దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్ కర్ ఘన విజయం సాధించారు. 346 ఓట్ల మెజారిటీతో యూపీఏ తరఫు అభ్యర్థి మార్గరేట్ అల్వాపై ఆయన విజయాన్ని నమోదు చేశారు. లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యుల ఓట్లతో జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఇలా ఎన్డీయే అభ్యర్థి విజయాన్ని నమోదు చేశారు.
ఇది ముందుగా ఊహించినదే. యూపీఏ అభ్యర్థికి ప్రతిపక్ష పార్టీలు పెద్ద మద్దతును తెలపలేదు. రాష్ట్రపతి ఎన్నికలో ఓటమిని మూటగట్టుకున్నట్టుగానే, ఉప రాష్ట్రపతి ఎన్నికలో కూడా యూపీఏకు, కాంగ్రెస్ కు ఓటమి తప్పలేదు. ఎలాగూ ఓటమి తప్పదనే ఎన్నికలో తమ పార్టీ సీనియర్ నేత మార్గరేట్ అల్వాను బరిలోకి నిలిపింది కాంగ్రెస్ పార్టీ. పోటీలో నిలబడిన పేరు తన్న అల్వాకు దక్కింది ఏమీ లేదు.
780 ఓట్లకు గానూ దాదాపు 725 ఓట్లు పోల్ అయ్యాయి. వాటిల్లో 528 ఓట్లు ఎన్డీయే అభ్యర్థికి దక్కగా, యూపీఏ అభ్యర్థికి 182 ఓట్లు మాత్రమే దక్కాయి. దీంతో ధన్ కర్ కు భారీ మెజారిటీ దక్కింది. వెంకయ్య నాయుడు తర్వాత ధన్ కర్ ఉపరాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఉపరాష్ట్రపతే రాజ్యసభకు చైర్మన్ గా కూడా వ్యవహరిస్తారనే సంగతి తెలిసిందే. సీనియర్ బీజేపీ నేత హోదాలో ధన్ కర్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా వార్తల్లో నిలిచారు. ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించిన పేరుంది ధన్ కర్ కు. మరి ఉపరాష్ట్రపతి హోదాలో ఆయన తన మార్కును ఏ రీతిన చాటతారో!