కొన్ని నెలలుగా సామాన్యులు వంటకాల్లో టమోటా పండ్లను వాడడానికి భయపడిన పరిస్థితి. ఎందుకంటే ఆ పండ్ల రేట్లు షాక్ కొడుతూ వచ్చాయి. కిలో టమోటా రేట్ రూ.200కు పైమాటే. ఇక సాధారణ మధ్య తరగతి ప్రజలు కొనే పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది.
ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండడం, ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుండంతో జీవన ప్రమాణాలు దారుణంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో టమోటా రేటుకు సంబంధించి చల్లని వార్త. పది రోజుల క్రితం వరకూ కిలో టమోటా రూ.200 వుండేది. ఇప్పుడు దాని ధర రూ.30-36కు పడిపోవడం ఊరటనిచ్చే విషయమే.
టమోటా మార్కెట్‌కు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె ప్రసిద్ధి. ఆ మార్కెట్లో ప్రస్తుతం టమోటా కిలో రూ.33కు అమ్ముతున్నారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో టమోటా ధరలు లేవు. అలాంటిది చికెట్ కంటే టమోటా ధరలు అమాంతం పెరగడంతో దిగువ, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోయారు. కూరల్లో టమోటా వాడకాన్నే దాదాపు మరిచిపోయిన పరిస్థితి. ఇప్పుడు వాటి ధర తగ్గడంతో మళ్లీ కొనుగోలుకు ఆసక్తి చూపనున్నారు.
ఏది ఏమైనా టమోటా ధరలు వారం రోజులుగా క్రమంగా తగ్గతూ ప్రస్తుతం 30కి పైన, 40కి లోపు నిలిచాయి. ఇతర ప్రాంతాల నుంచి టమోటా పండ్ల దిగుబడి పెరడంతోనే ధరలు అదుపులోకి వచ్చినట్టు సమాచారం. డిమాండ్‌కు తగ్గట్టు మార్కెట్లోకి టమోటాలు రావడంతో వాటంతకవే ధరలు తగ్గుముఖం పట్టాయి.