ఉత్కంఠ రేపుతున్న ప‌వ‌న్ నిర్ణ‌యం

ఉత్త‌రాంధ్రలో వారాహియాత్ర నిర్వ‌హిస్తున్న జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అధికార పార్టీపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఎవ‌రికి ఎవ‌రూ త‌గ్గ‌డం లేదు. దూష‌ణ‌లు…

ఉత్త‌రాంధ్రలో వారాహియాత్ర నిర్వ‌హిస్తున్న జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అధికార పార్టీపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఎవ‌రికి ఎవ‌రూ త‌గ్గ‌డం లేదు. దూష‌ణ‌లు హ‌ద్దులు దాటుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో విశాఖ‌లో రుషికొండ‌, ఎర్ర‌మ‌ట్టి దిబ్బ‌ల సంద‌ర్శ‌న‌కు వెళ్లాల‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిర్వ‌యించుకోవ‌డం స‌ర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. రుషికొండ‌లో ప‌ర్యావ‌ర‌ణానికి విఘాతం క‌లిగించేలా త‌వ్వ‌కాలు చేప‌ట్టార‌ని, పూర్తిగా కొండ‌ను నాశ‌నం చేశార‌ని ఆయ‌న చాలా కాలంగా ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రుషికొండ‌, ఎర్రిమ‌ట్టి దిబ్బ‌ల సంద‌ర్శ‌న‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి నిరాక‌రించింది.

అయితే ప్ర‌భుత్వ ఆనుమ‌తితో సంబంధం లేకుండానే రుషికొండ‌ను సంద‌ర్శించాల‌ని ఆయ‌న డిసైడ్ అయ్యార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న‌కు ఆయ‌న వెళితే ఏమ‌వుతుందో అనే ఆందోళ‌న నెల‌కుంది. ఉత్త‌రాంధ్ర‌లో ఆయ‌న‌కు పెద్ద ఎత్తున అభిమానులున్నాయి. అలాగే విశాఖ‌లో జ‌న‌సేన‌కు కొంత బ‌లం వుంది. ప‌వ‌న్ క్షేత్ర‌స్థాయికి వెళుతున్నారంటే భారీ సంఖ్య‌లో అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ముందుకు క‌దిలే అవ‌కాశం ఉంది.

వీరిని క‌ట్ట‌డం చేయ‌డం పోలీసుల‌కు అంత సులువైన ప‌నికాదు. రుషికొండ విష‌యంలో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ప్ర‌భుత్వం త‌వ్వ‌కాలు చేప‌డుతోంద‌ని ఆయ‌న విమ‌ర్శిస్తుండ‌డంతో, అనుమ‌తి ఇచ్చే అవ‌కాశ‌మే లేదు. ఎటూ ప్ర‌భుత్వం త‌న‌ను అనుమ‌తి ఇవ్వ‌ద‌ని భావించి, క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న‌కు వెళ్లాల‌ని ఆయ‌న గ‌ట్టి నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెబుతున్నారు. అయితే ఏ ప్ర‌తిప‌క్ష పార్టీ అయినా ఇలాగే చేస్తుంది. అస‌లుసిస‌లు రాజ‌కీయం అంటే ప్ర‌భుత్వాన్ని ధిక్క‌రించి ముందుకెళ్ల‌డ‌మే. మ‌రి ప‌వ‌న్ ఏం చేస్తారో చూడాలి.