అంత సీనియర్ మంత్రికి మాట్లాడ్డం తెలీదా?

ధర్మాన ప్రసాదరావు అంటే చాలా సీనియర్ మంత్రి. వైఎస్సార్ జమానాలోకూడా సేవలందించిన చరిత్ర ఆయన సొంతం. సభలో గానీ, మీడియా ఎదుట గానీ.. ఆయన చాలా విపులంగా అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా శిష్టవ్యవహారిక భాషలో మాట్లాడుతూ…

ధర్మాన ప్రసాదరావు అంటే చాలా సీనియర్ మంత్రి. వైఎస్సార్ జమానాలోకూడా సేవలందించిన చరిత్ర ఆయన సొంతం. సభలో గానీ, మీడియా ఎదుట గానీ.. ఆయన చాలా విపులంగా అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా శిష్టవ్యవహారిక భాషలో మాట్లాడుతూ ఉంటారు. అంతటి సీనియర్ నాయకుడికి ఎలా మాట్లాడాలో తెలియదా? అవకతవకలుగా మాట్లాడి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం ఇటీవలి కాలంలో ఆయనకు రివాజుగా మారిపోయింది. 

అసలే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వాలంటీర్లను రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నదని, వారి ద్వారా ప్రజల డేటా సేకరిస్తూ దానిని దుర్వినియోగం చేస్తున్నదని విపక్షాలు ఆడిపోసుకుంటున్న వేళ.. ధర్మాన ప్రసాదరావు వారికి మరింత ఊతమిచ్చేలాగా మాట్లాడుతున్నారు. వాలంటీర్లు వైకాపా విజయానికి బాటలు వేయాలని పిలుపు ఇస్తున్నారు.

ఇటీవలి కాలంలో.. విశాఖ వాసులను ఊరించడానికి.. మూడు రాజధానులు అనేది ఒక భ్రమ అని, కేవలం విశాఖ పట్నం మాత్రం ఏకైక రాజధాని అవుతుందని.. రకరకాల వివాదాస్పద ప్రకటనలు చేసిన ఘనత ధర్మాన సొంతం. ఆ క్రమంలో విశాఖ వాసులను రెచ్చగొట్టేలా ఆయన చాలా ప్రకటనలు చేశారు. ముఖ్యమంత్రి పిలిచి మందలించిన తర్వాత.. రాజధాని విషయంలో నోరుజారకుండా ఆగారు.

‘‘తాజాగా వాలంటీర్లను ఉద్దేశించి చెప్పిన మాటలు వివాదాస్పదం అవుతున్నాయి. మీరంతా సహకరిస్తే తిరిగి అధికారంలోకి వస్తాం.. ఆ వెంటనే మీకు తగిన ప్రతిఫలం అందేలా జగన్ చూస్తారు.. మీరు ప్రతి ఇంటికీ వెళ్లి ఆయా కుటుంబాల్లోని వ్యక్తుల మనోభావాలు తెలుసుకోండి.. వారు ఏ పార్టీ వారో గమనించండి.. ఆ జాబితాలను పార్టీ నాయకులకు అందజేస్తే మేం వాటిని పైవాళ్లకు పంపుతాం. వారంతా చేయాల్సింది చేస్తారు.. మీ పనితీరుపై గృహసారథులతో నిఘా ఉంటుంది..’’ ఈ మాటలన్నీ ధర్మాన వాలంటీర్లతో అంటున్నారు.

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లండి.. అని చెప్పడం వరకు సరిపోతుంది. నిజానికి అదే ప్రభుత్వానికి పెద్ద మైలేజీ అవుతుంది. పార్టీ పరంగా సేకరించే వివరాలను పార్టీ ‘పైవాళ్లు’ ఏం చేస్తారో వాలంటీర్లకు నివేదిక ఇవ్వాల్సిన అవసరం మంత్రి ధర్మానకు ఉన్నదా? అనేది పార్టీ వర్గాలే ప్రశ్నిస్తున్నాయి. ఆయన అదుపులేని, విచక్షణ లేని మాటల వలన.. పార్టీ భ్రష్టుపడుతోందని పార్టీలోనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

రాజధాని విషయంలో మాత్రమే కాకుండా, వాలంటీర్ల విషయంలో కూడా.. పార్టీని ఇరుకునపెట్టేలా ఆయన మాట్లాడడం ఇది తొలిసారి కాదని పలువురు పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.