Advertisement

Advertisement


Home > Politics - Opinion

‘నల్ల’ మీడియా

‘నల్ల’ మీడియా

మీడియా అనేది ఒకప్పుడు సామాజిక బాధ్యత ఫీలయ్యే సేవారంగం. తర్వాత వ్యాపారం అయింది. తర్వాత కూడా రూపుమారుతూనే ఉంది. లాభాలు గడించే వ్యాపారం కాస్తా.. లాభాలకు, కనీసం నిర్వహణవ్యయానికి కూడా అవకాశం లేని వ్యాపారం గా దిగనాసిల్లినప్పటికీ.. మీడియాసంస్థలు జోరుగా నడుస్తున్నాయి.

కొత్తగా ఎంట్రీ ఇస్తున్న వారూ ఉన్నారు? ఎలా సాధ్యం? మీడియా- వ్యాపారం లో లాభాలకు ఎప్పటికప్పుడు నయామార్గాలు వెతుక్కుంటోంది. కొత్త మార్గాల పేరు ‘బ్లాక్ మెయిల్’!

రాజకీయ పార్టీలు రంగులముద్రలు వేసుకున్నాక, మీడియా సంస్థలుకూడా ఆ రంగులను ఒళ్లంతా పులుముకోవడం ఒక సహజ ప్రక్రియ అయిపోయింది. ఈ సిద్ధాంతానికి ఎవ్వరూ అతీతం కాదు! కానీ నవతరం జర్నలిజం లో మీడియా సంస్థలు దాదాపుగా తొంభయిశాతం .. ఒక కొత్తరంగు పులుముకుంటున్నాయి.

తాము ఆల్రెడీ పులుముకున్న పార్టీ రంగులకు ఇది అదనం! ఆ రంగు నలుపు. ఆ రంగు పులుముకునే వ్యవహారమే బ్లాక్ మెయిలింగ్.

మీడియా అంటే రెండు భాగాలు! ప్రింట్ ఎలక్ట్రానిక్ అనే తరహా వర్గీకరణ కాదు ఇది. ఉద్యోగులు, యజమానులు అనే తరహా వర్గీకరణ. ఈ రెండు వర్గాలూ రెండు రకాలుగా నల్లరంగు పులుముకుంటున్నాయి. 

ఎవరి సంపాదన వారిది. ఎవరి స్థాయివారిది! చాలా వరకు మీడియాసంస్థల్లో 90 శాతం నల్ల మరకలు కనిపిస్తాయి. కడిగినముత్యా లు, పరిశుద్ధాత్మ స్వరూపులు లేరని కాదు.. వాళ్లు చేతగాని వాళ్లనేముద్రతో ఏదో ఉద్యోగ జీవితాన్ని సాగదీస్తూ ఉంటారు. మీడియా.. నల్లమీడియాగా పరావర్తనం చెందడం ఎలా జరిగిందో కథగా చెప్పడం కంటె కొన్ని సంఘటనలుగా చెప్పు కోవడమే బాగుంటుంది. అలా కొన్ని నల్ల వ్యవహారాలను బయటపెట్టే ప్రయత్నం ఇది..

‘జీతాలివ్వా లా..’

ఇతరత్రా డబ్బు లొచ్చే వ్యాపారాల్లో కోట్లకు కోట్లు గడించిన ఒక ఫక్తు పదహారణాల వ్యాపారి ఆ మధ్య ఒక కుప్పగా టీవీ ఛానెళ్లు పెట్టేశారు. మిగిలిన జోనర్ కు చెందిన ఛానెళ్లలో డబ్బులెలా సంపాదించాలో సదరు వ్యాపారికి బాగా తెలుసు. కానీ న్యూస్ ఛానెల్ విషయానికి వచ్చే సరికి ఆ కిటుకు అర్థం కాలేదు. దానికి తోడు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు.. టీమ్లు, వాహనాలు కెమెరాలు.. అంటూ ముందు పెద్ద ఉద్యోగాల్లో చేరిన సీనియర్లు హడావుడి చేస్తున్నారు. మిగిలిన ఛానెళ్లకు ఇంత ప్రొడక్షన్ ఖర్చు లేదు.. పైగా అంతో ఇంతో లాభాల గ్యారంటీ ఉంది. 

