సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను సాగించే హీరోయిన్లకు కూడా కొంత నిర్లక్ష్యం ఉంటుంది. తమ పని నటన మాత్రమే అన్నట్టుగా… తెరపై అందాలు ఆరబోసేస్తే, ఆరు పాటల్లో అలా కనిపించి వెళ్లిపోతే తమ పని పూర్తయినట్టుగా చాలా మంది హీరోయిన్లు భావిస్తూ ఉంటారు! దశాబ్దాల పాటు వేరే భాష ఇండస్ట్రీల్లో పని చేస్తూ వస్తున్నా.. ఆ భాషలో కనీసం మాట్లాడలేని వారు అనేక మంది ఉంటారు. ప్రత్యేకించి తెలుగులోకి దిగుమతి అయ్యే మలయాళ, ముంబై, పంజాబీ, తమిళ హీరోయిన్లు ఇలాంటి వారే ఎక్కువ!
వారి పాత్రలకు వారే డబ్బింగ్ చెప్పుకోవడం మాట అటుంచి, కాస్త మాట్లాడటం కూడా వీరికి కష్టమే. అయితే ఈ హీరోయిన్లలోనే కొందరు ఉంటారు.. తక్కువ కాలంలోనే వారు తమకు ఉపాధి కల్పించిన భాషను నేర్చుకోవడమే కాదు, ఎంతో కష్టపడి తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ జాబితాలోనే నిలుస్తోంది రష్మిక!
ఇప్పటికే పుష్ప సినిమాలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుని తన సత్తా చూపించింది రష్మిక. అందులోనూ పక్కా చిత్తూరు స్లాంగ్ ను పలకడానికి ఆమె బాగానే కష్టపడింది. ఈ విషయంలో సమంత కన్నా.. రష్మికకు ఎక్కువ మార్కులు పడతాయి. సమంత ఆ మధ్య కొన్ని సినిమాల్లో సొంత డబ్బింగ్ చెప్పుకుంది. అయితే.. అది సరిగా ఉండదు.
మహానటి వంటి సినిమాలో .. శంకరయ్య అనే పేరును సంకరయ్య.. సంకరయ్య అంటూ సమంత సినిమా ఆసాంతం పలుకుతుంది! మరి దాని దర్శకుడు, ఇతర రూపకర్తలు గుర్తించలేకపోయారేమో పాపం. సమంత తెలుగు డబ్బింగ్ కనిపించని స్పష్టత రష్మిక డబ్బింగ్ లో ఉంటుంది.
ఇక పుష్ప హిందీ వెర్షన్లో రష్మికకు అక్కడి సింగర్ ఒకరు డబ్బింగ్ చెప్పారు. అయితే ఇప్పుడు రష్మిక అక్కడ కూడా సొంత వాయిస్ వినిపిస్తోంది. అమితాబ్ సినిమా ఒకదాంట్లో నటిస్తున్న రష్మిక తొలిసారి హిందీలో సొంత డబ్బింగ్ చెప్పుకునే పని పూర్తి చేసింది. తేలికేమీ కాదని, కష్టపడి హిందీ డబ్బింగ్ పని పూర్తి చేసుకున్నట్టుగా రష్మిక ప్రకటించుకుంది. మొత్తానికి ఈ పనితీరు ఆమె అంకితభావానికి నిదర్శనం అనే చెప్పాలి.