తిరుపతి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ప్రత్యేక స్థానం వుంది. ఎందుకంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హిందూ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల ఈ నియోజకవర్గ పరిధిలోకి రావడమే. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించడం అంటే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి సేవకు నియమితులైనట్టు భావిస్తారు. తిరుపతి అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల నుంచి ప్రస్తుతం వైసీపీ నేతలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
తాజాగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి రెండోసారి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. దీంతో రానున్న ఎన్నికల్లో మరెవరికైనా టికెట్ ఇస్తారేమో అనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇందులో నిజానిజాలేంటో తెలుసుకుందాం.
భూమన కరుణాకరరెడ్డి ఎమ్మెల్యే పదవీ కాలం పూర్తికాగానే ప్రత్యక్ష రాజకీయాల నుంచి నిష్క్రమించనున్నారు. ఇదే సందర్భంలో ఆయన వారసుడు భూమన అభినయ్‌రెడ్డి తిరుపతి రాజకీయాల్లో మరింతగా క్రియాశీలక పాత్ర పోషించనున్నారు. ప్రస్తుతం ఈ యువ నాయకుడు తిరుపతి డిప్యూటీ మేయర్‌గా వ్యవహరిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి భూమన అభినయ్‌రెడ్డి బరిలో దిగనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి టికెట్ ఖరారు చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.
రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రిని కరుణాకరరెడ్డి, అభినయ్ కలిసిన సందర్భంలో కూడా …ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుపతిలో గెలవాలని వైఎస్ జగన్ వారికి దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. అభినయ్‌కి సీఎం ఆల్ ది బెస్ట్ అని చెప్పి, వెన్నుతట్టి ప్రోత్సహించి పంపారని తెలిసింది. ఎన్నికల ముంగిట స్థానిక ఎమ్మెల్యేకు టీటీడీ చైర్మన్ పదవి దక్కడం రాజకీయంగా వైసీపీకి కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.
తిరుపతిలో టీటీడీ ఉద్యోగుల ఓట్లు కీలకం. గతంలో టీటీడీ చైర్మన్‌గా కరుణాకరరెడ్డి ఉన్నప్పుడు తమ అనుకూల నిర్ణయాలు తీసుకున్నారన్న కృతజ్ఞత ఉద్యోగుల్లో వుంది. ముఖ్యంగా ఇంటి స్థలాలు, అలాగే బ్రహ్మోత్సవాల్లో సేవలందించే ఉద్యోగులందరికీ స్థాయీబేధాలు లేకుండా బహుమానం (పెంచుతూ), సుమారు ఏడు వేల రెగ్యులర్ ఉద్యోగులతో పాటు విశ్రాంత ఉద్యోగులకు బంగారు డాలర్, పెద్ద లడ్డు, వడ తదితర వాటిని అందజేసి గౌరవం ఇచ్చారు.
ఇప్పుడాయన మరోసారి టీటీడీ చైర్మన్ కావడంతో ఆయనపై ఉద్యోగులు తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం పెంచుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తిరుపతిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ రోడ్లతో తిరుపతి నాలుగు వైపులా అభివృద్ధి చెందడానికి డిప్యూట్ మేయర్ అభినయ్ పునాదులు వేశారు. క్షేత్రస్థాయిలో వైసీపీని బలోపేతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అభినయ్ అభ్యర్థిత్వంపై సర్వే సంస్థలు పాజిటివ్ నివేదికలు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో అభినయ్‌కి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి. ఇప్పటికే అభినయ్ నియోజకవర్గంలో అన్ని వర్గాలను కలుస్తూ రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు.