పవన్.. కేంద్రం అసలు నీ మాట వింటే గనక..!!

కత్తి ఒకటే ఉంటుంది. దానితో పండును ముక్కలుగా కోసి తినొచ్చు, పేదలకు పెద్దవాళ్లకు పెట్టవచ్చు. అదే కత్తితోనే హత్యలు కూడా చేయవచ్చు. ఎవరు ఏం పనిచేస్తారనేది వారి వారి అంతరంగ స్థాయి, బుద్ధి, విచక్షణ,…

కత్తి ఒకటే ఉంటుంది. దానితో పండును ముక్కలుగా కోసి తినొచ్చు, పేదలకు పెద్దవాళ్లకు పెట్టవచ్చు. అదే కత్తితోనే హత్యలు కూడా చేయవచ్చు. ఎవరు ఏం పనిచేస్తారనేది వారి వారి అంతరంగ స్థాయి, బుద్ధి, విచక్షణ, వివేకం, వారిలోని చిత్తశుద్ధి, సంస్కారాలను బట్టి ఉంటుంది. ఈ సిద్ధాంతం ప్రకారం చూసినప్పుడు.. జనసేనాని పవన్ కల్యాణ్ సంస్కారాలు, ఆలోచన సరళి గురించి భయం కలుగుతోంది. ఆయన విశాఖపట్టణంలో వారాహి యాత్రలో భాగంగా జగదాంబ సెంటర్ లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడిన తీరు.. ఇలాంటి అభిప్రాయానికి కారణం.

కేంద్రం తనకు సాయం చేస్తుందని, కేంద్రం సాయంతో జగన్ ను ఒక ఆట ఆడిస్తానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఆడించకపోతే చూడు.. అంటూ సవాలు విసిరారు. పవన్ చాలా రొటీన్ గా మాట్లాడే ఇంకా అనేక ఆరోపణలు చేశారు గానీ.. కేంద్రం సాయంతో జగన్ పని పడతానని చెప్పిన మాటలే ఇప్పుడు కీలకం.

పవన్ కల్యాణ్ తాను రాష్ట్రస్థాయి నాయకుడిని కాదు, కేంద్రం స్థాయి నాయకుడిని అని తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చాలా తపన పడుతుంటారు. రాష్ట్ర భాజపా నాయకులతో మాట్లాడే అలవాటు లేకపోయినా.. కేంద్రంలోని మోడీ, అమిత్ షా తనకు చాలా మంచి స్నేహితులని గప్పాలు కొట్టుకుంటూ ఉంటారు. ఆ మాటలతో పోల్చుకుని చూసినప్పుడు.. కేంద్రం సాయం తీసుకుని జగన్ ఆట కట్టించడం అనేది పెద్ద కష్టం కాదని అనిపిస్తుంది.

కానీ ఇక్కడ ప్రజలకు ఒక సందేహం కలుగుతోంది. కేంద్రం నిజంగా పవన్ కల్యాణ్ మాటకు విలువ ఇస్తోంటే.. ఆయన కోరికను నెరవేర్చే ఉద్దేశం కేంద్రంలోని భాజపా నేతలకు ఉన్నట్లయితే.. ఆయన విశాఖ ఉక్కు ప్రెవేటీకరణను ఎందుకు ఆపలేకపోతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదాను తన వ్యక్తిగత సంబంధాల ద్వారా కేంద్రం ద్వారా ఎందుకు రాబట్టలేకపోతున్నారు? అనేదే సందేహం.

నా లక్ష్యం ముఖ్యమంత్రి కావడం కాదు.. ప్రజలకు సేవ చేయడమే.. అనే పడికట్టు మాటలను పవన్ పదేపదే చెబుతుంటారు. (అంతలోనే తద్విరుద్ధంగా నన్ను ముఖ్యమంత్రిని చేయండి మీ బాగోగులన్నీ నేను చూస్తా అని అందరితోనూ అనడం వేరే సంగతి) సీఎం పోస్టు ఆయన లక్ష్యం కూడా కానప్పుడు.. కేంద్రంతో మాట్లాడి ప్రత్యేకహోదా ఇప్పిస్తే గనుక.. రాష్ట్రప్రజలందరూ పవన్ ను దేవుడిలా పూజిస్తారనే సంగతిని ఆయన ఎందుకు గుర్తించలేకపోతున్నారు. 

ఆయనను ప్రజలు సీఎం చేయకపోయినా సరే.. ఆయనంటేనే తెలుగు జాతికి మహనీయుడు అని ప్రతి ఒక్కరూ శ్లాఘిస్తారు. పవన్ కల్యాణ్ అలాంటి అవకాశాన్ని ఎందుకు వదలుకుంటున్నారో తెలియదు. అందుకే, ప్రజలు, పవన్ కల్యాణ్.. అసలు కేంద్రం నీ మాట వినడం అంటూ జరిగితే గనుక.. ఆ రెండు పనులూ చేసి చూపించమని అంటున్నారు.