అసలు ఇన్ని కబుర్లేల శివాజీ?

నటుడు శివాజీ ఓ సెల్ఫ్ విడియోను బయటకు వదిలారు. గత కొంతకాలంగా శివాజీ మీద, టీవీ 9 ఎక్స్ సిఇఒ రవిప్రకాష్ మీద వస్తున్న వార్తల దుమారానికి బదులు అన్నట్లుగా, వివరణ అన్నట్లుగా ఆయన…

నటుడు శివాజీ ఓ సెల్ఫ్ విడియోను బయటకు వదిలారు. గత కొంతకాలంగా శివాజీ మీద, టీవీ 9 ఎక్స్ సిఇఒ రవిప్రకాష్ మీద వస్తున్న వార్తల దుమారానికి బదులు అన్నట్లుగా, వివరణ అన్నట్లుగా ఆయన ఈ విడియో వదలడం విశేషం.

చిత్రమేమిటంటే, పోలీసులు విచారణకు రమ్మని అంటే రాకుండా, దాక్కుని, ఇంకా మరి కాస్త సమయం అంటూ కౌంటింగ్ డేట్ నాడు అద్భుతం జరుగుతుందనే ఆశతో, వాయిదాలు వేస్తూ వస్తున్న శివాజీ ఈ లోగా ఈ విషయాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం మొదలు పెట్టారు.

సమస్య అంతా తనకు రవిప్రకాష్ కు మధ్య అని, అది సివిల్ పంచాయతీ అని, దాన్ని క్రిమినల్ పంచాయతీ చేస్తున్నారని, పోలీసులు కావాలని తనపై కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. పనిలో పనిగా సెటిలర్ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేసారు. 

కానీ అసలు విషయాలు దాటవేసారు.

అసలు శివాజీ ఎక్కడ వున్నారు. సన్ స్ట్రోక్ తో ఎక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంట్లో అయితే లేరు. వుండి వుంటే పోలీసులు విచారించి వుండేవారు.

శివాజీ అసలు అరెస్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు.? పోలీసులు అరెస్ట్ చేస్తామని ఏమీచెప్పలేదు కదా?

నెహ్రూ జైలులో తొమ్మిదేళ్లు వున్నది స్వాతంత్ర్యపోరాట మీద. మరే నేరం మీద కాదు. దానికి అభ్యంతరం లేదు అన్నపుడు మరి జగన్ ను పదే పదే జైలుకు వెళ్లి వచ్చారని తెలుగుదేశం జనాలు విమర్శిస్తూ వుంటారు?

శివాజీ కి రవిప్రకాష్ కు మధ్య జరిగింది సివిల్ వ్యవహారమే. కానీ, దాని కారణంగా కొన్ని వందల కోట్ల సంస్థ వ్వవహారాలు ప్రభావితం అవుతున్నపుడు, ఆ కేసును సీరియస్ గా తీసుకోవాల్సి వుందా? లేదా? 

సాధారణంగా షేర్ లు డీ మాట్ అక్కౌంట్ తో కొంటారు.లేదా పక్కా కాగితం పత్రం పెట్టుకుని కొంటారు. తెల్లకాగితాల మీద ఎవరైనా కొంటారా? దానికి సమాధానం చెప్పరేమి?

ఈ షేర్ల కోసం శివాజీ నగదు చెల్లించారా? బ్యాంక్ ద్వారానా? బ్యాంక్ ద్వారా అయితే ఎప్పుడు? నగదు అయితే ఆ నగదు ఎలా వచ్చింది అన్నది చూపించాల్సి వుంటుంది కదా?

శివాజీ అనర్గళంగా విడియోలో శుభ్రంగా మాట్లాడారు. మరి ఆ మాత్రం దానికి తనకు బాగాలేదని, సన్ స్ట్రోక్ అని చెప్పడం ఏమిటి? అవే మాటలు పోలీసులకు కూడా వెళ్లి చెప్పవచ్చు కదా?
పోనీ తాను పరారీలో లేను, ఇంట్లో వున్నాను అన్నారు. ఏ ఇంట్లో, హైదరాబాద్ లోనేనా? అన్నది చెప్పలేదేమి?

ఇదంతా చూస్తుంటే తనను కావాలని ఇరికిస్తున్నారని ఎదురు దాడికి దిగడం, అలాగే కౌంటింగ్ వరకు కాలయాపన చేయడం తప్ప వేరే ఉద్దేశం కాదని క్లియర్ గా తెలుస్తోంది. ఆంధ్రలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే కాస్త పరిస్థితి మారుతుందనే అంచనాతో శివాజీ వున్నట్లు కనిపిస్తోంది.

కొసమెరపు ఏమిటంటే, ఆంధ్ర జనాల ఖర్మ బాలేక వేరే ప్రభుత్వం వస్తే అనే అర్థంలో శివాజీ విడియోలో మాట్లాడారు.జనాల ఖర్మ బాలేక కాదు, శివాజీ అదృష్టం బాలేక అనుకోవాలేమో? తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోవడం అంటే జనాల ఖర్మ అని అనడం శివాజీ ఐడియాలజీకి పరాకాష్ట అనుకోవాలి.