‘ఉచితా’లు గట్టెక్కించవా?

అధికారంలోకి రావడానికి, వచ్చాక దానిని ఎలాగోలా నిలుపుకోడానికీ జనం మీదకు విసిరే అడ్డమైన 'ఉచితస‌ పథ‌కాలు …. 'పొలిటికల్ బిజినెస్'కు నిరాఘాటంగా ఉపయోగ పడతాయని పొలిటీషియన్స్‌కు గట్టి నమ్మకం. ఈ ఉచితాల బెడద సుప్రీంకోర్టు ను…

అధికారంలోకి రావడానికి, వచ్చాక దానిని ఎలాగోలా నిలుపుకోడానికీ జనం మీదకు విసిరే అడ్డమైన 'ఉచితస‌ పథ‌కాలు …. 'పొలిటికల్ బిజినెస్'కు నిరాఘాటంగా ఉపయోగ పడతాయని పొలిటీషియన్స్‌కు గట్టి నమ్మకం. ఈ ఉచితాల బెడద సుప్రీంకోర్టు ను కూడా తాకింది. చివరకు, ఆ భారత సర్వోన్నత న్యాయస్థానం సైతం ఈ ఉచితాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసే స్థాయికి ఈ 'ఉచితాల పిచ్చి' చేరుకున్నది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ ఉచితాల పై విరుచుకు పడ్డారు.

ప్రతిదీ ఉచితంగా వస్తుంటే, పొద్దున్నే నిద్ర లేచిన దగ్గరి నుంచీ రాత్రికి పడుకునే వరకు మనిషి ఏమి చేయాలో అర్ధం కానంత వరకూ ఈ ఉచితాల పిచ్చి దేశంలో పెరిగి పోయింది. ఇక ఉచితంగా ఇవ్వడానికి ఏ ఐడియాలు దొరకక, పొలిటీషియన్లు అల్లల్లాడిపోతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉచిత పథ‌కాల కోసం ప్రభుత్వాలు వెంపర్లాడుతున్న తీరు చూస్తుంటే, ఉచితాల పేరిట నగదు బదిలీల కోసం తప్ప, ప్రభుత్వాలకు మరో పని లేదా అని అనిపించక మానదు.

ఇస్తున్నవి పోగా, ఉచితాలుగా ఇంకా ఏమి ఇవ్వవచ్చు అనే విషయంలో ఐడియాలు అన్నీ అయిపోయి, 'కొత్త ఐడియాలు ఇచ్చిన వారికి ఉచితంగా ఓ పథకం ' అంటూ పత్రికల్లో మొదటి పేజీ లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చే దశకు మన దేశంలోని ప్రభుత్వాల ఉచితాల 'ప్రహసనాలు' చేరుకున్నట్టు కనపడుతున్నాయి. నాయకులు ఈ ఉచితాలతో…. ప్రభుత్వాలను పరుగులు తీయిస్తున్నారు. ఆ ఉచితాలకు ఇచ్చే సొమ్ములు వారివి కాదు కదా! ప్రజలు ప్రభుత్వాలకు చెల్లించే పన్నులను వీధి పంపుల్లో కారిపోయే నీళ్ల లాగా ఇష్టానుసారం పారిస్తున్నారు. ఇదే పాలన అనుకుంటున్నారు.

ఈ ఉచితాలకు అలవాటు పడిన జనం చచ్చినట్టు తమకే ఓట్లు వేస్తారని కూడా నాయకులు అనుకోవడం సహజం. అంటే జనం కట్టే డబ్బునే జనానికి పంచి, తాము మాత్రం సొంత డబ్బు ఏదో ఇస్తున్నట్టుగా బిల్డ్ అప్ ఇస్తూ పిల్ల పిల్ల తరానా అధికారంలో కొనసాగవచ్చునని కొందరి నేతల అంచనాగా కనపడుతున్నది.

ఆశ పడడంలో తప్పు ఏమీ లేదు. మనిషికి ఆశ అనేది ఉండాల్సిందే. లేకపోతే ఇక, మడిసికి పోలిటీషియన్‌కి తేడా ఏటుంటాది?