బెంబేలెత్తిన ఆయన సీనియర్లతో మీటింగ్ పెట్టారు. అన్ని చోట్లా జర్నలిస్టుల నియామకాల గురించి చర్చ జరిగింది. ఆ చర్చలో ఆయన వెలిబుచ్చిన ప్రధాన సందేహం ఇదీ.. ‘‘రిపోర్టర్లకు జీతాలివ్వాలా? ఉద్యోగం ఇస్తే.. వాళ్లే నెలనెలా కొన్ని లక్షలు కంపెనీకి కడతారంట కదా..’’ అని! రిపోర్టర్లు ఎలా కడతారు? ఏం చేసి అనేక లక్షలు సంపాదించి.. కొన్ని లక్షలు కంపెనీకి కడతారు? ఆయన ఎలాంటి ఆశలతో న్యూస్ చానెల్ ప్రారంభించారు? ఇవన్నీ ఎవరి ఊహకు వారు ఆలోచించుకోవాలి.

మీడియాలోకి ఎంటరైనా ఒక దిగ్గజం ఆలోచన సరళి గురించి చెప్ప డానికి మాత్రమే ఈ ఉదాహరణ! ఆ చానెల్ అథమస్థానం లోనే ఆదినుంచి ఉంది. ఇప్పటికీ ఎదగలేదు.. ఎప్పటికీ ఎదగదు! కానీ బండి ఎలా నడుస్తోంది. పట్టుమని పది మంది ఉద్యోగులైనా ఉండాల్సిందే కదా..! వారికైనా జీతాలు పదో పరకో ఇవ్వాల్సిందే కదా? రాబడి పైసాకూడా లేకపోతే ఎలా నడుస్తుంది? కానీ నిరాటంకం గా నడుస్తోంది! వాళ్లకు తగిన నల్లమార్గాలు వారికి ఉన్నాయి. 

ఉద్యోగుల సంగతేంటి?

ఎక్కడైనా ఒక ప్రెస్ మీట్ జరిగిందనుకోండి. అదిపూర్తయిన వెంటనే.. రిపోర్టర్లు చుట్టూమూగుతారు. పత్రికలవాళ్లు అచ్చంగా నిల్చుంటారు.. టీవీ ఛానెళ్లు,యూట్యూబ్ చానెళ్లు అని చెప్పుకునే వాళ్లూ మైకుల్ని మన ముందు పెడతారు.. ఒక చిన్న ప్రహసనం ముగుస్తుంది. ఆ తర్వాత అసలు కామెడీ మొదలవుతుంది. ‘మమ్మల్ని ఏమైనా గమనించండి సార్’ అంటూ! మూడొందలనుంచి వెయ్యి రూపాయల వరకు ఎవరి ఆశలు వారివి. 

ప్రెస్ మీట్ లు జరిగినప్పునడెల్లా.. రిపోర్టర్లకు డబ్బు లిచ్చి వార్తలు రాయించుకోవడం తొలుత సినిమా, బిజినెస్ రంగాలు అలవాటు చేశాయి. ఇప్పుడు ఆ విషం అందరికీ పాకింది. సినిమారంగంలో.. ‘కవర్ల పంపిణీ’ అనే కార్యక్రమం ఉంటుంది. ప్రెస్ మీట్ కంటె, ప్రెస్ నోట్ కంటె.. కవరు ఎంత బరువైనది అనేదే ప్రధానం. వెబ్ సైట్లు, చిన్న పత్రికల వారికి సెపరేటు కవర్లు తక్కు వ బరువుతో ఉంటాయి. పెద్ద పత్రికలు, చానెళ్లకు ఎక్కు వ బరువున్న కవర్లు! టాప్ గేర్ లో నడిచే మీడియా సంస్థల ప్రతినిధుల కోసం .. ప్యాకేజీ వేరు. కవరు బరువు సేమ్ ఉంటుంది గానీ.. ఒక్కొక్కరికీ నాలుగైదు కవర్లు ఇవ్వా లి. 

