ఈవారం రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే ఏమిటంట? ప్రతివారం ఏవో సినిమాలు విడుదలవుతూనే వుంటాయి కదా. కానీ ఎప్పుడూ రెండు సినిమాలు విడుదలైతే ఒకే రేంజ్ రాదు. ఒకటి ఎక్కువ..ఒకటి తక్కువ వుంటూ వుంటుంది.
కానీ ఈవారం విడుదలవుతున్న రెండు సినిమాలు పక్కా పోట్ల గిత్తల మాదిరిగా థియేటర్ల దగ్గర కుమ్మేయడానికి రెడీ అయిపోయాయి. ఏదీ తక్కువ కాదు. ఏదీ ఎక్కువ కాదు. రెండూ రెండే.
సీతారామం…బింబిసార. రెండూ నామ వాచకాలే. సీతారామం సినిమాలో ఇద్దరు కావచ్చు కానీ ఒక్క పేరులాగే ధ్వినిస్తుంది. వాడుక కూడా అలాగే వుంటుంది. బింబిసార చారిత్రక చక్రవర్తి పేరు. సీతారామం పౌరాణిక చక్రవర్తి పేరు.
సౌత్ ఇండియాలో మంచి హీరోగా పేరు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ హీరో ఒక దాంట్లో, నందమూరి వారసత్వాన్ని అందుకుని, ముందుకు వెళ్తున్న హీరో కళ్యాణ్ రామ్ రెండో సినిమాలో హీరోలు.
సీతారామం క్లాస్ సినిమా అయితే బింబిసార మాస్, ఎమోషనల్ సినిమా. సీతారామం హీరో పక్కా సాఫ్ట్. బింబిసార హీరో ఫుల్ ఫెరోషియస్. ఈ సినిమా నెమ్మదిగా, ఓ కవిత మాదిరిగా, ఓ పెయింటింగ్ లా నడుస్తుంది. ఆ సినిమా దూకుడుగా సాగుతూ, ఎమోషనల్ గా మారుతుంది.
ఈ సినిమా కు ఆ సినిమాకు కూడా గట్టిగా ప్రమోషన్ జరిగింది. ఎవరి రేంజ్ లో వారు విభిన్నమైన పద్దతుల్లో ప్రచారం సాగించారు. వైవిధ్య మైన ప్రమోషన్ చేసారు. సీతారామం సినిమాకు బాహుబలి ప్రభాస్ గెస్ట్ గా వచ్చి అలరిస్తే, బింబిసార సినిమాకు కొమరంపులి ఎన్టీఆర్ వచ్చారు.
ఇలా రెండు సినిమాలు ఫుల్ బజ్ తెచ్చుకున్నాయి. మాట్నీలు, ఫస్ట్ షో లు అన్నవి టాక్ ను బట్టి వుంటాయి. మార్నింగ్ షో లు అన్నవి బజ్ ను బట్టి వుంటాయి. ఇక ఇప్పుడు కూడా టికెట్ లు తెగపోతే, ఇప్పుడు కూడా మార్నింగ్ షో లు ఫుల్ కాకపోతే టాలీవుడ్ పరిస్థితిని అనుమానించాల్సి వస్తుంది.
అందుకే ఇటు సినిమా జనాలు. అటు సినిమా అభిమానులు కూడా ఈ రెండింటి మీద దృష్టి పెట్టి వున్నారు.