వితంతు, ఒంటరి మహళల్లోని పింఛన్‌దారులకు టెన్షన్ పట్టుకుంది. పెద్ద ఎత్తున అనర్హులున్నారనే అనుమానంతో ప్రభుత్వంతో పింఛన్‌దారుల అర్హతల పత్రాలను మరోసారి పరిశీలన ప్రక్రియ చేపట్టింది. ఈ క్రమంలో అనర్హులైన 6 వేల మందికి పింఛన్‌ను వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం నిలిపివేయడం గమనార్హం. మున్ముందు మరి కొంత మంది అనర్హులను గుర్తించి వారికి కూడా పింఛన్‌ను తుంచేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వితంతు, ఒంటరి మహిళల పింఛన్ల తనిఖీని ప్రభుత్వం చేపట్టింది. ఈ రెండు కేటగిరీల్లో పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల బియ్యం, ఆధార్ కార్డులను పరిశీలించింది. సుమారు లక్ష మందికిపైగా వివరాల్లో మార్పులు న్నట్లు అధికారులు తేల్చారు. దీంతో క్షేత్ర స్థాయిలో మరింత సమగ్రంగా పరిశీలించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఆధార్, రేషన్‌కార్డుల్లో తేడాలను గుర్తించి లక్ష మందికి పైగా నోటీసులను ప్రభుత్వం అందజేసింది. ఈ నోటీసులు అందుకున్న వారిలో గుబులు పట్టుకుంది. తమ పింఛన్ ఉంటుందా? ఉండదా? అనే ఆందోళన నెలకుంది. ఈ పరంపరంలో నోటీసులు అందుకున్న లక్ష మందికి పైగా లబ్ధిదారుల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సరైన ధ్రువపత్రాలను అందించిన వారికి మాత్రమే జూలై ఒకటిన పింఛన్ అందజేస్తారు.
ముఖ్యంగా ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో అత్యధికంగా 16 వేల మంది నోటీసులు అందుకోవడం గమనార్హం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 80 వేల మందికి పైగా లబ్ధిదారుల వివరాలను పరిశీలించగా 6 వేల మంది అనర్హులు తేలినట్టు పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్స్) అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఒంటరి మహిళ కాకున్నా, ఆ కేటగిరీలో పింఛన్ పొందుతున్నట్టు అధికారులు తేల్చారు.
ఈ తనిఖీ 30వ తేదీ వరకూ కొనసాగనుంది. జూలై 15వ తేదీ నాటికి సరైన వివరాలను సమర్పించిన వారికి పింఛన్ ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. ఒకవేళ ఆప్పటికి అందజేయలేక, ఆ తర్వాత ఇచ్చిన వారికి రెండు నెలలది కలిపి ఆగస్టు 1న పింఛన్ అందజేస్తామని సెర్ప్ అధికారులు వెల్లడించారు.