*అయితే, ఈ ఉచితాలు ఆయా నేతలను 'ఎన్నికల వైతరిణి' ని దాటిస్తాయా?

* వారికి మళ్ళీ మళ్ళీ అధికారం కట్టబెడతాయా?

* పోనీ, ఈ ఉచితాలను సమయానికి ఠంచన్‌గా అందుకుంటూ కాలు మీద కాలు… నోట్లో వేలు వేసుకుని .. తిని తొంగుంటున్న వాళ్లయినా బాగు పడ్డారా?

* వారి ఆర్ధిక పరిస్థితి ప్రభుత్వ సహాయం అవసరం లేని విధంగా మెరుగు పడిందా?

* దారిద్ర్య రేఖ దిగువ నుంచి పైకి వచ్చారా?

*వాళ్ళ బతుకు తెరువులను ఈ ఉచితాలు మెరుగు పరిచాయా?

ఈ ప్రశ్నలే గాక, మరి ఇలాటి ఓ వంద ప్రశ్నలకైనా, ” నో” అనే సమాధానమే లభిస్తుంది. ఉచితాలు అందుకున్న వారు కృతజ్ఞతతో ఓట్లు వేస్తారు అని అనుకుంటే, చంద్రబాబు నాయుడు 2019 లో ఎందుకు ఓడిపోయినట్టు?

ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఇతరులతో ఎందుకు ఇంటరాక్ట్ అవుతున్నట్టు? క్యాంపు ఆఫీస్ తలుపులు ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు ఎందుకు తెరుచుకున్నట్టు? మూడేళ్లగా క్యాంపు కార్యాలయంలోనే ఉచితాల బటన్ నొక్కుతున్న ముఖ్యమంత్రి జగన్, ఇప్పుడు బటన్ నొక్కడం కోసం ఆ ఊరూ, ఈ ఊరూ ఎందుకు వెడుతున్నట్టు? హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీర్ వాసాలమర్రి అనే గ్రామ దళిత వాడలో… మూడు గంటల పాటు వీధీ వీధీ ఎందుకు తిరిగినట్టు? అయినా, హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఎందుకు పాతిక వేల  తేడాతో ఓడిపోయినట్టు?

అంటే ఉచితాల దారి ఉచితాలదే…..,ఓట్ల దారి ఓట్లదే అని మన నేతలకు అర్ధం అయింది కనుకనే, ఈ విచిత్రాలన్నీ చోటు చేసుకుంటున్నాయి.

ఏదో తెలుగు సినిమాలో ఇంట్లోని వాళ్లందరూ హాల్ లో కూర్చుని, టీవీలో వచ్చే టీవీ సీరియల్ ను గుడ్లప్పగించి చూస్తుంటారు. ఓ దొంగ( బ్రహ్మానందం ) ఆ ఇంట్లో పడి, కనపడిన వస్తువులన్నింటినీ దోచుకుపోతుంటాడు గానీ, ఇంట్లో వాళ్ళు గమనించరు. చివరికి వారి వంటి మీది బట్టలు కూడా వాళ్లకు తెలియకుండానే వలుచుకు పోతాడు. అయినా టీవీ సీరియల్ మీద నుంచి ఆ ఇంటి వాళ్ళు కళ్ళు పక్కకు తిప్పరు.

అలా, జనం అంతా ఉచితాల మత్తులో పడి జోగుతుంటే రాష్ట్రాన్ని ఊడ్చి.. కళ్ళాపు జల్లి…. ముగ్గులు పెట్టేయవచ్చు అని కొందరి  ప్లాన్ అని ఆరోపించేవారికి కొదువలేదు.

అందుకే, 'ఉచితాలు' అంటే ప్రతిపక్షాలు, విమర్శకులకే కాక, ఆ ఉచితాలు అందుకునే వారికి కూడా గౌరవం లేకుండా పోయింది.

