హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్లో మాట్లాడుతూ దొరికిపోయాడు. దీంతో ప్రత్యర్థులు గోరంట్ల మాధవ్‌ను, వైసీపీని సోషల్ మీడియాలో చెడుగుడు అడుకుంటున్నారు. రాయడానికి, చూపడానికి కూడా ఇబ్బందికర రీతిలో గోరంట్ల మాధవ్ అసభ్యంగా కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గోరంట్ల వ్యవహారంతో వైసీపీ ఇరకాటంలో పడింది. సొంత ఎంపీ దిగంబరత్వాన్ని ఎలా సమర్థించుకోవాలో కూడా దిక్కుతోచని స్థితిలో వైసీపీ ఉంది. సీఐగా పని చేస్తూ రాజకీయాల్లోకి గోరంట్ల మాధవ్ వచ్చాడు. టీడీపీ హయాంలో పోలీసుల్ని నాటి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి బూతులు తిట్టడం, ఆయనపై గోరంట్ల మీసాలు తిప్పుతూ సవాల్ విసరడంతో వార్తలకెక్కాడు. పోలీస్ అధికారిగా కూడా గోరంట్ల ఎప్పుడూ ఏదో ఒక సంచలనమే.
గోరంట్ల మాధవ్ రాజకీయాలపై ఆసక్తితో వైసీపీలో చేరాడు. హిందూపురం టికెట్ దక్కించుకోవడంతో పాటు టీడీపీ కోటలో గెలిచి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఎంపీగా ప్రత్యర్థులపై దూకుడుగా వ్యవహరిస్తాడనే పేరుంది. తాజాగా నగ్నంగా పట్టుబడి ప్రత్యర్థులకు ఆయుధం ఇచ్చాడు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న వైసీపీని కూడా నగ్నంగా నడిబజారులో నిలబెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అత్యున్నత చట్టసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న వ్యక్తి, ఇలా ఒళ్లు తెలియకుండా వ్యవహరించడం ఏంటనే నిలదీతలు వ్యక్తమవుతున్నాయి. పార్టీకి అప్రతిష్టపాలు తెచ్చేలా వ్యవహరించిన గోరంట్ల మాధవ్‌పై వైసీపీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. మాధవ్‌ను వెనకేసుకొస్తే వైసీపీ కూడా నగ్నంగా నడిరోడ్డుపై నిలబడ్డట్టే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.