కొండొకచో లకారాల్లో ప్యాకేజీకూడా ఉంటుంది. లేకపోతే.. మన వార్తలు రావు.. నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది.. ఇదీ ఖర్మ ! ఈ కవర్ల సంస్కృ తి కాస్తా అన్ని రంగాలకు పాకింది. ఆశించడం పెరిగింది. ఇదంతా ఒకస్థాయి దిగజారుడు తనం. రెండో రకం ఇంకా చిత్రమైనది.

ఫరెగ్జాంపుల్..మాదాపూర్ లో ఓ బిల్డర్ అపార్ట్మెంట్ కట్టడానికి పునాదులు తవ్వడం ప్రారంభించాడు. రెండుమూడు రోజుల్లోగా ఓ రిపోర్టరు ప్రత్యక్షం అవుతాడు. లోకల్ రిపోర్టర్లు అందరికీ కలిపి ఒక ప్యాకేజీ చెల్లించాలి. అది అపార్ట్ మెంట్ సైజును, ఫ్లోర్లను, ఫ్లాట్ల సంఖ్యను బట్టి ఉంటుంది. అయిదు లక్షల నుంచి పది లక్షల వరకు ఉంటుంది. టోకుగా చెల్లించాల్సిందే. రిపోర్టర్లు గుంపుగా రారు.. ప్రతినిధి మాత్రమే వస్తాడు.. అందరమూ కలిపి పంచుకుంటాం అని సెలవిస్తాడు.

ఎవరైనా ముడుపు చెల్లించకుండా తిరస్కరిస్తే.. ఏదో ఒక చిన్న పత్రికలో ఆ నిర్మాణం లో విషయం లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, మునిసిపాలిటీ పట్టించుకోవడం లేదని వార్త వస్తుంది. ఆ వెనుకే బెదిరింపు వస్తుంది. ఇవ్వకపోతే.. ఈసారి పెద్దపత్రికల్లో వస్తుందనే బెదిరింపు! చచ్చినట్టు ముడుపు కట్టుకోవాలి. రిపోర్టర్ల స్థాయిలో ఇదే తరహాతంతులు రకరకాలరూపాల్లో జరుగుతూ ఉంటాయి.

యాజమాన్యాల చిన్నెలు వేరు..

ఇది కొన్నేళ్ల కిందటి ఘటన. ఓ రిపోర్టరు.. తమ లోకల్ ఎమ్మె ల్యే సాగిస్తున్న అక్రమ, అరాచక దందా గురించి చాలా విపులంగా స్టోరీ రాసి పంపాడు. టాప్ రేంజిలోని పత్రికలో అది ప్రచురణకు సిద్ధమైంది. అది సంచలనమైన ఇన్వె స్టిగేటివ్ స్టోరీ అనే ఉద్దేశంతో.. కొన్ని వివరాలు అదనంగా అడిగి తీసుకుని.. పేజీల్లో కూడా పెట్టేశారు. చివరి నిమిషాల్లో, లెవెన్త్ అవర్ లో పత్రిక యజమాని పేజీల్లో డిజైన్ అయిన ఆ స్టోరీనిచూసి.. ఆ రాత్రి వేళ రిపోర్టరుకు స్వయంగా ఫోను చేసి.. ఎమ్మెల్యే వివరణ కూడా తీసుకోమని పురమాయించాడు.

అర్ధరాత్రి వేళ నానా తంటాలు పడి ఎమ్మెల్యే ను నిద్రలేపి.. వివరణ తీసుకుని పంపాడు రిపోర్టరు. ఎమ్మెల్యే ఒక్క రోజు ఆగాల్సిందిగా బతిమాలినా.. రిపోర్టరు వినిపించుకోలేదు. ధర్మం నిర్వర్తించాడు. తీరా తెల్లారాక పేపర్లో వార్త రాలేదు. ఆ తర్వాత కూడా రాలేదు. తీరా తెలిసిందేంటంటే.. తెల్లారేసరికి ఫస్ట ఫ్లయిట్ లో హైదరాబాదు చేరుకున్న సదరు ఎమ్మెల్యే , సదరు పత్రికాధిపతికి యాభైలక్షల రూపాయలు సమర్పించుకున్నాడని! ఈ దందా ఇవాళ్టిది కాదు.

మీడియా ఒక కవచం !