'ఉచితాల' వెనుక చిత్తశుద్ధి, లబ్ధిదారులు ఆత్మ గౌరవంతో బతికే విధంగా ఆర్ధికంగా నిలదొక్కు కోవాలనే అంకిత భావంతో కాకుండా, రాజకీయ స్వార్ధంతో చేస్తున్నందు వల్లే, వాటి పట్ల లబ్ధిదారులకు కూడా గౌరవం లేకుండా పోయింది. అందుకే, గంజాయిలాగా వాటిని అలవాటు చేసినా, తమను ఎన్నికల వైతరిణీలను ఇవి దాటించలేవేమో అని దేశంలోని అధికార పార్టీలు అనుమాన పడుతున్నాయి.

ఈ అనుమానమే నేతలను కలుగుల్లోంచి బయటకు తీసుకు వస్తున్నది. ఓటర్ల ఇళ్లవద్దకు పరిగెత్తించి, వారిని హత్తుకుంటూ, వారి యోగ క్షేమాలు విచారించేలా చేస్తున్నది. ఇంటింటికే కాదు, ఊరూరా తిరిగేట్టు చేస్తుంది. ఉచితాలు ఎన్నికల్లో పనిచేయవనే తత్వం బోధపడడమే నేతల ఈ కలుపుగోలు తనానికి అసలు కారణం.

లబ్ధిదారులు ఏ పూటకు ఆ పూట చేపల కూర తినేసి, సాయంత్రం కాగానే చెంబు పట్టుకుని చెరువు గట్టుకు వెళ్ళడానికి తప్ప, వారు జీవితం లో స్థిరపడడానికి మాత్రం ఈ ఉచితాలు  ఉపయోగ పడవు అనేది ఈ ఉచితాలపై ఓ ముఖ్య విమర్శ గా కనపడుతున్నది.

ఆంధ్ర ప్రదేశ్ విషయమే తీసుకుంటే, లక్షా అరవై వేల కోట్ల కు పైబడిన నగదును వివిధ క్యాటగిరీలకు చెందిన లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేసినట్టు ముఖ్యమంత్రి జగన్ స్వయంగా చెప్పారు.

వీరంతా ప్రభుత్వ 'ఉచిత నగదు సహాయ పథ‌కాలకు' అర్హులే అనుకుంటే… వీరిలో ఎంతమంది, ఇక ప్రభుత్వ సహాయం అవసరం లేని ఆర్ధిక స్థాయికి ఎదిగారో తెలియదు. ఇప్పటికి ఎంతమందిని దారిద్ర్య రేఖ ఎగువకు తీసుకొచ్చారో తెలియదు.

అలాగే, తెలంగాణంలో రైతు బంధు, దళిత బంధు పథ‌కాలు…. వగైరా పథ‌కాలు. లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు తరలిస్తున్నారు. లబ్ధిదారుల్లో ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారులు, ధనవంతులు కూడా ఉంటున్నారని రిటైర్ అయిన ఐఏఎస్ అధికారి మురళి నెత్తి, నోరూ కొట్టుకు మరీ చెబుతున్నారు.

అయినప్పటికీ, అందుకే, ఎన్నికలొచ్చినప్పుడు  తాము కళ్ళు మూసుకుని గెలుస్తామనే నమ్మకం పాలకుల్లో కనిపించడం లేదు. ఇన్ని లక్షల కోట్లు దార పోసినా, రావలసిన మైలేజ్ ఎందుకు రావడం లేదనే విషయాన్ని పాలక పక్షాలు ఆలోచిస్తున్నాయా అనేది డౌటే.

ఓ రెండు, మూడు రోజుల పాటు ముఖ్యనేతలు ఏ మంచి రిసార్ట్ లోనో సమావేశమై, తమ 1). పథ‌కాలు, 2). వ్యవహార శైలి, 3) పాలనా తీరు, 4). ప్రజలతో సంబంధాలు, 5). అవినీతి ఆరోపణలు, 6) .నేతల నడవడిక  మొదలైన అంశాలపై 'మేధో మధన' సమావేశాలు నిర్వహించి, తప్పొప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేసినట్టు కనబడితే, ప్రజలలో ఆయా పాలక పక్షాల పట్ల కొంత సద్భావన కలగడానికి అవకాశం ఉంది. ఇవన్నీ ప్రజలకు సంబంధించిన, వారి ఆలోచనలను ప్రభావితం చేయగలిగిన అంశాలే కదా!

