నారా లోకేష్.. ఓ విఫల ప్రయోగం

మహానాడులో అయినా కనీసం లోకేష్ కి ఎలివేషన్లు ఉండవా..? ఎంత సేపు చంద్రబాబు యాత్రలు, చంద్రబాబు ఫోజులు, చంద్రబాబు అభివాదాలు.. ఇవేనా.. కనీసం భావి నాయకుడిగా చెప్పుకుంటున్న లోకేష్ కి ఘన స్వాగతాలు కూడా…

మహానాడులో అయినా కనీసం లోకేష్ కి ఎలివేషన్లు ఉండవా..? ఎంత సేపు చంద్రబాబు యాత్రలు, చంద్రబాబు ఫోజులు, చంద్రబాబు అభివాదాలు.. ఇవేనా.. కనీసం భావి నాయకుడిగా చెప్పుకుంటున్న లోకేష్ కి ఘన స్వాగతాలు కూడా లేవా, అసలు అలాంటి కార్యక్రమాలు చేయాలని క్యాడర్ కి కూడా తెలియదా..? లోకేష్ ని తెరపైకి తేవడం కంటే.. వెనకే ఉంచడం మేలని ఆమధ్య బాబుకి బాగా అర్థమైంది. 

అప్పటినుంచి చంద్రబాబే అన్నిటికీ ముందుకొస్తున్నారు. లోకేష్ ని పూర్తిగా సైడ్ క్యారెక్టర్ చేశారు. చినబాబుకి కూడా ద్వితీయ శ్రేణి నాయకులపై పట్టులేదు. అందుకే ఆయనకి అస్సలు ఎలివేషన్లు లేవు, జేజేలు లేవు. నలభై ఏళ్లు వస్తున్నా.. ఇంకా తండ్రిచాటు బిడ్డగానే రాజకీయం వెలగబెడుతున్నారు.

యువకుడే కానీ ఉత్సాహవంతుడు కాదు..

నారా లోకేష్ యువకుడే కానీ, ఉత్సాహవంతుడు కాదు, అసలు రాజకీయాలపై ఆయనకు పరిజ్ఞానం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. ట్యూషన్లు పెట్టినా, ట్రైనింగ్ లు ఇప్పించినా ఆ శిలను శిల్పం చేయడం ఎవరి తరం కాలేదు. అందుకే బాబు కూడా అలా వదిలేశారు. ఆయనతో పెట్టుకుంటే అసలుకే మోసం వస్తుందని గ్రహించి, తానే రంగంలోకి దిగారు. అదే సమయంలో లోకేష్ ని పూర్తిగా పక్కనపెట్టేశారు.

లోకేష్ ని కనీసం తెరముందుకు తెస్తే పార్టీపై ఉన్న ఆ కాస్త సింపతీకూడా పోతుందనే విషయం చంద్రబాబుకి బాగా అర్థమైంది. అందుకే వయసు సహకరించకపోయినా, ఆరోగ్యం ఇబ్బంది పెడుతున్నా.. రాజకీయ కాంక్షతో రెచ్చిపోతున్నారు. తానింకా రిటైర్ కాలేదంటున్నారు.

అవకాశాలను మిస్ చేసుకున్న లోకేష్..

ఐటీ మంత్రిగా వచ్చిన అవకాశాన్ని లోకేష్ అప్పట్లో సరిగా ఉపయోగపెట్టుకోలేదు. ఆ తర్వాత మంగళగిరి ఎన్నికల్లో దారుణ పరాభవం కూడా ఆయన శక్తి సామర్థ్యాలను బయట పెట్టింది. కనీసం ఆ తర్వాతయినా లోకేష్ మారారా అంటే అదీ లేదు. కేవలం తన ఫిజిక్ పై దృష్టిపెట్టారు. తెల్లగడ్డాన్ని అలాగే వదిలేసి, అదే సీనియార్టీ అనుకోమంటున్నారు. కనీసం తన ఫిజిక్ పై పెట్టిన శ్రద్ధ, రాజకీయాలపై పెట్టినా, జనంపై పెట్టినా లోకేష్ కాస్తో కూస్తో అనుభవం సాధించేవారు. కానీ ఇంకా అది మొదలు పెట్టలేదు, మొదలు పెట్టినా లోకేష్ కి అది సాధ్యం కావడంలేదు.

దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రుల పిల్లలు ఎంత యాక్టివ్ గా ఉన్నారో అందరికీ తెలుసు. వారిలో కొందరు ముఖ్యమంత్రులయ్యారు, మిగతావారు పార్టీ పగ్గాలు చేపట్టి సమర్థంగా నడుపుతున్నారు. ఓడిపోయినా.. తమలో నాయకత్వ లక్షణాలున్నాయనే విషయాన్ని మాత్రం రుజువు చేసుకున్నారు. కానీ లోకేష్ అలా కాదు. ఓటమితోపాటు, ఆయనలో నాయకత్వ లక్షణాలు లేవనే విషయాన్ని అందరికీ తెలియజెప్పుకున్నారు.

అందుకే లోకేష్ తో ఎవరూ కలవడంలేదు, బాబు జపమే చేస్తున్నారు. గజమాల అయినా, ఘన స్వాగతం అయినా అన్నీ చంద్రబాబుకే, యువరాజుకి ఏ ఒక్కటీ లేదు. కనీసం భావి నాయకుడిగా ప్రచారం కూడా లేదు. ఈ స్ట్రాటజీ టీడీపీని అధికారంలోకి తేవడంకోసం ఉపయోగపడుతుంది అనుకున్నా.. ఆ తర్వాత పార్టీపై చినబాబు పట్టు సాధించడం మాత్రం అసాధ్యంగా మారుతుంది.