Bholaa Shankar Review: మూవీ రివ్యూ: భోళా శంకర్

చిత్రం: భోళా శంకర్ రేటింగ్: 1.5/5 తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, అన్నీ మాస్టర్, తులసి, మురళి శర్మ, రవి శంకర్, సుశాంత్, గెటప్ శ్రీను, రష్మీ గౌతం తదితరులు. …

చిత్రం: భోళా శంకర్
రేటింగ్: 1.5/5
తారాగణం:
చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, అన్నీ మాస్టర్, తులసి, మురళి శర్మ, రవి శంకర్, సుశాంత్, గెటప్ శ్రీను, రష్మీ గౌతం తదితరులు. 
సంగీతం: మహతి స్వర సాగర్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
కెమెరా: డుడ్లే
నిర్మాత: అనీల్ సుంకర
దర్శకత్వం: మెహర్ రమేష్
విడుదల తేదీ: 11 ఆగష్ట్ 2023

“భోళా శంకర్” పాటల ద్వారా కాకపోయినా ఇంటర్వ్యూల్లో చెప్పిన మాటల ద్వారా బాగా ప్రచారాన్ని పొందింది. తమిళ సినిమా వేదాళం కి రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో బాగోగులు తెలుసుకుందాం. 

శంకర్ (చిరంజీవి) తన చెలెల్లు మహాలక్ష్మి (కీర్తి సురేష్) తో హైదరాబాదు నుంచి కలకత్తాకి మకాం మారుస్తాడు. అక్కడ లాస్య (తమన్నా) అనే లాయర్ పరిచయమౌతుంది శంకర్ కి. మహాలక్ష్మిని లాస్య సోదరుడు (సుశాంత్) ప్రేమిస్తాడు. ఇదిలా ఉంటే సడెన్ గా శంకర్ విమెన్ ట్రాఫికింగ్ చేసే ముఠాలని నరుకుతూ ఉంటాడు. ఆ కథకి, మెయిన్ కథకి లింకే ఈ సినిమా. 

ప్రధమార్థంలో ఒక్కటంటే ఒక్క నవ్వు కూడా లేకుండా, కనీసం ఒక్క మెరుపు కూడా లేకుండా, బిల్డప్పులకి తగిన విషయం లేకుండా చిరంజీవి సినిమా నడిచిందంటే ప్రేక్షకుల పరిస్థితేంటో ఊహించొచ్చు. ఇందులో కామెడీ అనుకుని తీసిన చాలా సన్నివేశాలు నిట్టూర్పులు తెప్పిస్తాయి. ప్రేక్షకుడికి వినోదం కానీ, ఉత్కంఠగానీ కలిగించకుండా.. ఆమాటకొస్తే నవరసాల్లో ఏ రసాన్నీ అందించకుండా కేవలం నీరసాన్ని మాత్రమే ఇచ్చిన ఘనత ఈ చిత్రానికి చెందుతుంది. 

ఫస్టాఫులో ఏసీ హాల్లో కూడా గాలాడక కూర్చున్న జనానికి సెకండాఫులో దర్శకుడు విసినకర్రైనా ఊపిడా అంటే అదీ లేదు. “వేదాళం” చూడని వాళ్లకి కూడా తర్వాతి సీనేంటో ముందే అర్ధమైపోతూ ఉంటుంది. క్లైమాక్స్ ఏమౌతుందో ఊహించడానికి వీల్లేకుండా వెయిట్ చేయిస్తే తప్ప గొప్ప స్క్రీన్ ప్లే అనిపించుకోదు. కానీ సెకండాఫ్ పావు భాగం అవ్వగానే క్లైమాక్స్ వరకు కూర్చోవాల్సిన అవసరం సగటు ప్రేక్షకుడికైతే కలగదు. అలా కూర్చోబెట్టగలిగే అంశాలు కూడా ఇంకేవీ లేవని అనిపించినప్పుడు “హర హర మహదేవా” అని మనసులోనే గట్టిగా అనుకుని లేచి వెళ్లిపోవచ్చు. 

“మిల్కీ బ్యూటీ నువ్వే నా స్వీటి” పాటని ఆస్వాదించడానికి కూడా అప్పటి వరకు చూసిన కథనం, ఆ పాట వచ్చే టైమింగ్ అడ్డం పడతాయి. “జాం జాం జజ్జనక” పాట కూడా అంతే. సంగీతం పరంగా ఈ సినిమా జస్ట్ ఏవరేజ్. ఇతర సాంకేతిక విలువలు బాగానే ఉన్నాయి. 

