వారసుడి పేరు సూచించాలని కేంద్ర ప్రభుత్వం అడగడమే ఆలస్యం… సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. తన వారసుడిగా ఉదయ్ ఉమేశ్ లలిత్ పేరును ఎన్వీ రమణ సిఫార్సు చేశారు. ఈ నేపథ్యంలో భారత సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లలిత్ నియమితులు కానున్నారు.
ఎన్వీ రమణ పదవీ కాలం ఈ నెల 26వ తేదీన ముగుస్తుంది. దీంతో కొత్త చీఫ్ జస్టిస్ ఎంపికపై కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొలీజియం కసరత్తు చేశాయి. సంప్రదాయం ప్రకారం పదవీ విరమణ చేస్తున్న చీఫ్ జస్టిస్‌ను వారసుడు ఎవరైతే బాగుంటుందో సూచించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.
తన తర్వాత సీనియర్ జాబితాలో ఉన్న జస్టిస్ లలిత్ పేరును ఎన్వీ రమణ సిఫార్సు చేయడం విశేషం. కేవలం మూడు నెలల్లోపు మాత్రమే చీఫ్ జస్టిస్ పదవిలో జస్టిస్ లలిత్ కొనసాగనున్నారు. ఆగస్టు 13, 2014న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ లలిత్ సుప్రీంకోర్టుకు నేరుగా పదోన్నతి పొందిన ఆరో సీనియర్ న్యాయవాది.
ఈ నెల 26 తర్వాత బాధ్యతలు చేపట్టే జస్టిస్ లలిత్ నవంబర్ వరకూ పదవిలో కొనసాగనున్నారు. తీవ్ర సంచలనం రేకెత్తించిన త్రిఫుల్ తలాక్‌తో సహా పలు కీలక కేసులకు సంబంధించి తీర్పులిచ్చిన ధర్మాసనంలో జస్టిస్ లలిత్ ఉన్నారు. అలాగే కేరళలోని శ్రీపద్మనాభస్వామి ఆలయ నిర్వహణపై హక్కు అప్పటి రాజ కుటుంబానికి ఉంటుందనే జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.