ఢిల్లీలో ష‌ర్మిల‌…విలీనానికి వేళైంది!

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల ఢిల్లీ వెళ్లారు. దేశ రాజ‌ధానిలో ఆమె బిజీగా ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీన ప్ర‌య‌త్నాలు కొలిక్కి వ‌చ్చిన‌ట్టు పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో…

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల ఢిల్లీ వెళ్లారు. దేశ రాజ‌ధానిలో ఆమె బిజీగా ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీన ప్ర‌య‌త్నాలు కొలిక్కి వ‌చ్చిన‌ట్టు పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఇంత‌కాలం జ‌రుగుతున్న ప్ర‌చారం నిజ‌మ‌య్యేందుకు రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయ‌ని స‌మాచారం. ఇటీవ‌ల కాలంలో రాహుల్‌గాంధీకి అనుకూలంగా ష‌ర్మిల సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించిన సంగ‌తి తెలిసిందే.

వైఎస్సార్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ట్వీట్ చేసిన రాహుల్‌కు ష‌ర్మిల కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. అలాగే సుప్రీంకోర్టు స్టేతో రాహుల్‌గాంధీ లోక్‌స‌భ స‌భ్య‌త్వం పున‌రుద్ధ‌ర‌ణ‌ను పుర‌స్క‌రించుకుని కూడా ష‌ర్మిల త‌న ఆనందాన్ని ప్ర‌క‌టించారు.

“చెక్కుచెదరని మీ మనోధైర్యం  దేశ వ్యాప్తంగా కోట్లాది జనావళిలో ఆశలు వెలిగిస్తున్న వేళ న్యాయం తన మార్గం కనుగొని వెలువడ్డ తీర్పు ఎన్నో హృదయాలలో ఆనందం నింపింది. ప్రజల ఇక్కట్లను  పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా వెలిబుచ్చే ప్రక్రియలో మీ పాత్ర ఇంకో సారి ఎంతో దూరం పయనించగలదని నా ప్రగాఢ విశ్వాసం” అని ష‌ర్మిల పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.

ఇందిరాగాంధీ కుటుంబం ప‌ట్ల వైఎస్సార్ త‌న‌య విశ్వాసాన్ని ప్ర‌క‌టిస్తుంద‌నేందుకు ఇంత కంటే నిద‌ర్శ‌నం ఏం కావాలి? కాంగ్రెస్‌లో విలీనానికి ష‌ర్మిల మొగ్గు చూపుతున్నార‌నే ప్ర‌చారానికి ఇలాంటి స్పంద‌న‌లన్నీ మ‌రింత బ‌లాన్ని ఇచ్చాయి. ఈ క్ర‌మంలో ష‌ర్మిల ఢిల్లీ ప‌ర్య‌ట‌న స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీతో భేటీ అయి, విలీన ప్ర‌క్రియ‌కు మార్గం సుగుమం చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. 

ఇప్ప‌టికే క‌ర్నాట‌క మంత్రి డీకే శివ‌కుమార్ ద్వారా త‌న అభిప్రాయాల్ని కాంగ్రెస్ అగ్ర‌నేత‌ల దృష్టికి ష‌ర్మిల తీసుకెళ్లారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌లో ఆమె పాత్ర ఏమ‌ట‌న్న‌దే ప్ర‌శ్న‌.