అప్పన్న భూములు ఫుల్ మీల్స్… ?

భూ దాహానికి అంతు ఉండదు, ఎక్కడ భూములు దొరికినా పళ్ళెం లో పెట్టుకుని ఎంచక్కా భోజనం చేసేస్తారు. సరే ఈ పక్క వాడివి, పొరుగువాడివీ, దిక్కూ దివాణం లేని భూములు కబ్జా చేయడమే ఇంతదాకా…

భూ దాహానికి అంతు ఉండదు, ఎక్కడ భూములు దొరికినా పళ్ళెం లో పెట్టుకుని ఎంచక్కా భోజనం చేసేస్తారు. సరే ఈ పక్క వాడివి, పొరుగువాడివీ, దిక్కూ దివాణం లేని భూములు కబ్జా చేయడమే ఇంతదాకా చూశారు అంతా.

కానీ ఏకంగా సకల లోకాలకు దేవుడు సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం శ్రీ సింహాచలం అప్పన్నస్వామి వారి భూములకు కూడా రక్షణ లేకపోవడమే ఆస్తిక జనులకు మనోవేదన కలిగించే విషయం. స్వామి వారికి ఉన్న మొత్తం భూములలొ పదవ వంతు స్వాహా అయినట్లుగా తాజాగా అధికారులు గుర్తించి షాక్ అయ్యారు.

ఇవి కూడా అధికారికంగానే జరిగినట్లుగా తేలడంతో ముక్కున వేలేసుకుంటున్నారు. అప్పన్నస్వామికి 11 వేల చిల్లర భూములు ఉన్నాయి. వాటిలో కొన్ని నాటి ప్రభుత్వాల అవసరాలకు ఇవ్వగా  దాదాపుగా పదివేల ఎకరాల దాకా స్వామి వారి భూములు ఉన్నాయి. 

ఇందులో నుంచి ఏకంగా 748 ఎకరాల భూములు అసలు స్వామి వారి ఆలయానికి చెందవన్న‌ట్లుగా అయిదేళ్ల క్రితం అధికార స్థాయిలోనే పెద్దలు పక్కన పెట్టేసిన వైనం ఇపుడు రచ్చ రేపుతోంది. ఒక విధంగా రాజకీయంగా కాక రేపుతోంది.

ఎందుకంటే ఆ సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ప్రభుత్వానికి తెలియకుండా ట్రస్ట్ బోర్డ్ లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అన్నదే చర్చ. ఈ భూముల విలువ ఇప్పటి మార్కెట్ రేటు ప్రకారం అచ్చంగా పదివేల కోట్ల రూపాయల మాటే. 

అంటే ఇది ఏపీలోనే జరిగిన అతి భారీ కుంభకోణంగా అధికార పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. దీని వెనక ఎవరు ఉన్నారన్న దాని మీద ఇపుడు లోతైన దర్యాప్తుకు రంగం సిధ్ధమవుతోంది. చూడాలి మరెన్ని చిత్రాలు దీనిలో వెలుగులోకి చూస్తాయో.