అయితే కథలో కొన్ని మార్పులు చేసి చిరంజీవికి తగ్గట్టుగా మలిచామని మెహర్ రమేష్ చెప్పినా ఆ పనేమీ జరిగినట్టు లేదు. దానికీ దీనికీ కొన్ని ఇంట్రడక్షన్ సీన్స్ లో తప్ప పెద్ద తేడా ఏమీ లేదు. 

వెన్నెల కిషోర్, బ్రహ్మానందం ఉన్నా పెద్దగా నవ్వించలేదు. చిరంజీవి శ్రీముఖితో చేసిన కామెడీ రొమాన్స్ వెగటుగా ఉంది. “ఖుషీ” సీన్ రీక్రియేషన్ కూడా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. 

చిరంజీవిని ఒక విషయంలో మాత్రం మెచ్చుకుని తీరాలి. వయసుని జయిస్తూ ఇంకా యంగ్ గా కనిపిస్తూ, డ్యాన్సులు కూడా గ్రేస్ఫుల్ గా చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఆ విషయంలో మాత్రం 5/5 రేటింగ్ వెయ్యాల్సిందే. కానీ కథని ఎంచుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. 

ఇక తమన్నా కంటికింపుగా ఉంది. పాటల్లో కనువిందు చేసింది. కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలో ఓకే. ఆమాత్రం పర్ఫార్మెన్స్ ఏ నటీమణైనా ఇవ్వగలదు. కీర్తి సురేష్ స్థాయి నటనని పలికించడానికి తగ్గ స్కోపివ్వలేదు దర్శకుడు. 

మురళి శర్మ, తులసి ఓకే. మిగిలిన విలన్స్ చాలా లౌడ్ గా ఉన్నారు. అందరూ అరుస్తూనే ఉంటారు. నటుడు రవిశంకర్ కూడా “ఇది నా ఏరియా, నా జాగ” అంటూ “కెంపె గౌడ” అనే కన్నడ సినిమాలోని తన డైలాగ్ నే మళ్లీ చెపుతున్నట్టుగా అరుస్తాడు. 

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని సామెత. అజిత్ సినిమా హిట్టవ్వడం చిరంజీవి ఫ్యాన్స్ చావుకొచ్చిందని కొత్తగా చెప్పుకోవాలి. 

అజిత్ సినిమా “వేదాళం” 2015 లో వచ్చింది. అప్పటికే అది పాచిపోయిన పాత కథ. అయినప్పటికీ ఎందుకాడిందో ఆడేసింది. ఆడింది కదా అని మనవాళ్లు రీమేక్ హక్కులు కొనడం, తీయడం జరిగింది. 

పోనీ తీసెందెవరు? 2013 లో “షాడో” తీసి అది అట్టర్ ఫ్లాపయ్యాక ఖాళీగా కూర్చున్న మెహర్ రమేష్. అంటే పదేళ్ల పాటు మెగాఫోన్ పట్టుకోని దర్శకుడికి ఈ మెగాస్టార్ సినిమా తీసే అవకాశం వచ్చింది. ఎలా చూసుకున్నా “వేదాళం” చిరంజీవి ఇమేజుకి పనికొచ్చేలా ఉండదు. అయినా దానినే నమ్ముకుని తీసారంటే భయంకరమైన భావదారిద్ర్యమే కారణం.

కథ, కథనం, పాటలు, మాటలు.. ఇలా ఏ విషయంలోనూ సంతృప్తి పరచకుండా చిరంజీవి ఫ్యాన్స్ గుండెలకి చిల్లు చేసిన రీ”మేకు” ఈ భోళాశంకర్. ఒరిజినల్ చిత్రం ఓటీటీలో లేదు కదా అని రీమేక్ చేసే ధైర్యం చేసామన్నారు చిరంజీవి. ఇప్పుడీ భోళాశంకర్ ఓటీటీలో వచ్చినా కూడా పూర్తిగా చూసే ధైర్యం, ఓపిక ఎంతమందికుంటుందో అనుమానమే.

బాటం లైన్: బోర్లాపడ్డ శంకర్