ఆయన కాన్ఫిడెన్స్ ను మెచ్చుకోవాలి!

సాధారణంగా పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంలో ఎదురవుతున్న పరిణామాల గురించి మెగాస్టార్ చిరంజీవి స్పందించి మాట్లాడడం జరగదు. కాకపోతే బ్రో సినిమా తర్వాత.. రేగిన దుమారం.. ఆ సినిమాను ముడిపెట్టి సినీ ఇండస్ట్రీని మొత్తం…

సాధారణంగా పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంలో ఎదురవుతున్న పరిణామాల గురించి మెగాస్టార్ చిరంజీవి స్పందించి మాట్లాడడం జరగదు. కాకపోతే బ్రో సినిమా తర్వాత.. రేగిన దుమారం.. ఆ సినిమాను ముడిపెట్టి సినీ ఇండస్ట్రీని మొత్తం వైసీపీ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో చిరంజీవి అనవసరంగా జోక్యం చేసుకున్నారు. ఆయన మీద కూడా ప్రతివిమర్శలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో అనుకోని అతిథిలాగా కెఎ పాల్ కూడా తెరమీదకు వచ్చారు.

చిరంజీవి కూడా జనసేనలో చేరబోతున్నారని, అన్నదమ్ములు ఇద్దరూ కలిసి జనసేనను బిజెపిలో విలీనం చేసేందుకు అయిదువేల కోట్లకు బేరం పెట్టారని, దీని వెనుక మాస్టర్ మైండ్ అల్లు అరవింద్ కూడా ఉన్నారని కెఎ పాల్ చాలా కాన్ఫిడెంట్ గా ప్రకటించారు. 

చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడే.. దానిని కాంగ్రెసులో కలిపేస్తారని కెఎ పాల్ చెప్పారట. అలాగే అప్ప్లట్లో చిరు అయిదువేల కోట్లు పుచ్చుకుని పార్టీని కలిపేశారట. ఇప్పుడు మరో అయిదువేల కోట్లకు జనసేనను కూడా బిజెపిలో కలిపేస్తారట. ఈ విషయాలను ఆయన చాలా బలంగా, తన వద్ద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా.. జనసేనను విలీనం చేయడానికి మోడీ – పవన్ కల్యాణ్ మాట్లాడుకున్న సన్నివేశాన్ని.. అదృశ్యంగా ఆ గదిలో ఉండి తాను చూసినంత కాన్ఫిడెంట్ గా కెఎ పాల్ చెప్పగలరు. అలాంటి టేలెంట్ ఆయనకున్నంత స్థాయిలో సమకాలీన రాజకీయనాయకుల్లో మరెవ్వరికీ లేదన్నమాట వాస్తవం.

తెలుగు రాజకీయాల్లో నిత్య కమెడియన్ కెఎ పాల్ అని ప్రజలు అనుకుంటుంటారు. ఆయన చేసే విమర్శలు, ప్రజల కోసం ఆయన కురిపించే వరాలు అర్థంపర్థం లేకుండా ఉంటాయి. తలాతోకా గానీ, లాజిక్ గానీ ఉండదు. అయినా సరే జనం వాటిని చదువుతారు. సీరియస్ పుస్తకం చదువుతున్నప్పుడు.. మధ్యలో రిఫ్రెష్ కావడానికి జోకులు చదివినట్టుగా కెఎపాల్ ప్రకటనలుంటాయి.

నన్ను ముఖ్యమంత్రిని చేయండి లక్ష కోట్లు విరాళంగా తీసుకువస్తా లాంటి స్టాక్ డైలాగులు కెఎ పాల్ సొంతం. ఒక్కశాతం ఓట్లు సంపాదించే ప్రజాదరణ లేకపోయినా.. నేను సర్వేలు చేయించాను.. రాష్ట్ర ప్రజలందరూ నన్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు.. అని చెప్పగల తెగింపు ఆయన సొంతం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీని మళ్లీ గద్దె ఎక్కనివ్వనని అయిదు వందల ఎంపీ నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థులను పోటీచేయిస్తాను అని ప్రకటించడం పాల్ కు మాత్రం చెల్లిన ధైర్యం.

అగ్రపార్టీల్లోని నాయకులు కూడా చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటారు. చిల్లర విమర్శలు చేస్తుంటారు. అయితే ఆ విమర్శలు చేస్తున్న క్రమంలోనే అది వెటకారం అని, కేవలం నిందించడానికే ఆ మాటలు అంటున్నారని అర్థమైపోతుంది. కానీ పాల్ మాత్రం.. తాను చెబుతున్నది నిజం అని పూర్తిగా తాను నమ్మినట్టుగా, అందరూ నమ్మాలన్నట్టుగా మాట్లాడతారు. ఏది ఏమైనా.. కెఎ పాల్ స్థాయిలో ధీమాగా, అన్ని సంగతులూ తనకు తెలిసినట్టుగా కాన్ఫిడెంట్ గా మాట్లాడే వైఖరి మాత్రం ప్రజలకు ప్రతిసారీ నవ్వులు పూయిస్తుంటుంది.