ఈ అంశాలలో ఆయా పాలక పక్షాలు ఎంత బాధ్యాతాయుతంగా వ్యవహరిస్తున్నాయనే విషయం తెలుసుకోవడంలో ప్రజలకు అమితమైన ఆసక్తి ఉంటుంది.

ఈ ఆసక్తి పేరే పబ్లిక్ పెర్సెప్షన్. ఇదే రాజకీయ పార్టీలను అధికారంలోకి తీసుకు వస్తుంది. అధికారంలో ఉన్న వారిని బంగాళాఖాతంలోకి ఈడ్చి అవతల పారేస్తుంది. అంతే తప్ప, ఉచితాలు కాదు. ఉచితాల వల్ల, అధికారంలో ఉన్న వారి పట్ల ప్రజలలో సానుకూలాభిప్రాయం కలగదు. అధికారంలో ఉన్న వారు మాట్టాడే తీరు, చేసే పనులు, వ్యవహార శైలి, ప్రభుత్వ నిర్వహణ తీరు, వారి పొలిటికల్ క్యారెక్టర్, ప్రజల పట్ల అధికార యంత్రాంగం తీరు, ముఖ్యంగా ఎంఆర్ఓ ఆఫీసు…. పోలీస్ స్టేషన్ స్థాయి వ్యవహార శైలి ప్రజాభిప్రాయాన్ని అమితంగా ప్రభావితం చేస్తాయి.

ఏ ప్రభుత్వం నుంచి అయినా, ఉచితాల కంటే ఎక్కువగా ప్రజలు గౌరవం ఆశిస్తారు. తమ ఆత్మ గౌరవానికి భంగం కలగకూడదని కోరుకుంటారు. చివరకు ఉచితాల లబ్ధిదారులకు సైతం, ఉచితాల కంటే ఆత్మ గౌరవమే ముఖ్యం. ఈ విషయాలపై అవగాహన ఉంటే ఉచితాలతో నేతలకు పనిలేదు.

ప్రజలు గౌరవప్రదంగా పని పాటలు చేసుకుంటూ, సొంతంగా సంపాదించుకునే పరిస్థితులు కల్పించే పాలక పార్టీలను ప్రజలు తమ భుజాల మీద మోసుకుంటూ, పోలింగ్ బూత్ ల వద్దకు తీసుకు వెడతారు. అప్పుడు ఓట్లు కొనాల్సిన పని లేదు. మందు పోయించాల్సిన పని లేదు. దొంగ ఓట్లతో పని లేదు. పోలీసులతో పని అసలే లేదు.

పాలక పార్టీలలో నిజాయతీ లోపిస్తేనే…. ఉచితాలు పట్టుకు వేలాడతారు.  కానీ అవి గట్టు ఎక్కించవు. చేసే పనుల్లో నేతలకు సిన్సియారిటీ లేనప్పుడే భయం పట్టుకుంటుంది. ఉచితాలను స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని అనుకున్నప్పుడే సమస్య వస్తుంది. 'నా కోసం ఇచ్చావా? నీ కోసం ఇచ్చావు గానీ…' అనే ప్రశ్నలు ఎదురవుతాయి.

భక్తి శివుడి మీద… చిత్తం చెప్పుల మీద అన్నట్టుగా.. ప్రచారం ఉచితాల మీద, చూపు ఓట్ల మీద ఉంటే అవి ఎన్నికల వైతరిణి ని దాటించవ్. వైతరిణిలో ముంచేస్తయ్. 2019 లో చంద్రబాబు నాయుడిని ముంచేయలేదూ!?

భోగాది వేంకట రాయుడు