ఆ జాతిని దూరం పెట్టండి.. ఆర్జీవీ ‘చిరు’ సలహా

కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న రామ్ గోపాల్ వర్మ, మళ్లీ యాక్టివ్ అయ్యాడు. ట్వీట్స్ కు గ్యాప్ ఇచ్చిన ఈ దర్శకుడు, తాజాగా మరోసారి తనదైన స్టయిల్ లో కొన్ని ట్వీట్స్ పెట్టాడు. అవి చదివితే,…

కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న రామ్ గోపాల్ వర్మ, మళ్లీ యాక్టివ్ అయ్యాడు. ట్వీట్స్ కు గ్యాప్ ఇచ్చిన ఈ దర్శకుడు, తాజాగా మరోసారి తనదైన స్టయిల్ లో కొన్ని ట్వీట్స్ పెట్టాడు. అవి చదివితే, వర్మ ఏ ఉద్దేశంతో ఆ పోస్టులు పెట్టాడో ఇట్టే అర్థమైపోతుంది.

“జబర్ , హైపర్ లాంటి ఆస్థాన విదూషకుల భజన పొగడ్తలకి అలవాటుపడిపోయి, రియాల్టీ కి మెగా దూరమవుతున్నారని అనిపిస్తోంది. పొగడ్తలతో ముంచే బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు ఉండరు. రియాలటీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు. వాళ్ళ పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైల్ దూరం పెట్టటమే.”

ఆర్జీవీ తాజా ట్వీట్ ఇది. ఇందులో ఆయన చిరంజీవి పేరు, భోళాశంకర్ పేరు ప్రస్తావించలేదు. కానీ ఆ సినిమానే టార్గెట్ చేస్తూ, పరోక్షంగా పోస్టులు పెట్టారనే విషయం ఎవరికైనా ఈజీగా అర్థమౌతుంది.

ఈరోజు థియేటర్లలోకి వచ్చింది భోళాశంకర్ సినిమా. మొదటి ఆటకే నెగెటివ్ టాక్ వచ్చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వర్మ, ఈ పోస్టు పెట్టినట్టు స్పష్టంగా అర్థమౌతూనే ఉంది.

భోళాశంకర్ సినిమాలో చిరంజీవి భజన ఎక్కువైంది. ఆయన ఎంట్రీ సీన్ లోనే “ఇటు అమ్మవారు, అటు అన్నగారు” అనే డైలాగ్ పెట్టారు. చిరంజీవి ఎంట్రీ నుంచి చుట్టుపక్కలున్న ఆర్టిస్టులు అతడ్ని ఆరాధనభావంతో చూస్తుంటారు. ఓ దశలో సినిమాలో ఆర్టిస్టులంతా కలిసి చిరంజీవిని దేవుడ్ని చేసేస్తారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రామ్ గోపాల్ వర్మ ఈ పోస్ట్ పెట్టినట్టు కనిపిస్తోంది.