భోళా వచ్చాడు.. బ్రో తప్పుకున్నాడు

బ్రో సినిమాను తను ఎప్పుడో వదిలేశానన్నాడు పవన్ కల్యాణ్. తన కార్యకర్తల్ని, ఫ్యాన్స్ ను కూడా ఆ సినిమా పట్టుకొని వేలాడొద్దంటూ సలహా ఇచ్చాడు. ఇప్పుడు వైసీపీ నేతలతో పాటు, ప్రేక్షకులు కూడా ఈ…

బ్రో సినిమాను తను ఎప్పుడో వదిలేశానన్నాడు పవన్ కల్యాణ్. తన కార్యకర్తల్ని, ఫ్యాన్స్ ను కూడా ఆ సినిమా పట్టుకొని వేలాడొద్దంటూ సలహా ఇచ్చాడు. ఇప్పుడు వైసీపీ నేతలతో పాటు, ప్రేక్షకులు కూడా ఈ సినిమాను వదిలేశారు. నిన్నటివరకు థియేటర్లలో ఈగలు తోలుకుంటూ గడిపిన బ్రో, ఈరోజు నుంచి ఆ థియేటర్లను దాదాపు ఖాళీ చేశాడు.

బ్రో సినిమా 2 వారాలు పూర్తి చేసుకుంది. ఇవాళ్టితో ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు క్లోజ్ అయింది. నిన్న జైలర్, ఈరోజు భోళాశంకర్ రాకతో, తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ సెంటర్స్ నుంచి బ్రో సినిమాను తప్పించారు. అలా విడుదలైన ఈ 2 వారాల్లో బ్రో సినిమా కథ కంచికి చేరింది. చాలామందికి నష్టాలు తెచ్చిపెట్టింది. ఎందుకు అదనపు ఖర్చు అనుకున్నారేమో.. బ్రో సినిమాకు యాడ్స్ కూడా దాదాపు ఆపేశారు.

పవన్ కల్యాణ్, సాయితేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించాడు. దర్శకుడు అతడే అయినప్పటికీ కథామార్పులు, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ దగ్గరుండి త్రివిక్రమ్ చూసుకున్నాడు. తమిళ్ లో వచ్చిన వినోదాయ శితం సినిమాకు త్రివిక్రమ్ చేసిన మార్పుచేర్పులు ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేదు.

మరీ ముఖ్యంగా పవన్ కు పొలిటికల్ మైలేజీ ఇచ్చేందుకు, పవన్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించేందుకు త్రివిక్రమ్ తెగ తాపత్రయపడ్డాడు. కానీ అతడి తాపత్రయం ఫలించలేదు. బ్రో సినిమా బ్రేక్ ఈవెన్ కూడా దాటలేదు.