తమిళనాట ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రత్యేకించి సినిమా నిర్మాతలను లక్ష్యంగా చేసుకుని.. నాలుగు రోజుల పాటు ఐటీ శాఖ నిర్వహించిన సోదాల్లో లెక్కల్లో చూపని ఆస్తులు భారీ ఎత్తున బయటపడినట్టుగా తెలుస్తోంది. ఈ ఆస్తుల విలువ రెండు వందల కోట్ల రూపాయల పై మాటే అని సమాచారం.
ప్రధానంగా క్యాష్, బంగారం రూపాల్లో రెండు వందల కోట్ల రూపాయల విలువైన, లెక్కల్లో చూపని సంపదను గుర్తించిందట ఐటీ శాఖ. అయితే ఇదంతా కేవలం ఒక్క నిర్మాత సొత్తు కాదు. పలువురు సినీ నిర్మాతల ఇళ్లపై, ఆఫీసులపై ఐటీ శాఖ వరసగా నిర్వహించిన సోదాల్లో ఈ అక్రమాస్తులు బయటపడినట్టుగా సమాచారం.
ఇందుకు సంబంధించి ఐటీ శాఖ పూర్తి ప్రకటన చేయాల్సి ఉంది. ఈ అక్రమాస్తులు ఎవరెవరివి అనే క్లారిటీ రావాల్సి ఉంది. సినిమా వాళ్ల ఇళ్లపై ఐటీ శాఖ దాడులు కొత్త కాదు. దక్షిణాదిన ఇది వరకూ పలువురు హీరోల, నిర్మాతల ఇళ్లపై ఐటీ రైడ్స్ జరిగిన దాఖలాలు ఉన్నాయి. పెద్ద పెద్ద స్టార్ల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. పలు సార్లు కొన్నిఅక్రమాలు బయటపడ్డాయి. మరి కొన్ని సార్లు ఐటీ శాఖ అలాంటి ప్రకటనలు ఏవీ చేయలేదు.
ఇలాంటి నేపథ్యంలో.. రెండు వందల కోట్ల రూపాయల మొత్తం లెక్కల్లో చూపని సంపద అంటే.. పెద్ద మొత్తమే అనుకోవచ్చు! అయితే పలువురు నిర్మాతలు అంటున్నారు కాబట్టి.. ఎక్కువ మంది ఇళ్లపై అయితే తక్కువ మొత్తమే!
తమ సినిమాలు భారీ ఎత్తున కలెక్షన్లను సాధించినట్టుగా పలువురు సినీ నిర్మాతలు ప్రకటించుకుంటూ ఉంటారు. అలాంటి సందర్బాల్లో కూడా ఇది వరకూ ఐటీ రైడ్స్ జరిగిన దాఖలాలున్నాయి.
అయితే ప్రేక్షకులను ఆకర్షించడానికి, సినిమా పై పాజిటివ్ ప్రచారానికే అలాంటి ప్రకటనలు చేస్తూ ఉంటామంటూ ఐటీ అధికారులకు కొందరు నిర్మాతలు చెప్పారట ఆ సందర్భాల్లో! దీంతో వారికి ఆశాభంగం తప్పలేదు. అయితే తమిళ నిర్మాతల ఇళ్లపై సోదాల వ్యవహారంలో మాత్రం ఐటీ దాడులకు బాగానే గిట్టుబాటు అయినట్టేనేమో!