అమెరికా గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ, టెక్నాలజీలో పోటీ పడుతున్న చైనా అంటే అగ్రరాజ్యానికి ఎప్పటినుంచో కడుపు మంట. సరిగ్గా కరోనా టైమ్ లో చైనాని ఒంటరి చేయాలని అగ్రరాజ్యం తీవ్రంగా ప్రయత్నించింది. చైనా వైరస్ అంటూ కరోనాకి పేరుపెట్టి ఆ దేశాన్ని టార్గెట్ చేసింది కూడా.
ఇప్పటికీ చైనాలోని వుహాన్ ల్యాబ్ పై రోజుకో అధ్యయనం వెలుగులోకి వస్తోంది. అది సహజ వైరస్ కాదని, బయోవార్ కోసం చైనావాళ్లు తయారు చేసిన వైరస్సేననే కథనాలు లెక్కకు మిక్కిలి కనపడుతుంటాయి. తాజాగా టీకా వ్యవహారంలో కూడా చైనాని టార్గెట్ చేసింది అమెరికా. చైనా టీకా పనిచేయట్లేదని అమెరికా మీడియా వరుస కథనాలనిస్తోంది.
కరోనా వైరస్ ని ఎదుర్కునేందుకు చైనా రెండు రకాల టీకాలు తయారు చేసింది. ఒకటి సైనావాక్, రెండోది సైనా ఫార్మ్. సైనో వాక్ టీకా 51శాతం సామర్థ్యంతో సైనా ఫార్మ్ వ్యాక్సిన్ 78.1 శాతం సామర్థ్యంతో పనిచేస్తాయని అధ్యనాలు చెబుతున్నాయి. అయితే ఈ టీకాల సామర్థ్యం అంతకంటే చాలా తక్కువ అని న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. దానికి సంబంధించిన వివరాలు కూడా పోస్ట్ చేసింది.
చైనాతో పాటు ఆ దేశం తయారు చేసిన రెండు టీకాల్ని దాదాపు 90 దేశాలు వాడుతున్నాయి. షీషెల్స్, బహ్రెయిన్, చిలీ, మంగోలియా, ఇండోనేషియా.. దేశాల్లో దాదాపు 50నుంచి 68శాతం వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది కూడా. ఆ స్థాయిలో వ్యాక్సినేషన్ పూర్తయితే కొవిడ్ వ్యాప్తి దాదాపుగా తగ్గిపోవాలి.
కానీ చైనా టీకా వాడిన మంగోలియాలో కొత్తగా రోజువారీ కేసుల సంఖ్య 2400 చేరుకుంది. ఆ దేశ జనాభాతో పోల్చి చూస్తే ఇది చాలా ఎక్కువ. ఇండోనేషియాలో కొత్త వేరియంట్ ఇప్పుడిప్పుడే ఉధృతమవుతోంది. అక్కడ సైనోవాక్ టీకా తీసుకున్న 350 మంది డాక్టర్లు, హెల్త్ వర్కర్లు మళ్లీ కరోనాబారిన పడ్డారు. వీటిని ఉదాహరణగా చూపెడుతూ చైనా టీకా సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది అమెరికా.
అయితే చైనా టీకాలు వాడుతున్న దేశాలు మాత్రం వ్యాక్సినేషన్ కి, వైరస్ వ్యాప్తికి సంబంధం లేదని చెబుతున్నాయి. అటు చైనా కూడా ఈ వ్యతిరేక కథనాలపై తీవ్ర స్థాయిలో స్పందిస్తోంది. అమెరికా సహా ఇతర దేశాల కంపెనీలు తయారు చేసే టీకాలని వాడే దేశాల సంఖ్య తక్కువ అని, చైనా టీకా వాడే దేశాల సంఖ్యే ఎక్కువని చెబుతోంది ఆ దేశ ప్రభుత్వం. అందుకే అమెరికా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోందని మండిపడుతోంది.
గతంలో వైరస్ విషయంలో చైనా, అమెరికా మధ్య మొదలైన గొడవ.. ఇప్పుడు టీకా విషయంలో కూడా కొనసాగుతోందనే విషయం అర్థమవుతోంది. దాదాపుగా అన్ని దేశాల్లోనూ, అన్ని రకాల టీకాలు వేసుకున్నవారిలోనూ వైరస్ లక్షణాలు అక్కడక్కడా కనపడుతున్నాయి. కొన్నిసార్లు రెండు డోసుల టీకా వేసుకున్నవారు కూడా కరోనా బారిన పడిన సందర్భాలున్నాయి. ఈ దశలో చైనా టీకాని టార్గెట్ చేసుకుంటూ అమెరికా కథనాలు ఇవ్వడం కలకలం రేపింది.