నాగార్జున తనయుడు నాగచైతన్య ఒక పాత్రలో నటించిన లాల్ సింగ్ చద్ధా ట్రెండింగ్ లో ఉంది. హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ కు రీమేక్ గా ఈ సినిమా రూపొందింది.
హాలీవుడ్ వెర్షన్లో ఒక నల్ల సైనికుడి పాత్రను హిందీ వెర్షన్లో చైతూ చేశాడని స్పష్టం అవుతోంది. కథ కన్నా.. కథనమే ప్రధానంగా సాగే ఫారెస్ట్ గంప్ లో ఆ పాత్ర ఆసక్తిదాయకమైనదే. మరి ఆమిర్ ఖాన్ సినిమా చైతన్యకు ఏ మేరకు గుర్తింపును ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది.
ఆ సంగతలా ఉంటే.. చైతన్య మరో బాలీవుడ్ సినిమా ప్రయత్నాల్లో ఉన్నట్టుగా ఉన్నాడు. అది మరో బిగ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీతో కావడం విశేషం. భన్సాలీతో నాగ చైతన్య సమావేశం అయ్యాడు. దీంతో వీరి కాంబినేషన్లో సినిమా ఖాయమనే ప్రచారం మొదలైంది. అయితే చైతన్య ఈ విషయాన్ని గట్టిగా ఖండించలేదు.
అలాగని ఖాయమని చెప్పనూ లేదు. తమది క్యాజువల్ మీటింగే అంటున్నాడు చైతన్య. అయితే వీరి సమావేశం కథా చర్చే అని.. నాగచైతన్య మరో బాలీవుడ్ సినిమాలో నటించడం ఖాయమనే ప్రచారం అయితే జరుగుతోంది.
గతంలో నాగార్జున కూడా పలు డైరెక్ట్ హిందీ సినిమాల్లో నటించారు. బాలీవుడ్ దర్శకులతో పని చేశాడు. మిశ్రమ ఫలితాలను పొందాడు నాగార్జున. ఇటీవలే మళ్లీ నాగ్ బాలీవుడ్ లో చేస్తున్నాడు. మరి తండ్రి దారిలో పయనిస్తూ నాగచైతన్య కూడా హిందీ చిత్ర పరిశ్రమలో ఉనికి చాటే ప్రయత్నంలో ఉన్నాడేమో!