జనసేనాని పవన్‌కల్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖలో వారాహి యాత్ర నిర్వహిస్తున్న పవన్‌కల్యాణ్ మరోసారి జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. పవన్‌కు కౌంటర్ ఇచ్చేందుకు మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు.
దత్త తండ్రి చంద్రబాబునాయుడు లేదా తాను ముఖ్యమంత్రిగా వుండాలనే ఆశ పవన్‌కల్యాణ్ స్పీచ్‌లో కనిపించిందన్నారు. అంతే తప్ప, వైఎస్ జగన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ దించేయాలనే ఆసూయతో మాట్లాడినట్టు కనిపించిందన్నారు. రాజకీయాలపై అవగాణ కలిగిన వ్యక్తి తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెబుతారన్నారు. కానీ జగన్‌ను తిడితే నాయకుడిని అవుతాననే ఉద్దేశంతో పవన్ ప్రసంగాలున్నాయని విమర్శించారు.
పవన్ రాజకీయ పంథాలో ఎక్కడా ఒక సిద్ధాంతం, విధానం లేవన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే విధానంపై ఎక్కడా మాట్లాడినట్టు కనిపించలేదన్నారు. సినిమాల్లో కథా నాయకుడిగా ఉన్న పవన్‌కల్యాణ్, రాజకీయాల్లో సీఎం వైఎస్ జగన్‌ను తిడితే హీరో అవుతానని అనుకునే జనసేన నాయకుడిని చూస్తే జాలేస్తోందన్నారు. బాబు మాటలు విని బానిసత్వ బతుకీడిస్తున్న పవన్‌ను చూస్తే జాలి పడాల్సి వస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.
15 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌కల్యాణ్ ఏం సాధించారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. గడిచిన తొమ్మిదేళ్లుగా ఐదారు రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడని మంత్రి అమర్నాథ్ దుయ్యబట్టారు. ఇప్పుడు సంసారం బీజేపీతో, సహజీవనం టీడీపీతో అని వెటకరించారు. రాజకీయాల్లో ఇదీ పవన్‌కల్యాణ్ వ్యక్తిత్వమని తప్పు పట్టారు. ప్రతిసారీ జగన్‌పై నోరు పారేసుకుంటున్నాడని ఆయన మండిపడ్డారు.
మరో 8, 9 నెలల్లో ఎన్నికలున్నాయని, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా జనంలోకి వెళ్లినప్పుడు తమ విధానాలను చెప్పి ఓట్లు అడగాలని సూచించారు. చంద్రబాబు స్కీమే పవన్ స్కీమ్ అని వ్యంగ్యంగా అన్నారు. బాబు ఏం చెప్పినా దానికి ఒత్తాసు పలకడమే పవన్ లక్ష్యమన్నారు. పవన్‌కు పొలిటికల్ ప్రొడ్యూసర్ చంద్రబాబునాయుడని ఆయన అన్నారు.