Advertisement

Advertisement


Home > Politics - Opinion

మహానాడులో అయినా కొత్త పాట అందుకుంటారా?

మహానాడులో అయినా కొత్త పాట అందుకుంటారా?

తెదేపాకి తెలిసినవి రెండే పాటలు. ఒకటి ఆత్మస్తుతి, మరొకటి పరనింద. 

గతంలో నేనది చేసాను, నేనే ఇది చేసాను అని గతించిపోయిన గాథల్ని చెప్పుకోవడం (అందులో సగం అబద్ధాలే)...లేదా వైకాపా ప్రభుత్వాన్ని రాక్షసపాలన అంటూ నోటికొచ్చినట్టు పేలడం. 

ఇంతకు మించి అసలీ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏవిటో ఎవ్వడికీ తెలీదు. ఇప్పటికిప్పుడు ప్రజలు ఈ పార్టీకి ప్రభుత్వాన్నప్పగిస్తే ఏం చెయ్యాలో చంద్రబాబుకైనా క్లారిటీ ఉందా? 

డబ్బా కొట్టుకోవడం వల్ల, రూలింగ్ పార్టీని తిట్టడం వల్ల ఇప్పుడీ పార్టీకి ఒక్క ఓటు కూడా కొత్తగా రాదు. వైసీపీని తిట్టుకుంటూ పోతే ఆటోమేటిక్ గా జనం ఓట్లేసి తెదాపాని గెలిపించేస్తారనే భ్రమల్లో బతుకుతున్నారేమో. అలాంటి పనులు చేసే 2019లో అడ్డంగా ఓడిపోయింది తెదేపా. తర్వాత స్థానిక ఎన్నికల్లోనూ, బై ఎలక్షన్స్ లోనూ కూడా అందుకే ఓడిపోయింది. 

గతంలో అయితే ఓటమిలో ఉన్నప్పుడు ఎన్.టి.ఆర్ నామస్మరణ చెసుకుంటూ కాలం గడిపేవారు తెదేపా నాయకులు. ఇప్పుడు ఆయన పేరుని గట్టిగా అన్నా జనం తమ వైపు చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే చంద్రబాబు హయాములో అతిపోకడలకి పోయి ఎన్.టి.ఆర్ పేరుని కమ్మవారి ఆరాధ్యదైవంగా మార్చేసారు. ఇప్పుడు "ఎన్.టి.ఆర్ కి భారతరత్న", "ఎన్.టి.ఆర్ కలలుగన్న తెలుగురాష్ట్రం" అని నినాదాలు చేస్తే కరడుకట్టిన కమ్మవారి ఓట్లు పోలరైజ్ అయ్యి పడతాయేమో తప్ప కొత్తగా బయటి కులాల ఓట్లు పడే ప్రసక్తి లేదు. ఇప్పుడు తెదేపా "కేవలం కమ్మ పార్టీ కాదు" అనే నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ఎన్.టి.ఆర్ పేరు చెప్పుకోకూడదు. ఆయనని అంతలా ఒక కులానికి పరిమితం చేసేసిన ఘనత ఆ పార్టీ నాయకత్వానిది మరియు కుల సంఘాలది.  

పైగా చంద్రబాబు ఎన్.టి.ఆర్ కి ఎలా వెన్నుపోటు పోడిచి పార్టీని లాక్కునాడో ఆర్జీవీ తన "లక్ష్మీస్ ఎన్.టి.ఆర్" సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించాడు. అది జనం మైండ్స్ లో బాగా పడిపోయింది. దీనికి తోడు కొడాలి నాని లాంటి వైసీపీ నాయకులు తరచూ ప్రెస్మీట్స్ లో అదే వెన్నుపోటు కథని గుర్తి చేస్తూనే ఉన్నారు. కనుక ఎన్.టి.ఆర్ పేరుని చెప్పుకునే అర్హత చంద్రబాబు నైతికంగా కోల్పోయినట్టయింది.  

ఇదంతా పక్కన బెడితే జనం కనెక్ట్ అయ్యేది "నెక్స్ట్ ఏంటి?" అనే టాపిక్ మీద. అంతే తప్ప సెల్ఫ్ డప్పు విని కాదు. 

-కోనసీమకి అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టడం పై తెదేపా స్టాండ్ ఏవిటి?

- విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకం విషయంలో కేంద్రానికి ఎదురెళ్ళే ఆలోచన ఉందా?

-అమరావతిని రాజధానిగా మలచడానికి నిథులు ఎక్కడినుంచి తెస్తారు?

-సంక్షేమ పథకాల వల్ల రాష్ట్ర ఖజానా దెబ్బతింటోందంటున్నారు కనుక తాము పదవిలోకొస్తే అవన్నీ ఎత్తి పారేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తారా?

- ఇంగ్లీషు మీడియం వద్దన్నారు కనుక తాము పదవిలోకొస్తే మళ్లీ తెలుగుమీడియం పెడతారా?

- గ్రామసచివాలయాలు, విలేజ్ వాలంటీర్ వ్యవస్థలు అన్నీ ఎత్తిసి యథాతథంగా పాత పద్ధతిలో ప్రజలు జిల్లా కార్యాలయాల వద్ద లైను కట్టి కూర్చునే రోజుల్ని మళ్లీ తీసుకొస్తారా? 

- పొత్తులపై స్పష్టత ఇస్తారా? అవి సిద్ధాంతపరంగా ఉంటాయా? లేక పదవి వచ్చేట్టయితే వావీ వరసలూ అవసరం లేదా? 

- కేంద్రప్రభుత్వ విధానాలపై నోరు మెదిపి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెడతారా లేక ఇప్పటిలాగానే వణికిపోతూ కూర్చుంటారా? 

ఇలాంటి ప్రశ్నల విషయంలో తమ స్టాండ్ ఏమిటన్నది మహానాడు వేదిక నుంచి తెదేపా నాయకత్వం ప్రజలకి క్లారిటీ ఇవ్వాలి. తామేమి చెయ్యాలనుకుంటున్నారో అవన్నీ ప్రజలకి తెలియబరిస్తేనే కదా కాస్త వాళ్లు ఆలోచనలో పడేది. 

తమ మ్యానిఫెస్టోని ఇప్పటి నుంచే ప్రజల్లోకి పంపే పనిచేయగలగాలి. కొత్త పాట వినిపించాలి. అంతే తప్ప ఎప్పటిలాగ పాడిందే పాట అయితే..ఎవ్వడూ పట్టించుకోడు...తమ పచ్చ చానల్స్, పేపర్స్ తప్ప. 

హరగోపాల్ సూరపనేని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?