రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకున్న నేపథ్యంలో సహజంగానే రాజకీయం వేడెక్కింది. తాము చెప్పినట్టు తలాడించే నమ్మకస్తుడైన మిత్రుడు వైఎస్ జగన్ అని భావించిన కేసీఆర్‌కు షాక్ తగిలింది. తమ రాష్ట్ర ప్రయోజనాల తర్వాతే స్నేహమైనా, రాజకీయం అయినా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన చర్యలతో కేసీఆర్‌కు తేల్చి చెప్పారు. జగన్ మొండి వైఖరిని కేసీఆర్ జీర్ణించుకోలేకున్నారు. జగన్‌ను దెబ్బ తీసి తన సత్తా ఏంటో రుచి చూపాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నార నేందుకు …గత కొంత కాలంగా ఆయన వేస్తున్న ఎత్తులు చెప్పకనే చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌ను టార్గెట్ చేసేందుకు కేసీఆర్ ఎవరూ ఊహించని విధంగా సరికొత్త క్యారెక్టర్‌ను రంగంలోకి దింపారు. జగన్‌పై ఆయన సామాజిక వర్గానికి చెందిన రెడ్డి నాయకుడిని కేసీఆర్ తెరపైకి తెచ్చారు. ఆ పొలిటికల్ క్యారెక్టరే తెలంగాణ గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. కేసీఆర్ కేబినెట్లో సీనియర్ మంత్రులున్నప్పటికీ, వారెవరూ నోరు మెదపకపోవడం వెనుక కేసీఆర్ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది.
ఏపీ జలచౌర్యంపై విమర్శలు చేస్తున్న వేముల ప్రశాంత్‌రెడ్డి తెలంగాణ జలవనరులశాఖ మంత్రేమీ కాదు. కానీ తనకు సంబంధం లేని డిపార్ట్మెంట్కు సంబంధించిన వ్యవహారాల్లో తలదూర్చి, ఏపీలో అత్యధిక ప్రజాదరణ కలిగిన దివంగత వైఎస్సార్, ఆయన తనయుడు వైఎస్ జగన్‌పై ఎందుకు విమర్శలు చేస్తున్నారనే అనుమానాలు ఎవరికైనా రావచ్చు. దానికి ఏకైక కారణం వేముల ప్రశాంత్‌రెడ్డి …ఏపీ సీఎం సామాజిక వర్గం కావడమే.
తెలంగాణలో రెడ్ల సామాజిక వర్గం చాలా బలంగా ఉంది. అలాగే తెలంగాణలో అన్ని కులాల్లో వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దానికి వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు అదనంగా ఆయన సామాజిక నేపథ్యం కూడా కలిసి వచ్చింది.
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ఇతర సామాజిక వర్గం నేతలు విమర్శలు చేస్తే ….వైఎస్సార్ అభిమానులు, రెడ్ల సామా జిక వర్గంలో వ్యతిరేకత వచ్చి, రాజకీయంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కేసీఆర్ భావించి ఉండొచ్చు. అందుకే ఆయన వేముల ప్రశాంత్‌రెడ్డిని జగన్‌పై ఉసిగొల్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో దివంగత వైఎస్సార్, జగన్‌లపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఘాటు విమర్శలు చేయడాన్ని అర్థం చేసుకోవాలి.
జల చౌర్యంలో వైఎస్సార్ దొంగ అయితే ఆయన కుమారుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ గజదొంగ అని వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే తన వ్యాఖ్యలు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని తిట్టినట్టు నెగెటివ్‌గా వెళ్లాయని మంత్రి గ్రహించి 24 గంటల్లోనే దిద్దు బాటు చర్యలు చేపట్టారు. తమ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం రైతుల పొట్టగొట్టే అక్రమ ప్రాజెక్టులు కట్టిన, కట్టే ప్రయత్నం చేస్తున్న ఆంధ్ర పాలకులను ఉద్దేశించే తాను మాట్లాడానని, రాయలసీమ, ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి కాదని మంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బద్ధ వ్యతిరేకి అని, సోనియాగాంధీకి తెలంగాణ ఇవ్వాలని ఉన్నా ఆయనే అడ్డుపడి అనేక మంది తెలంగాణ బిడ్డల చావుకు కారణం అయ్యారని విమర్శించారు. వైఎస్సార్ ముమ్మాటికీ తెలంగాణ పాలిట రాక్షసుడేనని దుయ్యబట్టారు. తెలంగాణ నీళ్లను ఆంధ్రకు తరలించిన నీటి దొంగేనన్నారు. వైఎస్‌ని మించి రెట్టింపు నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏమనాలి? అని మంత్రి వేముల ప్రశ్నించారు.
వైఎస్సార్‌ను మించి రెట్టింపు నీటిని తరలించేందుకు వైఎస్ జగన్ ప్రయత్నిస్తుంటే తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ జల వనరులశాఖ మంత్రి ఎందుకు నోరు మెదపడం లేదనే ప్రశ్నలకు ఏమని జవాబిస్తారు? దివంగత వైఎస్సార్‌తో పాటు జగన్‌ను తిట్టడానికి వేముల ప్రశాంత్‌రెడ్డిని ఎంచుకోవడం వెనుక రాజకీయ ఎత్తుగడను పసిగట్టలేని స్థితిలో రెడ్ల సామాజిక వర్గంతో పాటు ఏపీ సమాజం లేదని కేసీఆర్ గ్రహిస్తే మంచిది. ఇలాంటి ఛీప్ ట్రిక్స్‌తో ఇంత కాలం ఉన్న గౌరవం పోగొట్టుకోవడం తప్ప ఒరిగేదేమీ ఉండదని గ్రహిస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.