రాష్ట్రంలోనే తిరుపతి అసెంబ్లీ సీటుకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రానికి నెలవు కావడంతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపై ఉంటుంది. దివంగత ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తర్వాత అక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా పీఆర్పీ నెలకొల్పిన తర్వాత తిరుపతిలో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు.
ఇలా ప్రముఖులు ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గంగా తిరుపతికి విశేష ప్రాధాన్యం వుంది. ప్రస్తుత అక్కడ వైసీపీ తరపున భూమన కరుణాకరరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2019లో టీడీపీ అభ్యర్థిగా సుగుణమ్మ బరిలో ఉన్నారు. 2024లో టీడీపీ అభ్యర్థిని మార్చాలనే ఆలోచనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. ప్రస్తుతం ఉన్న నాయకత్వానికి వైసీపీని ఎదుర్కొనే సామర్థ్యం లేదని ఇటీవల తిరుపతిలో జరిగిన పలు ఎన్నికల ద్వారా టీడీపీ గ్రహించింది.
ఈ నేపథ్యంలో బలిజ సామాజిక వర్గంలో ఆర్థిక పుష్టి కలిగిన నాయకుడి కోసం టీడీపీ వెతుకుతోంది. ఇందులో భాగంగా జేబీ శ్రీనివాస్ అనే పారిశ్రామిక వేత్తను తిరుపతి టీడీపీ ఇన్‌చార్జ్‌గా నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. తాజాగా ఆయన ఇంటికి టీడీపీ జాతీయ కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి వెళ్లి చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. టికెట్ ఇస్తే ఎంత డబ్బైనా ఖర్చు పెడతానని నల్లారితో జేబీ అన్నట్టు సమాచారం. వైసీపీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం తనకు ఉన్నాయని జేబీ అన్నట్టు తెలిసింది. జేబీతో నల్లారి మంతనాలు జరిపారని తెలిసి సుగుణమ్మ గుర్రుగా ఉన్నారని సమాచారం.
తిరుపతి వైసీపీ నేతలతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని పార్టీని బలహీనపర్చారని సుగుణమ్మ, ఆయన అల్లుడు సంజయ్ తదితర టీడీపీ నేతలపై అధిష్టానం ఆగ్రహంగా ఉంది. కార్యకర్తలు బలంగా ఉన్న తిరుపతిలో టీడీపీని పునర్నిర్మించుకునే పనిలో అధిష్టానం ఉంది. పార్టీకి యువ రక్తం ఎక్కించాలనే క్రమంలో జేబీ శ్రీనివాస్ అభ్యర్థిత్వంపై టీడీపీ ఆసక్తికనబరు స్తోందని తెలిసింది.
అలాగే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ నాయకత్వ బాధ్యతల్ని రెడ్డి సామాజిక వర్గ నేతకు అప్పగించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా తిరుపతిలో టీడీపీని కాపాడుకునేందుకు నాయకత్వ మార్పు ఒక్కటే ఏకైక మార్గంగా అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చిందనేది వాస్తవం. ఈ పరిణామాలను సుగుణమ్మ, ఆమె అల్లుడు ఎలా తీసుకుంటారనేది చర్చనీయాంశమైంది. మరోవైపు అత్తాఅల్లుడు జనసేనానితో టచ్‌లో ఉన్నారనే ప్రచారం కూడా సాగుతోంది.