ఏపీలో ఇప్పటికే పోలింగ్ పూర్తైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హై కోర్టు సింగిల్ జడ్జి తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 150 కోట్ల రూపాయల ప్రభుత్వ వ్యయంతో నిర్వహించిన ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. ఎన్నికల నోటిఫికేషన్లో నాలుగు వారాల కోడ్ గడువు లేకపోవడంతో ఈ ఎన్నికలు రద్దు అయినట్టుగా అప్పట్లో పత్రికల్లో వార్తలు వచ్చాయి.
వాస్తవానికి ఇలాంటి అన్ని అంశాల మీదా పోలింగ్ కు ముందు రకరకాల కోర్టుల్లో విచారణలు జరిగాయి. అన్ని కోర్టులనూ దాటుకుని పోలింగ్ కు ముందు రోజున ఒక కోర్టు తీర్పు మేరకే ఎన్నికల ప్రక్రియ జరిగింది. పోలింగ్ కు ముందు రోజు వరకూ కూడా పోలింగ్ జరుగుతుందా లేదా అనే అంశం కోర్టుల పరిగణనలోనే ఉంది!
పోలింగ్ కు ముందు రోజున కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లనే పోలింగ్ జరిగింది! అయితే కోర్టు తీర్పు ఆధారంగా జరిగిన పోలింగ్ నే మరో కోర్టు కొట్టివేసింది. పోలింగ్ ప్రక్రియను మరోసారి నిర్వహించాలని, ఈ సారి గడువు నియమాన్ని కూడా ఫాలో కావాలని కోర్టు తీర్పులో పేర్కొన్నారట!
ఈ నేపథ్యంలో ఈ అంశం మరోసారి కోర్టునే చేరింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులు అసమంజసంగా ఉన్నాయనే అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఏపీ ఎన్నికల కమిషనర్ హై కోర్టు ధర్మసనాన్ని ఆశ్రయించారట. ఎన్నికలను రద్దు చేస్తూ తీసుకున్న తీర్పును రద్దు చేయాలని ఎస్ఈసీ కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియ ఒక్కసారి ప్రారంభం అయ్యాకా అందులో కోర్టులు జోక్యం చేసుకోకూడదని, ఈ మేరకు సుప్రీం తీర్పు కూడా ఉందని ఎస్ఈసీ ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది.
అలాగే ఎన్నికలను రద్దు చేస్తూ తీర్పును ఇచ్చిన సింగిల్ జడ్జి అవసరానికి మించి విచారించారని, అంతర్జాతీయ ఒడంబడికలను ప్రస్తావించారని, తనపై కూడా అలా వ్యాఖ్యలు చేయాల్సింది కాదంటూ ఎస్ఈసీ ధర్మాసనం వద్ద దాఖలు చేసిన తన పిటిషన్లో పేర్కొన్నారట!
మొత్తానికి కోర్టు తీర్పు మేరకు జరిగిన ఎన్నికలను మరో కోర్టు రద్దు చేయగా, ఇప్పుడు ఇంకో ధర్మాసనం విచారిస్తోంది. ఇలా ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ రకరకాల మలుపులు తిరుగుతూ సాగుతూ ఉంది. ఇప్పుడు హైకోర్టు ధర్మాసనం ఈ ఎన్నికలను విచారించనుంది. ఇక్కడ ఏ తీర్పు వచ్చినా.. పై కోర్టుకు వెళ్లే వాళ్లు వెళ్తారేమో! కాబట్టి.. ఇప్పుడప్పుడే ఇది తేలే అంశమేనా అనే డౌట్ కొనసాగనుంది.