కేవలం పత్రిక మాత్రమే వ్యాపారం గా కలిగి ఉన్న యజమానులు ఇవాళ ఎందరున్నారు? ప్రతి ఒక్కరికీ అదనంగా అనేక వ్యాపారాలుంటాయి. మీడియా ద్వారా రాబడి ఎలా ఉన్నా .. ఇతర వ్యాపారాలకు ఇది కవచం గా ఉపయోగపడుతుందనే ఆశతో నడుపుతుంటారు.ఇతర వ్యాపారాలలో ప్రయోజనాలను ఈడేర్చు కోవడానికి మీడియాను ఒక అస్త్రం గా వాడుతుంటారు.

ఓ పెద్దపత్రిక యజమాని ఉన్నారు. ఎంతటి వారిమీదనైనా నిర్భయం గా బురద చల్లేస్తాం అని తమను తాముభుజాలు చరుచుకుంటారు. సీఎం పేషీలో ఉండే ఐఏఎస్ ల మీదకూడా ఏమాత్రం జంకూగొంకూ లేకుండా అవినీతి కథనాలు వండేస్తారు. అవన్నీ అబద్ధాలే రాస్తారని చెప్ప డం కాదు.. కానీ.. ఆ రాతల వెనుక అసలు పరమార్థం వేరే ఉంటుంది. ఆ పరమార్థం వారియొక్క ఇతర వ్యా పార ప్రయోజనాలతో ముడిపడి ఉంటుంది. లేదా ప్రభుత్వం నుంచి అనుచిత లబ్ధి పొందడానికి పెట్టుకున్న ఒక దరఖాస్తుకు సంబంధించినది అయి ఉంటుంది. ఆ ప్రయోజనం దక్కే దాకా.. సదరు ఐఏఎస్ అధికారి మీదనైనా పుంఖానుపుంఖాల వార్తలు వస్తాయి. ప్రయోజనం సిద్ధించగానే టక్కున ఆగిపోతాయి.

ఛీ.. పోన్లే అనుకోవడం వల్లనే..

మరి మీడియాసంస్థలు ఇలా నల్లరంగు పులుముకుని చెలరేగుతోంటే.. అడ్డుకునే వారెవ్వరూలేరా? వారికి బుద్ధి చెప్పే వారు లేరా? అనే ప్రశ్న సాధారణంగా ఎవరికైనా ఎదురవుతుంది. చిన్న స్థాయిలో బ్లాక్ మెయిలింగ్ బెదిరింపులను ఖాతరు చేయని వారు.. అలాంటి మీడియా ప్రతినిధుల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టిచ్చి పరువు తీసేవారూ అక్కడక్కడా కనిపిస్తుంటారు. కానీ సంస్థలు, యజమానుల విషయంలో ఇలా వారి అసలు రంగును విప్పి చూపించే వాళ్లు తక్కువ.

బ్లాక్ మెయిలింగ్ గురవుతున్నారంటే.. వారిలో ఏదో ఒక చిన్న లోపం తప్పకుండా ఉండనే ఉంటుంది. ఒక తప్పు చేసినవాడు.. మీడియాను మేపడానికి ఇంకో తప్పు కూడా చేస్తాడు. అంతకు మించిపోయేదేం లేదు. ఎటూబ్లాక్ మెయిలింగ్ ఫలిస్తే మీడియా కళ్లుమూసుకునే ఉంటుంది. ‘ఛీ.. పోన్లే.. వాడిమొహాన ఏదో పారేస్తే అయిపోతుంది.. ఎందుకొచ్చిన తంటా’ అనుకునే వాళ్లే ఎక్కువ. ఇలా.. అనుకునే వాళ్ల వల్లే బ్లాక్ మెయిలింగ్ మీడియా పెరుగుతోంది. వర్ధిల్లుతోంది. దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది? ఎక్కడ?

‘‘మీలో నేరం చేయనివాడు.. ఎవరో చెప్పండి..?’’ అని ఒక సినీ కవి అన్నట్లుగా.. అలాంటి నికార్సయిన మనుషులు ఉన్నప్పుడు.. ఇలాంటి నల్ల బాగోతాలు బట్టబయలవుతాయి.. అవును అలాంటి వారిని ఎక్కడ వెతకగలం !?

.. ఎల్ విజయలక్ష్మి

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను