వ్యాక్సినేష‌న్ లో అమెరికాను దాటాం..కానీ!

క‌రోనా నివార‌ణ‌కు అత్య‌ధిక వ్యాక్సిన్ డోసుల‌ను ఇచ్చిన దేశాల జాబితాలో రెండో స్థానంలో నిలుస్తోంది ఇండియా. ఈ జాబితాలో తొలి స్థానంలో చైనా ఉంది. చైనా ఇప్ప‌టికే త‌న వంద కోట్ల పై జ‌నాభాకూ…

క‌రోనా నివార‌ణ‌కు అత్య‌ధిక వ్యాక్సిన్ డోసుల‌ను ఇచ్చిన దేశాల జాబితాలో రెండో స్థానంలో నిలుస్తోంది ఇండియా. ఈ జాబితాలో తొలి స్థానంలో చైనా ఉంది. చైనా ఇప్ప‌టికే త‌న వంద కోట్ల పై జ‌నాభాకూ వ్యాక్సిన్ ఇచ్చిన‌ట్టుగా ప్ర‌క‌టించుకుంది. క‌నీసం 22 కోట్ల మందికిపైగా ప్ర‌జ‌ల‌కు రెండో డోసు వ్యాక్సినేష‌న్ కూడా ఇచ్చింద‌ట చైనా.

ఆ ఐర‌న్ క‌ర్టెన్ వెనుక గ‌ణాంకాలు ఇలా ఉంటే, వ్యాక్సినేష‌న్ విష‌యంలో పార‌ద‌ర్శ‌కంగా వివరాల‌ను వెల్ల‌డించే దేశాల్లో తొలి స్థానంలో అమెరికా నిలిచింది. అది నిన్న‌టి వ‌ర‌కూ. ఇప్పుడు అమెరికా క‌న్నా ఎక్కువ డోసుల వ్యాక్సిన్ ను ఇచ్చిన దేశంగా నిలుస్తోంది ఇండియా.

భార‌త దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కూ సుమారు 32 కోట్ల మందికి పైగా క‌నీసం ఒక డోసు వ్యాక్సిన్ ను ఇచ్చారు. అమెరికాలోనూ దాదాపు ఇంతే మందికి క‌నీసం ఒక డోసు వ్యాక్సిన్ ను ఇచ్చారు. ల‌క్ష‌ల వ్యాక్సిన్ల తేడాతో ఇప్పుడు ఇండియా ముందుంది. ఇలా అమెరికాకు మించిన స్థాయి సంఖ్య‌లో ఇండియాలో క‌నీసం ఒక డోసు వ్యాక్సినేష‌న్ జ‌రిగింది.

అయితే రెండు డోసుల వ్యాక్సిన్ల విష‌యంలో మాత్రం అమెరికా క‌న్నా ఇప్ప‌టికీ ఇండియా చాలా వెనుక‌బడి ఉంది. అమెరికాలో వ్యాక్సిన్ ఇచ్చిన 32 కోట్ల మందిలో ఇప్ప‌టికే స‌గం మందికి రెండో డోసు వ్యాక్సినేష‌న్ కూడా పూర్త‌య్యింద‌ని తెలుస్తోంది. 15 కోట్ల మందికి అక్క‌డ రెండు డోసుల వ్యాక్సినేష‌న్ ఇచ్చారు. ఇండియాలో మాత్రం రెండు డోసుల వ్యాక్సినేష‌న్ ఇచ్చిన వారి సంఖ్య కేవ‌లం 5.6 కోట్లుగా మాత్ర‌మే ఉంది. వాస్త‌వానికి ఇండియాలో రెండో డోసు వ్యాక్సినేష‌నే వివాదంగా మారింది. రెండు  డోసుల మ‌ధ్య‌న గ‌డువును ఏకంగా 84 రోజులుగా మార్చేసిన‌ట్టుగా ఉన్నారు.

ఈ గ‌డువు పెంచ‌డం కేవ‌లం వ్యాక్సిన్ల కొర‌తను త‌గ్గించుకోవ‌డానికే అనే విమ‌ర్శ‌లు ఉండ‌నే ఉన్నాయి. మొద‌టేమో నాలుగైదు వారాల గ‌డువు అని, ఇప్పుడు ఏకంగా ఆడువును 12 వారాల‌కు మార్చేశారు. తొలి డోసు వేయించుకుని ఇప్ప‌టికే 12 వారాలు గ‌డిచిపోయిన వారికి కూడా రెండో డోసుకు ఇప్ప‌టి వ‌ర‌కూ పిలుపులు రావ‌డం లేదు. రెండో డోసుకు వేళ‌య్యింద‌ని కొంద‌రికి మెసేజ్ లు వ‌స్తున్నాయి. మ‌రికొంద‌రికి అలాంటివేమీ లేవు. దీంతో..12 వారాలు గ‌డిచిపోతున్నా కొంత‌మందికి సెకెండ్ డోసు ప్ర‌శ్నార్థ‌కంగానే మిగిలి ఉంది. 

ఇక వ్యాక్సిన్ల‌ను ఒక రోజు మెరుగైన స్థాయి సంఖ్య‌లో వేసిన‌ట్టుగా ప్ర‌క‌టిస్తుంటే, మ‌రో రోజు ఈ నంబ‌ర్ త‌క్కువ స్థాయిలో క‌నిపిస్తూ ఉంది. గ‌త 24 గంట‌ల్లో అయితే కేవ‌లం 17 ల‌క్ష‌ల డోసుల వ్యాక్సినేష‌న్ మాత్ర‌మే జ‌రిగింద‌ట‌! రోజుకు కోటి డోసుల స్థాయిలో వ్యాక్సినేష‌న్ జ‌రగాల్సిన త‌రుణంలో కేవ‌లం 17 ల‌క్ష‌ల స్థాయిలో మాత్ర‌మే వ్యాక్సినేష‌న్ జ‌ర‌గ‌డం అంటే, ల‌క్ష్యాన్ని చేరుకునేదెప్పుడు అనే ప్ర‌శ్న‌త త‌లెత్తుతోంది.

ఒక డోసు విష‌యంలో అమెరికాను మించిన‌ట్టుగా మురిసిపోవ‌డానికి ఏమీ లేదు. ఇప్ప‌టికీ క‌నీసం ఒక డోసు వ్యాక్సిన్ అంద‌ని వారి సంఖ్య 50 కోట్ల‌కు పైనే ఉంది, ఇక రెండో డోసు కోసం ఎదురుచూపులు అలానే ఉన్నాయ‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాలి!