ఇరవై అయిదవ చిత్రం ఘన విజయం సాధించిందని అనిపించుకోవాలనే ఆరాటమో, లేక కాలర్ ఎగరేస్తూ తిరిగితే నాసిరకం సినిమాని నిఖార్సయిన విజయమని గుర్తిస్తారనే ఆలోచనో… కారణం ఏదైతే గానీ… మహర్షి చిత్రాన్ని తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం భేషుగ్గా జరుగుతోంది. నోటికొచ్చిన అంకెలని ప్రచారం చేస్తూ, ఇష్టానికి స్టేట్‌మెంట్లు ఇవ్వడంతో మహర్షి సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కి గురవుతోంది.
వారం రోజుల్లోనే మహేష్‌బాబు కెరియర్‌లో అత్యుత్తమ గ్రాసర్ అనే ప్రకటన అభిమానులకి సయితం మింగుడు పడడం లేదు. ఒకవైపు కలక్షన్ల ట్రాకింగ్ వున్న ఓవర్సీస్‌లో మహర్షి అండర్ పర్‌ఫార్మ్ చేస్తోంటే, నైజాంలో, దిల్ రాజు విడుదల చేసిన ఏరియాల్లో మాత్రం బాహుబలికి తీసిపోని సినిమా అని దంచి కొడుతున్నారు. సీడెడ్, ఓవర్సీస్‌లో పెద్ద ఫ్లాప్ దిశగా సాగుతోన్న మహర్షికి తెలుగు రాష్ట్రాల్లో టాక్ కంటే బెటర్ కలెక్షన్లు వచ్చిన మాట నిజమే.
అలా అని మరీ ఈ 'దూకుడు' ప్రదర్శిస్తూ అఫీషియల్ స్టేట్‌మెంట్లు ఇస్తూ పోతే మహేష్ ఘన విజయాలని తనంతట తానే చిన్నబుచ్చుకున్నట్టు అవుతుంది. మహేష్ నుంచి మళ్లీ పోకిరిలు, శ్రీమంతుడులు రావా ఏమిటి? మరి వాటిని విజయాలుగా చూపించడానికి ఎన్ని కోట్ల వసూళ్ల పోస్టర్లు వేస్తారు? ఇటు మహేష్‌కి, ఇటు దిల్ రాజుకి కూడా విజయం సాధించడం కంటే విజయం సాధించామని అనిపించుకోవడం ప్రెస్టీజ్ ఇష్యూగా మారినట్టుందని సినీ జనం కూడా ఓపెన్‌గానే కామెంట్ చేస్తున్నారు.