మహానాడు అంటే అక్కడేం జరుగుతుందో అందరికీ తెలుసు. సొంత డబ్బా, పరనింద ఈ రెండు మాత్రమే. అయితే నిజంగా బాబుకు దమ్ముంటే, రాజకీయాలు-ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే ఒక పని చేయాలి. మహానాడు వేదికగా తన పార్టీ భవిష్యత్ ప్రణాళికను వివరించాలి. అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామో చెప్పాలి. గతంలో సరిగ్గా ఎన్నికలకు రెండేళ్ల ముందు జగన్ ఇదే పని చేశారు. ప్రజాసంకల్ప యాత్ర తలపెట్టి.. ప్రజల మధ్యనే తన మేనిఫెస్టోను బయటపెట్టారు. ప్రజలకు దగ్గరయ్యారు.
చంద్రబాబుకు ఇప్పుడు మహానాడు పేరిట అలాంటి అద్భుత అవకాశం వచ్చింది. ప్రజలకు ఏం చేయబోతున్నారో తన మేనిఫెస్టో ను బాబు బయటపెట్టాలి. ఈ పని చేయకుండా మరోసారి ప్రభుత్వాన్ని, జగన్ ను తిడుతూ కాలక్షేపం చేస్తే ఒరిగేదేం ఉండదు. చరిత్రలో మరో మహానాడు కలిసిపోతుందంతే.
అవకాశాలను సృష్టించుకోవడంలో బాబు అందెవేసిన చేయి అని ఎల్లో మీడియా ఓ రేంజ్ లో ప్రచారం చేస్తుంది. కానీ అదంతా వట్టి అబద్ధం. బాబు అవకాశాలు సృష్టించుకోరు. పక్కవారి అవకాశాలు బలవంతంగా లాక్కుంటారు. కేవలం మాయమాటలు చెప్పి, మభ్యపెట్టి, అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తుంటారు. ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ జరిగింది ఇదే. ఈసారి మాత్రం ఆయనకు ఆ అవకాశమివ్వడంలేదు జగన్. జగన్ పై వ్యతిరేకత లేదు, ఉన్నా అది చంద్రబాబుని అధికారంలోకి తెచ్చేంత పెద్దది మాత్రం కాదు.
పోనీ చంద్రబాబు కొత్తగా ఏదైనా అద్భుత పథకం తెస్తానని చెప్పేంత సీన్ కూడా లేదు. ఒకవేళ అలా చెప్పాలంటే ఉన్న పథకాలను ఆపేస్తానని ఒప్పుకోవాలి. ఆ మాట బాబు అంటే.. ఇప్పుడున్న 23 సీట్లు కూడా రావు. సింగిల్ డిజిట్ కి పరిమితమైపోతాడంతే. సో.. కొత్త పథకాలు చెప్పలేక, ఉన్న పథకాలను కంటిన్యూ చేస్తాననే దమ్ములేక బాబు సతమతం అవుతున్నారు.
మహానాడు తీర్మానాల సంగతేంటి..?
బడుగు బలహీన వర్గాల కోసం బాబు ఏమని తీర్మానం పెడతారు. అత్యథిక పదవులిస్తానంటారా..? ఇప్పటికే జగన్ తన మంత్రి వర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 70శాతం పదవులిచ్చారు. ఆ విషయాన్ని ప్రచారం చేయడానికి బస్సు యాత్ర కూడా పెట్టారు. ఇక ఆయా వర్గాలు బాబు మాట నమ్మలేవు కదా. ఒకవేళ ఇచ్చినా 70శాతానికి మించి చేసేంత దమ్ము, ధైర్యం, ఉదార స్వభావం బాబుకి లేవు.
ఇక రైతుల పేరెత్తితేనే చంద్రబాబుని తరిమి తరిమి కొడతారు. గతంలో ఇచ్చిన రుణమాఫీ హామీయే అమలు చేయకుండా దిగిపోయారు. ఇప్పుడు కొత్తగా ఏ తీర్మానం ప్రవేశ పెట్టినా మూమూలుగా ఉండదు. మహిళా లోకం పసుపు-కుంకుమలకు పడిపోరనే విషయం 2019లోనే రుజువైంది. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారు చెప్పండి.
నిరుద్యోగులకు బాబు భృతి ఇచ్చి సరిపెట్టారు, అది కూడా ఎన్నికల ఏడాది మొదలయ్యే సమయంలో. వారందరికీ జగన్ సచివాలయాలు, వాలంటీర్ల పేరుతో ఉపాధి చూపించారు. సో అక్కడ కూడా ఎవరూ మిగల్లేదు. చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, టైలర్లు, కల్లుగీత కార్మికులు.. ఇలా ఏ వర్గాన్ని చూసుకున్నా జగన్ కంటే ఎక్కువగా మేలు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఒకవేళ చేస్తానని చెప్పినా ఇప్పుడున్న ఆల్రడీ అమలులో ఉన్న పథకాలతో అలాంటి సాహసం ఎవరూ చేయరు.
సో.. బాబుకి కనీసం తీర్మానాలు చేసేందుకు కూడా జగన్ అవకాశమివ్వలేదు. ఒకరకంగా మహానాడులో తీర్మానాలు, భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికల మేనిఫెస్టో చంద్రబాబు ప్రకటించారంటే గొప్పే. ఆ ఒక్క పని సమర్థంగా చేయగలిగితే టీడీపీపై జనాల్లో నమ్మకం ఏర్పడే అవకాశముంది.