్. ఇది మీ ఇల్లే అనుకోండి. మీతో చాలా విషయాలు మాట్లాడాల్సి వుంది’ అని ప్రధాని అన్నట్టు సొంత మీడియా దండోరా వేసింది.
‘మా బాబు’కు ప్రధాని మోదీ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని జగన్‌ను హెచ్చరించడానికే ఈ కథనాల ట్రిక్కులనే సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జగన్ విషయానికి వచ్చే సరికి, ముఖ్యంగా వారాంతపు పలుకుల సార్ అయితే సహజంగానే వ్యతిరేక ధోరణిలో కథనం వండివార్చారు.
జగన్‌ను ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించారని వైసీపీ సొంత మీడియా, అభినందించారని రాజగురువు పత్రిక ఫొటోతో సరిపెట్టడం గమనార్హం.
ఇక నీతి ఆయోగ్ సమావేశంలో జగన్ మాట్లాడిన అంశాలను రాసుకొచ్చారు. గతంలో మోదీ హవా తగ్గిందనే భ్రమలో ఆయనపై యుద్ధమే ప్రకటించి, ఇప్పుడు ఆయన్ను ప్రసన్నం చేసుకోవాలనే తపన చూస్తే ఔరా అనిపించకుండా వుండదు. రంగులు మార్చడంలో ఊసరవెళ్లికి టీడీపీ, ఆయన అనుకూల మీడియా మించిపోయింది.