తన అవసరం మేరకు కొన్ని కేసుల్లో బాధితులను ప్రస్తావిస్తూ ఉంటారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఏపీలో అధికార పక్షంగా టీడీపీ ఉన్నప్పుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన సుగాలి ప్రీతి గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించలేదు. ఏపీలో టీడీపీ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత.. సుగాలి ప్రీతి గురించి పవన్ ఆవేదన వ్యక్త పరిచారు. ఆమె మరణంపై సరైన విచారణ జరగలేదని.. ఈ విషయంలో వైఫల్యం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే అని దుమ్మెత్తి పోశారు.
ఈ అంశంపై జగన్ ప్రభుత్వం స్పందించి, ప్రీతి తల్లి కోరుకున్నట్టుగా సీబీఐ విచారణకు కేంద్రానికి లేఖ రాసింది. తద్వారా జగన్ ప్రభుత్వం తన బాధ్యతను పూర్తి చేసింది. బాధితులు కోరుకుంటున్న విచారణకు ప్రభుత్వం తన వంతు సిఫార్సు చేసింది. అయితే నెలలు గడుస్తున్నా ఈ విషయంలో సీబీఐ స్పందించిన దాఖలాలు లేవు!
ఒకవేళ ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వమే దర్యాప్తు చేపట్టి.. ఇప్పటి వరకూ ఏమీ తేలకపోయి ఉంటే, మరో ముహూర్తాన్ని చూసుకుని పవన్ కల్యాణ్ రచ్చ చేసే వాడేమో! అయితే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణను కోరుతూ లేఖ రాసినా, అక్కడ నుంచి స్పందన లేదు. దీంతో బీజేపీ మిత్రుడిగా సీబీఐ అలక్ష్యాన్ని పవన్ కల్యాణ్ ప్రస్తావించలేరు.
ఈ కేసులో బీజేపీని నిందించలేరు. కాబట్టి సుగాలి ప్రీతి ఉదంతాన్ని పవన్ కల్యాణ్ తన కంఫర్ట్ మేరకు మరిచిపోయారు. అయితే అలాంటి ఉద్దేశం తమకు లేదని ఏపీ ప్రభుత్వం చాటుకుంది. సుగాలి ప్రీతి మరణం గురించి విచారణకు సీబీఐ నుంచి ఉలుకూపలుకూ లేకపోవడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా అధికారులను ప్రీతి తల్లి వద్దకు పంపారు. తాము సీబీఐకి లేఖ రాసినా.. ఇప్పటి వరకూ వాళ్లు స్పందించడం లేదని, ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రీతి తల్లి ఏం కోరుతున్న విషయాన్నీ తెలుసుకునే ప్రయత్నం చేశారు జగన్. ఇందుకోసం అధికారులను పంపించారు. వారు ప్రీతి తల్లితో మాట్లాడినట్టుగా తెలుస్తోంది.
సీబీఐ విచారణ కావాలన్నారు.. లెటర్ రాసేశాం..ఇక మాకేం సంబంధం లేదు అని జగన్ ప్రభుత్వం ఈ కేసును వదిలేయలేదు. సీబీఐ స్పందించకపోవడంతో.. బాధిత కుటుంబం ఇప్పుడు ఏం చేయమంటుందనే అంశాన్ని వారినే డైరెక్టుగా కలిసి తెలుసుకునే ప్రయత్నం చేయడం అభినందనీయం. ప్రతిపక్షాలు ఇలాంటి కేసులను మరిచిపోయినా, ప్రభుత్వం మరిచిపోకపోవడం.. పాలనలోని ఒక మెచ్చుతునక.